Jagtial Farmers Protest today : ధాన్యం కొనుగోళ్లకై కదం తొక్కిన జగిత్యాల రైతులు

author img

By

Published : Nov 26, 2021, 2:12 PM IST

Jagtial Farmers Protest, jagtial farmers, జగిత్యాల రైతుల ధర్నా, జగిత్యాల రైతుల ఆందోళన

Jagtial Farmers Protest today : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నానాపాట్లు పడుతున్న రైతులు పోరుబాట పట్టారు. జగిత్యాలలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

Jagtial Farmers Protest today : ధాన్యం కొనుగోలు చేయాలంటూ జగిత్యాలలో రైతులు పోరుబాట పట్టారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన అన్నదాతలు.. పాత బస్టాండ్‌ నుంచి జగిత్యాల కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. రోజుల తరబడి ధాన్యం కల్లాల్లోనే ఉందంటూ.. వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. మిల్లర్ల మోసాలు అరికట్టి.. పంటకు గిట్టుబాటు కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం, పాలనాధికారి కార్యాలయం ముందు రహదారిపై బైఠాయించారు. వివిధ రకాల పంటలను ప్రదర్శిస్తూ.. నిరసన వ్యక్తం చేశారు.

Farmers Protest in Jagtial today : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి తాము అష్టకష్టాలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. పొలం నుంచి కేంద్రాల వద్దకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు సాగక ధాన్యం రాశుల వద్ద పడిగాపులు కాస్తున్నామని చెబుతున్నారు. సాయంత్రం అయితే మబ్బులు కమ్మి తమ గుండెల్లో గుబులు రేపుతోందని అంటున్నారు. ఎప్పుడు వర్షం పడి ధాన్యం తడిసిపోతుందేమోనన్న భయంతో.. కంటి మీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్నామని ఆవేదన చెందారు. ఓ వైపు లారీల కొరత, మరో వైపు అన్‌లోడింగ్‌ సమస్యలతో ధాన్యం సేకరణ కాక రోజుల తరబడి కల్లాల వద్దే రాత్రి, పగలూ గడుపుతున్నామని చెప్పారు.

Paddy procurement Telangana 2021 : తరతరాలుగా వరిసాగు సంప్రదాయంగా వస్తుందని.. నేడు మిల్లర్ల మేలు కోసం ప్రభుత్వాలు రైతులను ఆగం చేస్తున్నాయని ఆరోపించారు. నెలల తరబడి రాష్ట్రంలో కొనుగోళ్లు నిలిపివేయటంతో.. పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని వాపోయారు. ఒకవైపు వర్షాలు.. మరోవైపు అధికారుల తీరుతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మిల్లర్ల మోసాలు అరికట్టి.. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, వర్షాలకు తడిసిన ధాన్యాన్నంతా కొనుగోలు చేసే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు.

"కల్లాల్లో ధాన్యం మొలకస్తోంది. వర్షానికి తడిసి పాడైపోతోంది. అటు కేంద్రం కొననని చెబుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్రం కొనడం లేదు మేమేం చేయాలంటోంది. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయండి. యాసంగికి ప్రణాళిక తయారు చేయండి. లక్ష ఎకరాలకు కేసీఆర్ సాగునిచ్చారు. అది సంతోషమే. కానీ ఆ నీళ్లతో పండించిన పంటను కొనుగోలు చేయకపోతే ఇక నీళ్లు ఇచ్చి లాభమేంటి? వానాకాలం పంటనే కొనకపోతే.. ఇక యాసంగి సంగతేంటి?"

- జగిత్యాల రైతులు

Farmers Deaths Telangana 2021: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో.. వరి కుప్పలపైనే తమ తోటి రైతులు కుప్పకూలుతున్నారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిసి అప్పుల పాలై.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

జగిత్యాల రైతుల ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.