కోవర్టు రాజకీయాలు చేసేవారికి  మునుగోడు ప్రజలు బుద్దిచెప్తారన్న సంజయ్​

author img

By

Published : Aug 17, 2022, 6:25 PM IST

Updated : Aug 17, 2022, 7:39 PM IST

బండి సంజయ్

Bandi Sanjay జనగామ జిల్లాలో నిర్వహించిన భాజపా పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవర్టు రాజకీయాలు చేసేవారికి మునుగోడు ప్రజలు బుద్దిచెప్తారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిర్వహించే మునుగోడు సభకు వెయ్యి రూపాయలు ఇచ్చి ప్రజల్ని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. మునుగోడులో కాషాయ జెండా ఎగురుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Bandi Sanjay: మునుగోడులో కాషాయ జెండా ఎగురుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కోవర్టు రాజకీయాలు చేసేవారికి మునుగోడు ప్రజలు బుద్దిచెప్తారని పేర్కొన్నారు. భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని బండి సంజయ్ తెలియజేశారు. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు. ఈ నెల 21న నిర్వహించే మునుగోడు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరుతారని తెలిపారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కిష్టాగూడెంలో నిర్వహించిన భాజపా పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్ సభకు వెయ్యి రూపాయలు ఇచ్చి ప్రజల్ని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రజల మీద నమ్మకంతో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని తెలిపారు. కేసీఆర్ ఇస్తానన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రాజెక్టులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు నిధులు విడుదల చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ నేతలు వారిని వారే విమర్శించుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. మునిగిపోయే నావ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులు తెరాస ఫాలోవర్లని విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్​లో కాంగ్రెస్ శ్రేణులు భాజపాకే ఓటేశారని.. మునుగోడులోనూ కాంగ్రెస్, తెరాస ఓట్లు భాజపాకే పడతాయన్నారు. తెరాస, కాంగ్రెస్​లు ఒక్కటయ్యాయి అందుకే పరస్పర విమర్శలు మానేశారని బండి పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తును తెలిపే ఎన్నికలని వెల్లడించారు. హుజూరాబాద్ గెలుపుతో సీఎం కేసీఆర్ అహంకారం కొంచెం తగ్గిందని.. మునుగోడు గెలుపుతో ముఖ్యమంత్రి అహంకారం పూర్తిగా బద్దలవుతుందని బండి సంజయ్ ఆరోపించారు.

మరోవైపు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. యాదాద్రిలో ప్రారంభమైన ఈ యాత్ర జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లె వద్దకు చేరడంతో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయికి చిహ్నంగా బండి సంజయ్ పాలకుర్తి మండలం అప్పిరెడ్డిపల్లె వద్ద పైలాన్ ఆవిష్కరించారు. బెలూన్లు, బాణాసంచా, డప్పు వాద్యాలతో భాజపా శ్రేణులు సందడి చేశారు. చీటూర్, కిష్టగూడెం మీదుగా కుందారం వరకు బండి సంజయ్ పాదయాత్ర సాగింది.

ఈ యాత్ర మొదటి నుంచి బండి సంజయ్ కేసీఆర్ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ వచ్చారు. తెరాస వైఫల్యాలు, కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలను ఊరూరా వివరించారు. ఒక దశలో కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు పరిధులు దాటాయని భావించిన తెరాస నాయకులు భాజపాపై విరుచుకుపడ్డారు.

రేపు రాష్ట్రానికి తరుణ్​ చుగ్ రాక: భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ తరుణ్‌ చుగ్‌ రేపు రాష్ట్రానికి రానున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం తరుణ్‌ చుగ్‌ వస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు ప్రధానకార్యదర్శులతో సమావేశం అవుతారని అన్నారు. సాయంత్రం 4 గంటలకు జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించే బహిరంగ సభలో తరుణ్‌ చుగ్‌ ముఖ్య అతిధిగా పాల్గొంటారని పేర్కొన్నారు . ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నేతలు తరుణ్‌ చుగ్‌ సమక్షంలో భాజపాలో చేరుతారని చెప్పారు. సభ అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం అవుతారని ప్రేమేందర్ రెడ్డి తెలియజేశారు.

ఇవీ చదవండి: రాష్ట్రానికి ప్రధాని శత్రువన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై డీకే అరుణ ఫైర్​

మూడేళ్ల చిన్నారిపై దారుణం, బర్త్​డే పార్టీలో మత్తుపదార్థాలు ఇచ్చి గ్యాంగ్​రేప్

Last Updated :Aug 17, 2022, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.