Vaikuntha Ekadashi 2022: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

author img

By

Published : Jan 13, 2022, 7:01 AM IST

Vaikuntha Ekadashi 2022

Vaikuntha Ekadashi 2022: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి. కరోనా దృష్ట్యా పలు ఆలయాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. కరోనా ఉద్ధృతితో కొన్ని ఆలయాలు వైకుంఠద్వార దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించాయి.

Vaikuntha Ekadashi 2022: రాష్ట్రవ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రముఖ ఆలయాల్లో భక్తులకు ఉత్తరద్వారం ద్వారా దర్శనాలు కల్పిస్తున్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు కొనసాగుతున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా దర్శనాలు రద్దు చేసినట్లు కొన్ని ఆలయాలు ప్రకటించాయి.

యాదాద్రిలో..

యాదాద్రి క్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఉదయం 6.49కి ఉత్తరద్వారం ద్వారా స్వామి వారి దర్శనమిచ్చారు. క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారుల సూచిస్తున్నారు. మాస్క్‌ లేకుంటే ఆలయంలోనికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండంగా.. నేటి నుంచి యాదాద్రిలో అధ్యయనోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈ క్రమంలో పలు కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు. నేడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష పుష్పార్చన రద్దు చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు.

భద్రాద్రిలో..

భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజలాంఛనాలతో ఉత్తరద్వారం వద్దకు లక్ష్మణ సమేత సీతారాములు తరలివచ్చారు. ఏడు వారాల నగలతో సీతారాములకు అలంకరణ చేశారు. పోలీస్‌ బందోబస్తు మధ్య వైకుంఠ ఏకాదశి వేడుకలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరద్వారం దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. ఉత్తర ద్వార దర్శనం, తిరువీధి సేవ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. గరుడ వాహనంపై రామయ్య, గజ వాహనంపై సీతమ్మ తల్లి, హనుమత్‌ వాహనంపై లక్ష్మణ స్వామి దర్శనమిస్తున్నారు.

ధర్మపురిలో..

ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. యోగ, ఉగ్ర నరసింహస్వామి, వేంకటేశ్వర స్వామికి మహా క్షీరాభిషేకం చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. స్వామివార్లకు పుష్పవేదికపై వేద పండితుల ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ

ఏపీలోని తిరుమలలో బుధవారం అర్ధరాత్రి దాటాక 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయంలో అర్చకులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. అనంతరం 1.45 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. బుధవారం రాత్రి తిరుమల చేరుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ దంపతులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వేకువ జామున భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా, జేఎండీ సుచిత్రా ఎల్ల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.2కోట్ల విరాళం అందజేసింది. దీనికి సంబంధించిన డీడీలను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌కు అందజేశారు.

స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రా దంపతులు, త్రిపుర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ దంపతులు, హైకోర్టు జడ్జీలు జస్టిస్‌ ఈశ్వరయ్య, జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ దుర్గాప్రసాద్‌, జస్టిస్‌ రమేష్‌, ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు జయరామ్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, రంగనాథరాజు, సురేష్‌, బాలినేని, అనిల్‌ యాదవ్‌ దంపతులు, అవంతి శ్రీనివాస్‌ దంపతులు, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్‌, ఎమ్మెల్యేలు రోజా, శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీ సీఎం రమేశ్‌ దంపతులు, మాజీ మంత్రి చినరాజప్ప, లక్ష్మీపార్వతి, తెలంగాణ మంత్రి హరీశ్‌రావు దంపతులు, మరో మంత్రి గంగుల కమలాకర్‌ స్వామి వారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.

ప్రముఖులకు దర్శనం పూర్తయిన తర్వాత సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. గురువారం నుంచి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తిరుమలకు చేరుకున్నారు. ఏకాదశి పురస్కరించుకుని స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు.

ఇదీ చూడండి: Kite Festival: పతంగుల పండుగ షురూ... ఎగిరేద్దామా అందమైన గాలిపటాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.