పార్టీ మారారని విమర్శించే వాళ్లు ఒక్కటి తెలుసుకోవాలంటూ రాములమ్మ ట్వీట్

పార్టీ మారారని విమర్శించే వాళ్లు ఒక్కటి తెలుసుకోవాలంటూ రాములమ్మ ట్వీట్
Vijayashanthi Reacted to Party Change Issue on Twitter : పార్టీ మారడంపై.. తనపై వస్తున్న విమర్శలకుగానూ ఎక్స్(ట్విటర్) వేదికగా సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు. బీజేపీను వీడి కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఎక్స్ వేదికగా వివరించారు.‘‘రాములమ్మ పార్టీ మారారు అని విమర్శించే వాళ్లు ఒకటి తెలుసుకోవాలని సామాజిక వేదికగా సూచించారు.
Vijayashanthi Reacted to Party Change Issue on Twitter : నేడు రాజకీయ సమీకరణాలలో పార్టీ మార్పులు-చేర్పులూ సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి పార్టీ మారడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకుగానూ తనపై వస్తున్న విమర్శలను విజయశాంతి ఖండించారు. బీజేపీను వీడి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సామాజిక మాధ్యమం(Social Media) ఎక్స్ వేదికగా వివరించారు.
నాడు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది.. అక్కడకు వెళ్లిన తరువాత ఏమి జరిగిందో అన్న విషయాలను ట్విటర్లో ప్రస్తావించారు. రాములమ్మ పార్టీ మారారని విమర్శించే వాళ్లు ఒక్కటి తెలుసుకోవాలని సూచించారు. కేంద్రంలో(Central Govt), రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏడు సంవత్సరాలు జెండా మోసి కొట్లాడింది తానేనని విజయశాంతి అన్నారు. నాడు బండి సంజయ్, కిషన్‌రెడ్డి మరికొందరు బీజేపీ ప్రముఖులు అనేకసార్లు నా వద్దకు వచ్చి బీఆర్ఎస్ అవినీతిపై తప్పక చర్యలుంటాయని చెప్పారని తెలిపారు.
Telangana Assembly Election 2023 : అందరూ సమర్థిస్తే కేంద్రంలోని బీజేపీ ఎంతవరకైనా కొట్లాడదామని చెప్పి తనను వివేక్ వెంకటస్వామిని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఒప్పించారని వివరించారు. అందుకు కేంద్ర పెద్దలతో హామీ ఇప్పించి తనను చేర్చుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని దుర్మార్గ పాలన పోవాలని, తాము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో.. ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన కాంగ్రెస్‌ను వదిలి బీజేపీకి వెళ్లినట్లు పేర్కొన్నారు.
-
రాములమ్మ పార్టీ మారారు అని విమర్శించే వాళ్ళు ఒక్కటి తెలుసుకోవాలి.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) November 19, 2023
కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు 7 సంవత్సరాలు జెండా మోసి కొట్లాడింది నేను
నాడు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ,
ఇంకొందరు బీజేపీ ప్రముఖులు అనేకసార్లు
తమంత నా వద్దకు వచ్చి టిఆర్ఎస్… pic.twitter.com/akHjsx3aVD
కానీ కమలం పార్టీ మాట నిలబెట్టుకోక తమను మోసగించిందని ఆరోపించారు. బీఆర్ఎస్‌తో(BRS Party), బీజేపీ అవగాహన పెట్టుకున్నట్లు తెలిసిన తరువాతనే ఇంతమంది నాయకులు రాజీనామాలు చేసి బయటకెళ్లారని ఆరోపించారు. విమర్శలు చేయడం తేలికగా ఉన్నప్పటికీ.. ఆత్మ పరిశీలన చేసుకోవడం అవసరం అని విజయశాంతి ట్వీట్ చేశారు.
కేసీఆర్ అబద్దాలను తిప్పికొట్టేందుకే ప్రచార, ప్రణాళిక కమిటీ : తెలంగాణలో ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు పీసీసీ, ఏఐసీసీ నాయకులు ప్రచారం చేస్తారని ప్రచార కమిటీ వెల్లడించింది. ఇవాళ గాంధీభవన్‌లో చీఫ్ కోఆర్డినేటర్ విజయశాంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నెల 28వ తేదీ వరకు ప్రచారాలు, వ్యూహాలపై చర్చించినట్లు విజయశాంతి తెలిపారు. 28వ తేదీ వరకు ప్రచారానికి చెందిన బాధ్యతలను కమిటీ సభ్యులకు ఇచ్చినట్లు వివరించారు.
విజయశాంతి ఖమ్మం, మహబూబాబాద్, నగరానికి దగ్గరలోని నియోజకవర్గాలల్లో ప్రచారం చేస్తారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారన్న కోదండ రెడ్డి.. త్వరలో 28వ తేదీ వరకు షెడ్యూల్(Campaign Schedule) ప్రకటిస్తామన్నారు. కేసీఆర్ అబద్దాలను తిప్పికొట్టేందుకు ప్రచార, ప్రణాళిక కమిటీ పని చేస్తుందని వివరించారు. ప్రతి విషయాన్ని పీసీసీ, ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకెళ్లి ముందుకెళ్లతామని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అలంపూర్, నల్గొండ జిల్లాలో ప్రచారం చేస్తారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వివరించారు.
