జనవరి రానే వచ్చింది.. నోటిఫికేషన్​లు ఏవీ.. సీఎం సారూ.!

author img

By

Published : Jan 22, 2023, 8:56 AM IST

ap

Job Calender: హామీలతోనే సరిపెట్టేస్తారా.. జనవరి వస్తూ.. పోతున్నా పట్టించుకోరా? ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. 2021 జూన్‌లో ప్రకటించిన వాటిలో ఇప్పటికీ 3 నోటిఫికేషన్లు వెలువడలేదు. సీఎం కాకముందు ఒక మాట సీఎం అయ్యాక ఒక మాట అని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో కానరాని జాబ్​ క్యాలెండర్​

Job Calender in ap: ప్రతిపక్ష నేత హోదాలో.. ఉన్నప్పుడు పిల్లల కోసం ఉద్యోగాల విప్లవం తీసుకురాబోతున్నామని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విడిపోయే నాటికి 1.42 లక్షల ఖాళీలున్నాయని.. వీటితో పాటు పదవీ విరమణ ద్వారా ఏర్పడే మరో రెండు లక్షల ఖాళీలను మనం అధికారంలోకి రాగానే ఎప్పటికప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. ఏటా పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలకు ఒక డేట్‌ ఇచ్చినట్లే ఉద్యోగాల భర్తీకి ఓ తేదీ ఇస్తామని మొట్టమొదటగా చేసేది ఈ పనే అని అన్నారు.

2018 జనవరి 1న పాలకొల్లులో, 2018 డిసెంబరు 9న శ్రీకాకుళంలో నిర్వహించిన బహిరంగ సభల్లో వైఎస్‌ జగన్‌
రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 2,30,000 ఉద్యోగ ఖాళీలున్నాయని.. వీటిని భర్తీ చేయడానికి ప్రతి ఏడాదీ జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇది అధికారంలోకి రాకముందు మాట.

సీఎం హోదాలో..:
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రాకపై స్పష్టత లేక ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ధైర్యం కోల్పోతున్న యువతలో మార్పుతెస్తామని.. క్యాలెండర్‌ విధానంలో నియామకాలు చేపడతామని తెలిపినా ఇంకా పూర్తి స్థాయి అమలు లేదు.

2021 జూన్‌ 18న జగన్‌ ప్రకటన: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీకి ఒకసారి మాత్రమే 2021 జూన్‌లో ‘క్యాలెండర్‌’ ప్రకటించింది. సీఎం కాకముందు... అయ్యాక జగన్‌ హామీలు ఇచ్చినట్లు ప్రతి ఏడాదీ జనవరి 1న ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను జారీ చేయడంలేదు. ఈసారీ మొండిచెయ్యే చూపారు. సీఎం జగన్‌ 2021 జూన్‌ 18న మాట్లాడుతూ ‘రాబోయే తొమ్మిది నెలల్లో అంటే.. జులై నుంచి 2022 మార్చి వరకూ ఏయే ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో నోటిఫికేషన్‌ ఇస్తామో వివరిస్తూ జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్నాం’ అని గొప్పగా ప్రకటించారు. దీని ప్రకారం చూసినప్పటికీ... ఆ జాబితాలో పేర్కొన్న వాటిలో ముఖ్యమైన మూడు నోటిఫికేషన్లు ఇప్పటికీ వెలువడలేదు. భర్తీ చేస్తామని అధికారికంగా ప్రకటించిన అత్తెసరు పోస్టుల నోటిఫికేషన్లను సకాలంలో జారీ చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చతికిలపడుతోంది. పోస్టుల భర్తీపై కార్యాచరణ సిద్ధంచేసి, వచ్చేనెలలో నివేదించాలని గత ఏడాది జూన్‌ మూడో వారంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులను ఆదేశించినట్లు ప్రకటన వెలువడింది. దీనిపైనా పురోగతి లేదు. నోటిఫికేషన్ల జారీలో జాప్యం పెరిగేకొద్దీ... వయోపరిమితి పరంగా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు

అతీగతీ లేని గురువుల పోస్టులు.. : క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం... ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ల పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ గతేడాది జనవరిలో, విశ్వవిద్యాలయాల్లో రెండు వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉండగా అతీగతీ లేదు.

ఖాళీలున్నా ఎందుకీ నిర్లక్ష్యం: రాష్ట్రంలో ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 6.16 లక్షలు. పేర్లు నమోదు చేసుకోని వారూ లక్షల్లోనే ఉన్నారు. మరోవంక... ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలకు కొదవలేదు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కలిపి 7,71,177 పోస్టులు మంజూరు కాగా... 5,29,868 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఖాళీలున్నాయి.

కార్యాచరణపై లోపించిన శ్రద్ధ: ప్రతి ఏడాదీ జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ విడుదల చేయాలంటే... ఆగస్టు నుంచే కార్యాచరణ మొదలుకావాలి. ప్రభుత్వ శాఖల వారీగా మంజూరైన పోస్టులు, ఉద్యోగ విరమణలు, ప్రత్యక్ష, పరోక్షంగా భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య వివరాలు సాధారణ పరిపాలన శాఖకు వెళ్లాలి. వాటిని క్రోడీకరించి జీఏడీ పంపిన ప్రతిపాదనలను ఆర్థికశాఖ పరిశీలించి భర్తీకి ఆమోద ఉత్తర్వులివ్వాలి. అవి వచ్చిన వెంటనే సంబంధిత శాఖలు ప్రకటించిన ఖాళీల ప్రకారం... రిజర్వేషన్ల వారీ వివరాలను ఏపీపీఎస్సీ, సంబంధిత సంస్థలకు పంపాలి.

