Vacancies in TS Education Department : తెలంగాణ విద్యాశాఖలో ఎన్ని ఖాళీలో..?

author img

By

Published : Nov 22, 2022, 8:38 AM IST

Education Department Vacant posts

Vacancies in Telangana Education Department : తెలంగాణ విద్యాశాఖలో భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ శాఖలో నియామకాలకు నోచుకోని ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఖాళీలు భర్తీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Vacancies in Telangana Education Department : రాష్ట్రంలోని విద్యాశాఖ పరిధిలో అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ కావడం లేదు. ప్రత్యక్ష నియామకాల ద్వారా దాదాపు 12 వేల ఖాళీలను నింపాల్సి ఉంది. పదోన్నతులతో మరో 10 వేల పోస్టులు భర్తీ చేయాలి. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు 8 నెలలైనా మోక్షం లేదు. దీంతో నాణ్యమైన విద్య అందక పేద విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు నియామక ప్రకటనలు ఎప్పుడొస్తాయోనని లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.

ఆర్థికశాఖ అనుమతించినా: ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మొత్తం 2,440 బోధన సిబ్బంది ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ జులై 22న అనుమతి ఇచ్చింది. ఇంతవరకు నోటిఫికేషన్‌ వెలువడలేదు. ‘ఎస్‌టీ రిజర్వేషన్‌ను అమలుచేస్తూ జీఓ ఇవ్వడం వల్ల రోస్టర్‌ పాయింట్ల విధానం మారుతుంది. అది కొలిక్కి రావాలి’ అని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.

  • పాఠశాల విద్యాశాఖ పరిధిలోని బడుల్లో దాదాపు 9 వేల ఖాళీలను నింపాల్సి ఉంది. గతంలో ఉన్న 12 వేల మంది విద్యావాలంటీర్లను తొలగించడంతో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. చివరకు క్లస్టర్‌ రీసోర్స్‌ పర్సన్లు (సీఆర్‌పీ) కూడా బోధించాలని ఇటీవలే ఆదేశించడం గమనార్హం. ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన ‘టెట్‌’ ఫలితాలు వచ్చి 5 నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఎన్ని ఖాళీలు భర్తీచేయాలో నిర్ణయిస్తూ ఆర్థికశాఖ నుంచి జీఓ రాలేదు. ఇక పదోన్నతులు ఇస్తే మరో 10 వేల మందికి ప్రయోజనం దక్కుతుంది. అంటే ఆ మేరకు పోస్టులు భర్తీ అవుతాయి. టెట్‌ పూర్తయిన వెంటనే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ) జరుపుతామని పలుమార్లు ప్రకటించినా నోటిఫికేషన్‌ రాలేదు. రాష్ట్రంలోని మోడల్‌ పాఠశాలల్లో 2013 తర్వాత నియామకాలు జరగలేదు. వాటిలో 707 డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా, మరో 300కి పైగా పోస్టులు పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంది.

విశ్వవిద్యాలయాలపై తేలేదెప్పుడో?: రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆచార్యుల ఖాళీలను కామన్‌ యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీచేయాలని ప్రభుత్వం గత ఏప్రిల్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించింది. దాని ఏర్పాటుపై జూన్‌లో జీఓ ఇచ్చింది. అది అమల్లోకి రావాలంటే వర్సిటీల చట్టాల్లో సవరణ చేయాలి. గత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందగా.. దానిపై గవర్నర్‌ కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. దానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో వెళ్లి సమాధానమిచ్చారు. గవర్నర్‌ ఆమోదించి బిల్లు చట్టరూపం దాలిస్తే వెంటనే నియామకాలు చేస్తామని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో దాదాపు 2,500 వరకు బోధన సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అది ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. పాఠశాలల్లో విద్యా సామర్థ్యాలు పెరగాలని పట్టుబడుతున్న విద్యాశాఖ ఉపాధ్యాయుల ఖాళీలను నింపడంలో మాత్రం జాప్యం చేస్తోంది. ఇక 132 డిగ్రీ కళాశాలల్లో 85 చోట్ల శాశ్వత ప్రిన్సిపాళ్లే లేరు. ఫలితంగా పర్యవేక్షణ కుంటుపడుతోంది.

కాంట్రాక్ట్‌ సిబ్బందితోనే.. కళాశాల, ఇంటర్‌, సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని 5 వేలకుపైగా కాంట్రాక్టు అధ్యాపకుల కొలువులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం గత మార్చిలో ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు.

ఇదీ పరిస్థితి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం బోధన సిబ్బంది పోస్టులు 4,007. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్‌ అధ్యాపకులు 1,200 మంది మాత్రమే. కాంట్రాక్టు విధానంలో 860, అతిథి అధ్యాపకులు మరో 850 మంది ఉన్నారు. జూనియర్‌ కళాశాలల్లో మొత్తం 6,008 పోస్టులుండగా.. రెగ్యులర్‌ అధ్యాపకులు 900లోపే ఉన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు 3,500 మంది వరకు ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.