రాష్ట్రంలో తొలి గన్నీ బ్యాగుల కర్మాగారం.. ఎక్కడో తెలుసా?

author img

By

Published : Oct 25, 2022, 3:39 PM IST

jute factory in Janagama district

Jute factory in jangaon district: జనగామ జిల్లాలో ప్రైవేటుగా నెలకొల్పిన గోనె సంచుల కర్మాగారం.. క్రమంగా ఉత్పత్తిని పెంచుకుంటోంది. 200 మందికి ఉపాధికి పని కల్పించేలా కంపెనీని విస్తరిస్తున్నారు. రోజు కూలీ చేసి పొట్ట పోసుకునే కూలీలు.. కంపెనీ ద్వారా ఉపాధి లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోనే తొలి గోనె సంచుల కర్మాగారం..

Jute factory in jangaon district: వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభించినా ముందుగా మొదలయ్యేది.. గోనె సంచుల కొరతే. కొనుగోళ్లకు తగ్గ రీతిలో సంచులు సరఫరా కాకపోవడంతో కళ్లాల్లోనే రోజుల తరబడి కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం మాణిక్యాపురం వద్ద 14 కోట్ల రూపాయల వ్యయంతో రెండున్నరేళ్ల క్రితం జూట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

నిర్మాణ పనులన్నీ పూర్తికావడంతో గత మూడు నెలల నుంచి ఇక్కడ గోనెసంచులు తయారౌతున్నాయి.ప్రస్తుతం రోజుకు 6 నుంచి 7 వేల వరకు గోనె సంచులు ఉత్పత్తి అవుతున్నాయి. తాయారీకి అవసరమైన ముడి సరకును కోల్‌కత్తా నుంచి తెప్పించుకుని యంత్రాల సాయంతో సంచులు తయారీ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉత్పత్తిని మరింత పెంచుకునే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కర్మాగారం ఎండీ తెలిపారు.

ప్రస్తుతం ఇక్కడ 80 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. మాణిక్యాపురం, ఎనబావి, కళ్లెం తదితర సమీప గ్రామాలకు చెందిన వారంతా ఎక్కువుగా ఇక్కడ పనిచేస్తున్నారు. కూలీ నాలి చేసుకుంటూ జీవించే తమకు కర్మాగారం ద్వారా చక్కని ఉపాధి దొరికిందని చెపుతున్నారు. వచ్చే ఆరు నెలలు, ఏడాది లోపే రోజుకు 20 వేల వరకు గోనె సంచుల తయారీ లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీంతో మరో 100 మందికిపైగా ఉపాధి దొరకనుంది.

"ప్రస్తుతం రోజుకు 6 నుంచి 7 వేల వరకు గోనె సంచులు ఉత్పత్తి అవుతాయి. అవసరమైన ముడి సరుకును కోల్​కత్తా నుంచి తెప్పించి యంత్రాల సాయంతో సంచులు తయారు చేస్తాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉత్పత్తిని మరింత పెంచుకునే లక్ష్యంగా పని చేేస్తున్నాం".- శ్రీనివాసరెడ్డి కర్మాగారం ఎండీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.