Blind teacher in metpally ZPHS: విద్యార్థుల భవితకు వెలుగు దాత.. ఈ అంధ ఉపాధ్యాయుడు

author img

By

Published : Dec 3, 2021, 4:24 PM IST

Blind teacher in metpally ZPHS

Blind teacher in metpally ZPHS: చూపు లేదని కలత చెందలేదు.. రెండు కళ్లు లేకపోయినా ఏదో సాధించాలనే తపన. ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులో విధి ఆయన పట్ల చిన్న చూపు చూసినా.. దృఢ సంకల్పంతో తన తలరాతను మార్చుకున్నారు. తన జీవితం అంధకారమైనా.. వేల మంది జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశ. ఆ లక్ష్యంతోనే ముందడుగు వేశారు. అనుకున్నది సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడి.. వేల మంది విద్యార్థుల ప్రగతికి బాటలు వేస్తున్నారు జగిత్యాల జిల్లా మెట్​పల్లి జడ్పీహెచ్​ఎస్​ అంధ ఉపాధ్యాయుడు శ్రీధర్​ స్వామి.

Blind teacher in metpally ZPHS: శారీరక వైంకల్యం కన్నా మానసిక వైకల్యమే మనిషి ఎదుగుదలకు ప్రధాన శత్రువు. ఎదురొచ్చే సవాళ్లను అధిగమిస్తూ ప్రతి పనిలో 100 శాతం కృషి పెడితే.. విజయాలు వాటంతట అవే వచ్చి చేరుతాయి. కానీ కొందరు తమ శారీరక వైకల్యాన్ని కారణంగా చూపిస్తూ.. ఏ ప్రయత్నమూ చేయకుండా ఉంటారు. కానీ అదే కోవకు చెందిన మరికొందరు మాత్రం.. ఆ వైకల్యాన్ని సైతం దాటి తమ సత్తా ఏంటో ప్రదర్శస్తారు. మన మెదడు, ఆలోచనలు సరిగా పనిచేస్తే ఎటువంటి అవరోధాలను అయినా అడ్డుకోవచ్చని నిరూపిస్తారు. ఆ కోవకు చెందిన వారే జగిత్యాల జిల్లా మెట్​పల్లి జడ్పీహెచ్​ఎస్​ అంధ ఉపాధ్యాయుడు శ్రీధర్​ స్వామి. తనదైన శైలిలో విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్పిస్తూ వారి ఉన్నతికి తోడ్పడుతున్నారు. విద్యార్థులకు ఆత్మీయ గురువుగా, తోటి ఉపాధ్యాయులకు మంచి సహోద్యోగిగానే కాకుండా ఇతరులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

శ్రీధర్​ స్వామి అంకిత భావం.. ఇతరులకు స్ఫూర్తి దాయకం

ఏడో తరగతిలో విషాదం

Physically challenged people: మెట్​పల్లి జడ్పీహెచ్​ఎస్​ ఉన్నత పాఠశాలలో సాంఘిక ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్​ స్వామికి.. తాను ఏడో తరగతి చదువుతుండగా రెండు కళ్లూ పోయాయి. దీంతో ఐదేళ్లపాటు చదువు ఆపేసి.. ఖాళీగా ఉన్నారు. కానీ తన వైకల్యాన్ని చూసి ఎవరూ జాలి చూపించకూడదని భావించాడు. తన సొంత కాళ్ల మీద నిలవాలని భావించాడు. తాను కూడా ఉన్నత స్థానంలో ఉండాలని ఆశయంతో ముందుకు సాగాడు. మిత్రుల సాయంతో హైదరాబాద్​లోని అంధుల పాఠశాలలో చేరి విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. బీఈడీ పూర్తి చేసి 1995లో ఉపాధ్యాయునిగా ఉద్యోగం సాధించారు.

