Rain effect in Bhupalpally: తడిసిముద్దైన జయశంకర్ జిల్లా.. పంటలు వర్షార్పణం

author img

By

Published : Sep 7, 2021, 11:47 AM IST

Rain effect in Bhupalpally, crop loss with heavy rains

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జయశంకర్ భూపాలపల్లి(rains in jayashankar bhupalapally) జిల్లా తడిసిముద్దైంది. ఏపుగా పెరుగుతున్న పంటలు వర్షార్పణం(crop loss) అయ్యాయి. కుంభవృష్టితో అధిక నష్టం వాటిల్లుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోలెవల్ వంతెనలపై నీరు చేరి... పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెరువులు నిండుకుండలా మారాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్ష బీభత్సంతో వరద నీరు పంట పొలాల్లోకి చేరింది. ఈ కుంభవృష్టికి భారీగా పంట నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తడిసిముద్దైన జయశంకర్ జిల్లా

ఆదుకోవాలి

కష్టపడి విత్తనాలు నాటి... కలుపు తీసిన అనంతరం ఏపుగా పెరుగుతున్న పంటపొలాల్లోకి కళ్ల ముందే వరద నీరు ప్రవహిస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అన్నదాతలు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి... నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

స్తంభించిన రాకపోకలు

మరోవైపు కొన్ని గ్రామాల్లో వరద ప్రవాహంతో పాటు చేపలు కొట్టుకువస్తున్నాయి. వాటిని పట్టుకునేందుకు గ్రామస్థులు, మత్స్యకారులు వలలు పెడుతూ పోటీ పడుతున్నారు. జిల్లాలోని రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో రేగొండ-చిట్యాల ప్రధాన రహదారికి బుంగపడింది. వరద నీరు భారీ ప్రవహిస్తుండడం వల్ల గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. రంగయ్యపల్లి-పోచంపల్లి లోలెవల్ వంతెనపై వరద నీరు చేరి... రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైలెవల్ వంతెనలు ఏర్పాటు చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని... అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

రాత్రి వర్షానికి బాగా వరద వచ్చింది. తోటంతా కొట్టుకుపోయింది. ఇక్కడ మోరీకి ఒక బ్రిడ్జి సాంక్షన్ చేయాలి. నిరుడు పత్తి అంతా కొట్టుకుపోయింది. మూడు సంవత్సరాల నుంచి నష్టం జరుగుతోంది. పెట్టిన ఒక్క రూపాయి తిరిగివస్తలేదు. నీళ్లు ఆగకుండా దీనికి బ్రిడ్జి ఏర్పాటు చేసి వరదను ఎల్లగొట్టాలి. పెద్దలు దీనిపై చర్యలు తీసుకోవాలి.

-వేమన్న, రైతు

ఈ అకాల వర్షానికి తోటలు, పత్తి, పొలాలు అన్ని కొట్టుకుపోయాయి. తీవ్ర నష్టం కలిగింది. ప్రతి సంవత్సరం మోరీలో నీరు పడక అకాల వర్షాలకు కట్టలు తెగి పంటలు కొట్టుకుపోతున్నాయి. దీనికి బ్రిడ్జి సాంక్షన్ చేయించి... రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం.

-శ్రీనివాస్, రైతు

నాకు రెండెకరాల పొలం ఉంది. అంతా మునిగిపోతోంది. పోచంపల్లి రోడ్డుకు మోరీ కట్టక మునిగిపోతోంది. దీనికి బ్రిడ్జి కట్టాలి. మాకు నష్టపరిహారం చెల్లించాలి. మూడు సంవత్సరాల నుంచి ఇదే గోస. మొత్తం తెగి మునిగిపోతోంది. కొంచెం వెడల్పు చేసి బ్రిడ్జిని నిర్మించాలి.

-రామ్మూర్తి, రైతు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.