హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు.. నిందితుల్లో న్యాయవాది

author img

By

Published : Aug 28, 2021, 5:08 PM IST

Four jailed for murder

పాత కక్షలో నేపథ్యంలో జరిగిన హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు పడింది. నిందితుల్లో ఒకరు మాజీ ఎంపీటీసీ, న్యాయవాది కాగా.. మరొకరు మాజీ సర్పంచ్. మొత్తం ఐదుగురిలో ఒక చనిపోవడంతో మిగిలిన నలుగురికి శిక్ష విధిస్తూ జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి జి.సుదర్శన్‌ తీర్పు చెప్పారు.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో మాజీ సర్పంచి తిర్మని మోహన్‌రెడ్డి(53) హత్య కేసులో నలుగురికి జగిత్యాల న్యాయస్థానం శుక్రవారం జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే 2012 మే 7వ తేదీ ఉదయం మోహన్‌రెడ్డి తన పొలం నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో తెల్లరాళ్లబోరు ఒర్రె పక్కన దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయమై అతని భార్య శైలజ పది మందిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు ఐదుగురిని నిందితులుగా తేల్చి రిమాండ్‌కు పంపించారు.

నిందితుల్లో ఒకరైన రాచకొండ అంజిరెడ్డి మృతి చెందగా పాత కక్షలతో పథకం ప్రకారం హత్య చేసినట్లు తేలగా నేరం రుజువైనందున మాజీ ఎంపీటీసీ సభ్యుడు, న్యాయవాది రాచకొండ గంగారెడ్డి, మాజీ సర్పంచి తిర్మని నర్సింహరెడ్డి, బొడిగె నర్సయ్య, పన్నాల మహేష్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి జి.సుదర్శన్‌ తీర్పు చెప్పారు.

అదనపు ఎస్పీ మహేందర్‌ దర్యాప్తు జరిపిన కేసులో కోర్టు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది సాగర్‌, కిరణ్‌ సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్‌ తరఫున అదనపు పీపీ శ్రీవాణి వాదించారు. నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ సీహెచ్‌.సింధుశర్మ అభినందించారు.

ఇదీ చదవండి:

PROMOTIONS: సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు లైన్ క్లీయర్...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.