శ్రీధర్​ స్వామి.. సాంఘిక శాస్త్రం బోధిస్తున్నారు. ఏ రోజుకా రోజు చెప్పాల్సిన పాఠాలు.. విద్యార్థులు విసుగు చెందకుండా పాటలతో వివరిస్తారు. కంజర వాయిస్తూ వారి దృష్టి మొత్తం చదువుపై ఉండేలా శ్రద్ధ కనబరుస్తారు. ఆయన శిక్షణలో ఇంతవరకూ ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిలైన దాఖలాలు లేవు. -సుంచు అశోక్, జడ్పీహెచ్​ఎస్ వ్యాయామ ఉపాధ్యాయుడు

శ్రీధర్​ స్వామి.. సమయ పాలన పాటిస్తూ ప్రతి రోజూ పాఠశాల వేళకు చేరుకుంటారు. ఆయన బోధించే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా వింటారు. విద్యార్థులకు బోర్ కట్టకుండా దేశ భక్తి పాటలతో వారికి స్వాతంత్య్ర ఉద్యమ సన్నివేశాలను వివరిస్తారు. -నరసింహమూర్తి, జడ్పీహెచ్​ఎస్ ప్రధానోపాధ్యాయుడు

కంజరతో దేశ భక్తి గేయాలు

Physically challenged success stories: మొదట్లో మల్లాపూర్ మండల కేంద్రంలో విధులు నిర్వహించిన శ్రీధర్​ స్వామి 2010లో మెట్​పల్లి బాలుర ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లారు. అనంతరం 2015లో మళ్లీ బదిలీపై మెట్​పల్లిలోని నూతన ఉన్నత పాఠశాలకు వచ్చారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఇదే పాఠశాలలో విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నారు. విద్యాబోధనలో ఆయన పాటించే విధానం, మెలకువలు వేరు. విద్యార్థులు నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా ఉండేందుకు పాఠ్యాంశాలు అర్థమయ్యేలా వారికి బోధిస్తున్నారు. శ్రీధర్​ స్వామి మంచి గాయకుడు కూడా కావడంతో విద్యార్థులకు కలిసివచ్చింది. ప్రతి రోజు చదువుతో పాటు విద్యార్థులకు విజ్ఞానం పెంచేందుకు వివిధ అంశాలపై పాటలు పాడుతూ విద్యార్థులను చైతన్యవంతులను చేస్తున్నారు. కంజర వాయిస్తూ దేశభక్తి గేయాలను పాడుతూనే నాటి స్వాతంత్ర ఉద్యమంలో జరిగిన అంశాలను పాట రూపంలో వివరిస్తూ.. దేశంపై గౌరవం పెంచేలా చేస్తున్నారు.

నాకు ఏడో తరగతిలో రెండు కళ్లూ పోయాయి. అప్పుడు నా జీవితం ఎలా గడుస్తుంది అని చాలా దిగులు పడ్డాను. స్వయంకృషితో బతకాలని భావించి కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు సంపాదించాను. ఈ విజయానికి నా స్నేహితులు ఎంతగానో దోహదపడ్డారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల సాయంతో దిగ్విజయంగా విద్యా బోధన చేయగలుగుతున్నాను. -శ్రీధర్​ స్వామి, అంధ ఉపాధ్యాయుడు, జడ్పీహెచ్​ఎస్

Sridhar swamy in metpally ZPHS: శ్రీధర్​ స్వామి ప్రతి రోజు ఇంటి నుంచి తన కుమారుడు లేదా మిత్రుల సహాయంతో పాఠశాలకు చేరుకుని చురుకుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తరగతి గదులు మారేందుకు తోటి ఉపాధ్యాయుల సాయం తీసుకుంటారు. ఇటు విద్యార్థులకు చదువు నేర్పుతూనే అటు ఉపాధ్యాయులతో కలిసిమెలిసి ఉంటూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి: Physically challenged people: వారి సంకల్పం ముందు.. అంగవైకల్యం చిన్నబోయింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.