పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు

author img

By

Published : Jan 13, 2023, 3:01 PM IST

Updated : Jan 13, 2023, 10:49 PM IST

tslprb

14:55 January 13

పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు

Changes in Police Recruitment Final Exam Dates : తెలంగాణ పోలీసు నియామక మండలి పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తి మేరకు మార్పులు చేసిన టీఎస్​ఎల్​పీఆర్​బీ.. ఎస్సై(ఐటీ), ఏఎస్సై(ఫింగర్ ప్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష 30వ తేదీకి వాయిదా వేయగా.. ఎస్సై(ఐటీ విభాగం) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసింది. అంతేకాక.. ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసిన టీఎస్​ఎల్​పీఆర్​బీ.. కానిస్టేబుల్(ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి మార్చినట్లు ప్రకటించింది.

ఇప్పటికే పోలీసు నియామకంలో కీలకమైన శరీర దారుఢ్య పరీక్షలు పూర్తి చేసిన అభ్యర్థులు తుది పరీక్షల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజా నోటిఫికేషన్లలో కీలకమైన సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టు కోసం తలపడుతున్న అభ్యర్థుల్లో పోటీ తక్కువగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకొంది. ప్రస్తుతం పోటీలో ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరికి కొలువు దక్కే అవకాశం ఉండటం విశేషం. కానిస్టేబుల్‌ పోస్టుల్లో సివిల్‌ విభాగానికి సంబంధించే అత్యధిక ఖాళీలుండటం.. ఇందులో పోటీ తక్కువగా ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.

ఏ విభాగాలకు ఎంత మంది పోటీ: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం మొత్తం 16,969 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ప్రస్తుతం తుది రాతపరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు. ఈక్రమంలో ఒక్కో పోస్టుకు 11 మంది వరకు పోటీలో ఉన్నట్లు లెక్క. అయితే కీలకమైన సివిల్‌ విభాగంలోనే 15,644 పోస్టులున్నాయి. ఈనేపథ్యంలో వీటికోసం 90,488 మంది పోటీలో ఉన్నారు. ఈలెక్కన ప్రతీ ఆరుగురిలో ఒకరికి కొలువు దక్కే అవకాశముండటంతో అభ్యర్థుల్ని ప్రభుత్వోద్యోగం కల ఊరించే అంశంగా మారింది.

వాస్తవానికి 16,969 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం తొలుత 9,54,064 దరఖాస్తులు నమోదయ్యాయి. ప్రాథమిక రాతపరీక్షతో పాటు శారీరక సామర్థ్య పరీక్షల వడబోత అనంతరం 1,75,657 మంది మాత్రమే మిగిలారు. ఇంకా ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఒక్కో పోస్టుకు 25 మంది.. మెకానిక్‌ విభాగంలో 56 మంది.. డ్రైవర్‌ విభాగంలో 65 మంది.. రవాణా విభాగంలో 143 మంది.., ఎక్సైజ్‌శాఖలో 97 మంది.., అగ్నిమాపకశాఖ ఆపరేటర్‌ విభాగంలో 12 మంది పోటీలో ఉన్నారు.

ఎస్సై పోస్టులకు మాత్రం పోటాపోటీ: కానిస్టేబుళ్ల కొలువుల కోసం పోటీ తక్కువగా ఉండగా.. ఎస్సై కొలువుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. అన్ని విభాగాల్లో కలిపి 587 పోస్టుల కోసం తొలుత 2,47,630 దరఖాస్తులు నమోదయ్యాయి. తాజాగా శారీరక సామర్థ్య పరీక్షల ఫలితాల అనంతరం వీరిలో 59,574 మంది మాత్రమే మిగిలారు. అంటే ఒక్కో కొలువుకు 101 మంది వరకు పోటీలో ఉన్నట్లు లెక్క. మొత్తం పోస్టుల్లో సివిల్‌ విభాగంలోనే ఏకంగా 554 పోస్టులున్నాయి.

వీటికోసం 52,786 మంది ప్రస్తుతం పోటీలో ఉండటంతో ఈ విభాగంలో ఒక్కో పోస్టుకు 95 మంది పోటీపడుతున్నారు. ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఒక్కో పోస్టుకు 179 మంది చొప్పున.. పోలీస్‌ రవాణా విభాగంలో 311 మంది చొప్పున.. ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 240 మంది చొప్పున పోటీలో ఉండటం గమనార్హం. తుది రాతపరీక్ష అనంతరం సామాజిక వర్గాల వారీగా కటాఫ్‌ మార్కుల ఆధారంగా విజేతల ఎంపిక జరగనుంది.

ఇవీ చదవండి:

Last Updated :Jan 13, 2023, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.