‘గ్రూపింగ్‌’తో కాలయాపన: సాధారణ పరిపాలన శాఖ ఇటీవల ప్రభుత్వ శాఖలకు పంపిన ఆదేశాల్లో కేటగిరీల వారీగా పోస్టులను 7 గ్రూపులుగా చేయడాన్ని పరిశీలిస్తోంది. క్యాలెండర్‌ విధానంలో భర్తీ చేయాలంటే... ఈ కసరత్తు ఇప్పటికే పూర్తయి ఉండాలి. ప్రభుత్వానికి శ్రద్ధలేనందున... అధికారులు నత్తనడకన చర్యలు తీసుకుంటున్నారని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. నోటిఫికేషన్లు తగ్గిపోవడంతో ఏపీపీఎస్సీ కమిషన్‌ సభ్యులకు చేతినిండా పనిలేకుండా పోయింది.

గ్రూపు - 2 నోటిఫికేషన్‌ ఇస్తారా... లేదా?: తొలుత గ్రూపు-1, 2 కింద ప్రకటించిన 36 పోస్టుల్లో గ్రూపు-2 కింద ఐదే ఉన్నాయి. పోస్టులు మరీ తక్కువగా ఉండటంతో నిరుద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. చివరికి గ్రూపు-1లో, గ్రూపు-2లో కొన్ని పోస్టులు పెంచారు. చివరిగా గ్రూపు-2 కింద 182 ఉద్యోగాలు భర్తీచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు నోటిఫికేషన్‌ వెలువడలేదు. క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం 2021 ఆగస్టులోనే ఈ నోటిఫికేషన్‌ రావాలి. పెంచిన పోస్టులూ సరిపోవని... మరిన్ని పెంచాలని నిరుద్యోగులు పదేపదే అభ్యర్థిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. 2021లో జారీచేసిన ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌లో పేర్కొన్న 10,143 పోస్టుల్లో ఎక్కువ భాగం వైద్య ఆరోగ్యశాఖకు చెందినవే. ఇదే జాబితాలో పేర్కొన్న 400 పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌నూ 2021 సెప్టెంబరులో జారీచేయలేదు. గతేడాది నవంబరులో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఖాళీల సంఖ్య పెరిగింది.

యువత ఆశలపై నీళ్లు: క్యాలెండర్‌ ద్వారా ఉద్యోగాల్ని భర్తీ చేయడంలో సీఎం జగన్‌ ఘోరంగా విఫలమయ్యారు. గ్రూపు-1 కింద ప్రకటించిన పోస్టులు కేటగిరీ వారీగా చూస్తే తక్కువ. గ్రూపు-2 కేటగిరీలో ఐదువేల వరకు పోస్టులు ఉండగా ప్రకటించినవి రెండు వందలలోపే. ఆచార్యుల పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు ఎంఫిల్‌, పీహెచ్‌డీలు చేసిన వేలాది మంది ఎదురుచూస్తున్నారు. లక్షల మంది డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రత్యక్ష విధానంలో భర్తీ చేయాల్సిన టీచర్‌ పోస్టులనూ తాత్కాలిక పదోన్నతులతో భర్తీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడంతో వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక వివిధ శాఖల్లో 50 వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందని నిరుద్యోగులు ఆశించారు. వారి ఆశలపై జగన్‌ నీళ్లు చల్లారు.

నిరుద్యోగులకు శాపం: గ్రూపు-2 నోటిఫికేషన్‌ను 2018లో చివరిగా ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాల భర్తీ సమయంలోనే గ్రూపు-2 మెయిన్స్‌ నిర్వహించారు. దీనివల్ల సన్నద్ధతపై ప్రభావం పడింది. ఏటా క్యాలెండర్‌ విధానంలో నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగుల సన్నద్ధత వృధా కాదు. 2021లో ప్రకటించిన గ్రూపు-2 నోటిఫికేషన్‌ ఇప్పటికీ రాలేదు.

యూపీఎస్సీని చూసైనా...: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వశాఖల్లోని ఖాళీల వివరాల్ని సేకరించి పోస్టుల కేటగిరీని అనుసరించి ఎప్పుడెప్పుడు ఏయే తేదీల్లో నోటిఫికేషన్లు జారీ చేసేదీ తెలుపుతూ, పరీక్షల తేదీలనూ ముందుగానే యూపీఎస్సీ ప్రకటిస్తోంది. ఈ క్రమంలో సివిల్స్‌ సర్వీసెస్‌(2023) రిక్రూట్‌మెంట్‌, ఐ.ఎఫ్‌.ఎస్‌., నోటిఫికేషన్లను ఫిబ్రవరి 1, 2023న జారీచేస్తామని గతేడాది మేలో ప్రకటించిన ప్రోగ్రామ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌/రిక్రూట్‌మెంట్‌ టెస్ట్స్‌-2023 జాబితాలోనే పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణ గడువు... ముగింపు, ప్రిలిమ్స్‌, ప్రధాన పరీక్షల నిర్వహణ తేదీలనూ జాబితాలో పొందుపరిచింది. ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌ నోటిఫికేషన్‌ను ఏప్రిల్‌ 19, 2023, కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 19, 2023న వెలువరిస్తామని వెల్లడించింది. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌, ఎన్డీఏ అండ్‌ ఎన్‌.ఎ., సీడీఎస్‌, ఎస్‌.ఒ./స్టెనో వంటి పోస్టుల భర్తీ ప్రకటనను ఎప్పుడు జారీచేస్తామో తెలిపింది. యూపీఎస్సీ ముందుగా నోటిఫికేషన్ల గురించి ప్రకటిస్తున్నందున సన్నద్ధతకు సులువుగా ఉంటుంది. ఏపీలో ఈ పరిస్థితి లేక నిరుద్యోగులను ఇక్కట్లపాలు చేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.