ఈ-రైస్‌ యాప్‌ అదిరిందయ్యా.! తక్కువ ధరకే డోర్‌ డెలివరీ.!

author img

By

Published : Jan 25, 2023, 1:36 PM IST

e rice

E rice: నేటితరం కుర్రాళ్ల ఆలోచనలు.. కళ్లెం విడిచిన గుర్రాల్లాంటివి. కాస్తా చేయూతనిస్తే చాలు.. అద్భుతాలు సృష్టిస్తారు. అదుపుతప్పి కిందపడ్డా మళ్లీ పైకి లేవగలమనే నమ్మకంతో ఉంటారు. అలాంటి ఓ కుర్రాడి కథే ఇది. పోలీసు కావాలనే తండ్రి కలకు కొద్దిలో దూరమయ్యాడు. అయినా నిరాశ చెందకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టి అచెంచెల విజయాన్ని అందుకున్నాడు. ఇందుకు 3ఏళ్లు శ్రమించిన అతగాడు.. సామాన్యుడు కూడా బిజినెస్‌లో రాణించవచ్చని నిరూపిస్తున్నాడు. తనలాంటి మరికొందరికి ఉపాధినీ.. కల్పిస్తూ శభాష్​ అనిపించుకుంటున్నాడు. అతడే ఈ-రైస్‌ మొబైల్‌ యాప్‌ రూపకర్త శివ.

ఈ రైస్​ యాప్​తో వ్యాపారం చేస్తున్న యువకుడు

E rice app was created by Shiva: హైదరాబాద్ ! ఇదొక మహానగరం లేచింది మొదలు ప్రతి ఒక్కరిది ఉరుకులు పరుగుల జీవితం! కావాల్సింది కొనడానికి కూడా తీరిక లేని సమయం! అందుకే గుండు సూది మొదలు గునపం వరకు.. చివరకి కొబ్బరి చిప్పల నుంచి ఆవు పిడకల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో ఇంటికి తెప్పించుకునేందుకే అలవాటుపడింది నగర ప్రజానీకం. ఇది గమనించిన ఈ యువకుడు.. ఈ-రైస్‌ పేరిట మొబైల్‌ యాప్‌ రూపొందించాడు. ఇంటింటికి బియ్యాన్ని సరఫరా చేస్తూ వ్యాపారవేత్తగా ఎదగాలనే కలను నిజం చేసుకున్నాడు.

వినూత్న ఆలోచనతో వ్యాపార రంగంలో రాణిస్తున్న ఈ యువకుడి పేరు శివ. నాగర్‌ కర్నూల్ జిల్లా చారుగొండకు చెందిన శివ తల్లిదండ్రులు 2010లో హైదరాబాద్‌కు వలసొచ్చారు. బీకాం విద్యనభ్యసించిన యువకుడు రెండేళ్ల పాటు ప్రైవేటు ఉద్యోగం చేశాడు. తండ్రి కోరిక మేరకు పోలీసు ఉద్యోగానికి ప్రయత్నించి కొద్దిలో దానికి దూరమయ్యాడు. అయినా నిరాశ చెందని శివ తనను తాను నిరూపించుకోవాలనే సంకల్పంతో ఈ-రైస్‌ మొబైల్‌ యాప్‌ రూపొందించా.

2019లో ఈ-రైస్ యాప్ ప్రారంభించిన శివ బియ్యాన్ని నేరుగా రైతుల నుంచే సేకరించే వాడు. ఇందుకు నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండల్లోని రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వాటిని సోనామసూరి, బ్రౌన్ రైస్, హెచ్​ఎంటీ రైస్, కోలం రైస్, లష్కరీ కోలం, బాస్మతి, లోజీఐ రైస్, బ్లాక్‌రైస్ ఇలా వివిధరకాల బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చాడు.

E Rice App Was Created By Telangana Boy: ఈ-రైస్‌ యాప్‌కు మొదట్లో అంతగా ఆదరణ లభించలేదు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నింటిని ఎదురించి.. యాప్‌ను ముందుకు తీసుకెళ్లాడు శివ. మొదట ఒక ద్విచక్రవాహనంపై బియ్యం సరఫరా చేసేవాడు. క్రమంగా కస్టమర్ల ప్రోత్సాహం లభించడంతో 3 వాహనాలు కొనుగోలు చేసి ఎల్బీనగర్ కేంద్రంగా నగరమంతటా సరఫరా చేస్తున్నాడు. తక్కువ ధరకే డోర్‌ డెలివరీ చేస్తున్న శివ కస్టమర్ల సమయాన్ని ఆదా చేస్తున్నానంటాడు.

రైస్ బ్యాగులు సరఫరాకే పరిమితం కాని యువకుడు.. వాటిని ఎక్కడ పండించారు.? ఆ రైతులు ఎవరు.? వాటిలో ఉన్నపోషక విలువలు ఏంటీ, మధుమేహంతో బాధపడే వారు ఎలాంటి రైస్ తీసుకుంటే మేలు.. లాంటివి వివరిస్తూ వినియోగదారులకు అవగాహన కల్పిస్తుంటాడు. అది నచ్చే చాలా మంది నమ్మకంగా ఈ-రైస్ యాప్ ద్వారా రైస్ బ్యాగ్‌లను బుక్ చేసుకుండటం విశేషం.

ఈ-రైస్‌ యాప్‌ ఇప్పటివరకు 60వేల మంది డౌన్‌ చేసుకోగా.. 20వేల మంది రెగ్యులర్‌ కస్టమర్లు ఉన్నారు. దీంతో నిత్యం వేల సంఖ్యలో ఆర్డర్లు అందుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ-రైస్ సేవలందిస్తున్న శివ.. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా అందించాలని భావిస్తున్నాడు. ఈ క్రమంగా కనీసం వెయ్యి మందికైనా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తా అంటున్నాడు.

కస్టమర్లకు నిత్యం అందుబాటులో ఉంటూ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు శివ. ఒకవేళ రైస్ నచ్చని పక్షంలో వెంటనే వినియోగదారుల ఇళ్లకు వెళ్లి వారికి నచ్చిన బియ్యం ఇస్తాడు . పూర్తి ఉచితంగానే డెలవరీ చేస్తామంటున్న శివ.. వ్యాపారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నాడు. శివ ఆలోచనలతో పాటు తనందిస్తోన్న సేవల పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంకల్పం గట్టిదైతే.. ఎంతటి కష్టమైన పనైనా సులభంగా చేయవచ్చని నిరూపిస్తున్నాడు ఈ యువ వ్యాపారవేత్త.

"2019లో ఈ-రైస్​ యాప్​ను ప్రారంభించాను. మొదటలో అంతగా ఆదరణ రాలేదు. రైతుల నుంచి నేరుగా బియ్యాన్ని సేకరించి.. తక్కువ ధరకే ఉచితంగా డోర్​ డెలివరీ చేస్తున్నాము. అయితే నేడు రోజుకి వేల సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. మొదట ద్విచక్రవాహనంపై తీసుకొని వెళ్లి డోర్​ డెలివరీ చేసేవారిమి.. ఇప్పుడు సొంతంగా నాలుగు వ్యాన్​లు కొని తిప్పుతున్నాము. ఇప్పుడు మాకు 20వేల మంది రెగ్యులర్​ కస్టమర్లు ఉన్నారు. ఇంకా మా యాప్​ను 60వేలు మంది డౌన్​లోడ్​ చేసుకున్నారు. - శివ పాలకుర్ల, ఈ-రైస్ సంస్థ వ్యవస్థాపకుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.