Forest Officers Suspend: అలసత్వంతో ఇద్దరు.. కాపాడే క్రమంలో మరో ఇద్దరు...

author img

By

Published : Jul 21, 2021, 7:12 PM IST

four-forest-officers-suspended-in-jayashankar-bhupalpally-district

అడవిలో దుండగులు నరికిన చెట్ల విలువ తెలియక అవగాహన లోపంతో... రికార్డుల్లో ఉన్న విలువ కంటే ఎక్కువగా రాయటమే ఆ నలుగురు అధికారులు సస్పెండ్​ కావడానికి మూల కారణమైంది. అంత విలువైన కలప దొంగతనంగా నరికారంటే.. ఆ అధికారుల అలసత్వమే కారణమని ఇద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. ఆ ఇద్దరి తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు అధికారులను కూడా విధుల నుంచి తొలగించారు. నలుగురు అధికారుల సస్పెన్షన్​ ఇప్పుడు ఆ శాఖలో హట్​టాపిక్​గా మారింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధికార దుర్వినియోగానికి పాల్పడారన్న ఆరోపణలతో... జిల్లా వ్యాప్తంగా నలుగురు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యారు. మేడిపల్లి బీట్ ఆఫీసర్ గీత, రాంపూర్ సెక్షన్ ఆఫీసర్ రాజేశ్​ను ఈ నెల 14న సస్పెండ్ చేయగా... వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మహాదేవపూర్ సెక్షన్ ఆఫీసర్ సతీశ్​, భూపాలపల్లి రేంజ్ ఆఫీసర్ రేణుకను విధుల నుంచి తొలగిస్తూ చీఫ్ కన్జర్వేటర్ పీసీసీఎఫ్​ శోభ ఉత్తర్వులు జారీ చేశారు. స్మగ్లర్లు చెట్లు నరికి దుంగలను ఎత్తుకెళ్లినందుకు ఇద్దరు అధికారులు, వాళ్లిద్దరినీ తప్పించే ప్రయత్నంలో మరో ఇద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేయటం ఇప్పుడు అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

విధుల్లో అలసత్వం..

జిల్లాలోని భూపాలపల్లి అటవీ రేంజ్​లో గల మేడిపల్లి బీట్​లో కొందరు స్మగ్లర్లు సుమారు 3 నెలల క్రితం 84 టేకు, 112 ఇతర చెట్లను నరికి దుంగలను తీసుకెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన బీట్ ఆఫీసర్ గీత... నరికిన చెట్టు మొదలుకు నంబర్లు వేసి తీసుకెళ్లిన దుంగల విలువను అంచనా వేశారు. కొత్తగా ఉద్యోగంలో చేరడం వల్ల అవగాహనా లోపంతో రికార్డులో లెక్కలు తప్పుగా ఎక్కించారు. లక్షన్నర విలువైన దుంగలకు గానూ.. నాలుగున్నర లక్షలుగా రాశారు. ఈ క్రమంలోనే స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులు నెలన్నర క్రితం మేడిపల్లి బీట్ పర్యవేక్షణకు వచ్చారు. రికార్డులను పరిశీలించి ఇంత విలువైన చెట్లను కోల్పోయినందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారులకు సూచించారు. ఈ మేరకు జూలై 14న బీట్ ఆఫీసర్ గీతతో పాటు సెక్షన్ ఆఫీసర్ రాజేశ్​ను సస్పెండ్ చేస్తూ డీఎఫ్ఓ భూక్య లావణ్య ఉత్తర్వులు జారీ చేశారు.

four-forest-officers-suspended-in-jayashankar-bhupalpally-district
భూపాలపల్లి రేంజ్ ఆఫీసర్ రేణుక

సినీ పక్కీలో పట్టుకున్న డీఎఫ్​ఓ..

స్మగ్లర్లు ఎత్తుకెళ్లిన దుంగలను రికవరీ చేశామని చెప్పుకునేందుకు మహదేవ్​పూర్​లోని అటవీ శాఖ డిపో నుంచి టేక్ దుంగలను ఈ నెల 17న రాత్రి సుమారు పది గంటలకు ట్రాక్టర్​లో తరలిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూపాలపల్లి ఎఫ్డీఓ కృష్ణప్రసాద్... డిపోకు చేరుకొని ట్రాక్టర్ నుంచి దుంగలను దింపుతుండగా వీడియో తీశారు. దుంగలను స్వాధీనం చేసుకుని, ట్రాక్టర్​ను సీజ్ చేశారు. అనంతరం దుంగలను తీసుకు వచ్చిన వారి నుంచి లిఖితపూర్వకంగా ఎవరు పంపించారు..? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు..? అనే పూర్తి వివరాలను నమోదు చేసుకున్నారు. పూర్తి నివేదికను జిల్లా అటవీ శాఖ అధికారికి అప్పగించగా... ఆమె చీఫ్ కన్జర్వేటర్ శోభకు పంపారు.

four-forest-officers-suspended-in-jayashankar-bhupalpally-district
మహాదేవపూర్ సెక్షన్ ఆఫీసర్ సతీశ్

సీరియస్​గా తీసుకున్న అటవీశాఖ

భూపాలపల్లి రేంజ్ ఆఫీసర్ రేణుకను సస్పెండ్ చేస్తూ... సోమవారం సాయంత్రం చీఫ్ కన్జర్వేటర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక డిపోలోని దుంగలను అక్రమంగా బయటకు పంపించిన మహాదేవ్​పూర్ సెక్షన్ ఆఫీసర్ సతీశ్​పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు సతీశ్​ను సస్పెండ్ చేస్తూ... మంగళవారం సాయంత్రం డీఎఫ్​ఓ లావణ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో చోటు చేసుకున్న ఘటన అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అవగాహన లేక బీట్ ఆఫీసర్ తప్పు చేస్తే... అన్నీ తెలిసిన రేంజ్ ఆఫీసర్ తనను తప్పించబోయి చిక్కడం, సహాయం చేయబోయి సెక్షన్ ఆఫీసర్ కూడా సస్పెండ్ కావడం ప్రభుత్వ శాఖలో హాట్ టాపిక్​గా మారింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.