భారత్‌-ఆసీస్‌ టికెట్ల కోసం తన్లాట.. అజహరుద్దీన్‌,హెచ్‌సీఏపై మూడు కేసులు నమోదు!!

author img

By

Published : Sep 22, 2022, 10:45 PM IST

Updated : Sep 22, 2022, 10:51 PM IST

There was a stampede at the Secunderabad Gymkhana ground as fans flocked for tickets for the India-Ausis match.

అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అబాసుపాలైంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సమన్వయ లోపం అభిమానులకు శాపంగా మారింది. టికెట్ల అమ్మకంలో మ్యాచ్‌ నిర్వాహకులు చేతులెత్తేశారు. సికింద్రాబాద్‌ జింఖానా మోదానంలో భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. తోపులాటలో..కొందరు మహిళలు కిందపడి స్పృహ తప్పిపోయారు. మరికొందరికి గాయాలు కావడంతో చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. అదుపుచేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అజరుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు.

భారత్‌-ఆసీస్‌ టికెట్ల కోసం తన్లాట.. అజహరుద్దీన్‌,హెచ్‌సీఏపై మూడు కేసులు నమోదు!!

భారత్ -ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ వేదికగా... ఈనెల 25న జరగనున్న టీ-ట్వంటీ మ్యాచ్ టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా రావడంతో... సికింద్రాబాద్ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టిక్కెట్ల కోసం నాలుగైదు రోజుల నుంచే...తెలుగురాష్ట్రాల నుంచి క్రీడాభిమానులు పోటెత్తుతున్నారు. హెచ్‌సీఏ టిక్కెట్లను బ్లాక్‌ అమ్ముతోందంటూ.... ఆందోళనల చేపట్టారు. ఓ న్యాయవాది ఏకంగా హెచ్‌ఆర్సీలో పిటిషన్ వేశారు. ఈ తరుణంలో మేల్కొన్న హెచ్‌సీఏ యంత్రాంగం ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు ఇస్తామని ప్రకటించడంతో... క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. చాలామంది వస్తారనే అంచనాలున్నప్పటికీ...సరైన ఏర్పాట్లు చేయలేదు. మెయిన్ గేట్ ద్వారా ఒక్కసారిగా అభిమాన సందోహం తోసుకొచ్చారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తోపులాటలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.

బీసీసీఐ, హెచ్‌సీఏ మధ్య సమన్వయం లోపం అడుగడుగునా కనిపిస్తోంది. ముందస్తు సన్నద్ధత లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకోవడంలోనూ హెచ్‌సీఏ వెనకపడిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు సాంకేతిక సమస్యతో ఆన్‌లైన్ చెల్లింపులకు అంతరాయం కలిగింది. నగదు తీసుకుని సిబ్బంది టికెట్లు విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్ వ్యవస్థను సరిగా వినియోగించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాజకీయ కారణాలు, కొవిడ్‌ మహమ్మారి వల్ల మూడేళ్లుగా హైదరాబాద్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లు కేటాయించడం లేదు. అజహరుద్దీన్‌కు కొందరు పాలకమండలి సభ్యులు సహాయ నిరాకరణ చేపట్టడం తాజా వైఫల్యానికి కారణంగా విశ్లేషిస్తున్నారు.హెచ్‌సీఏలో వర్గపోరు, ఆధిపత్య చలాయించాలనే తపన తప్ప నిర్వహణ గాలికొదిలేశారు. అంతిమంగా ఆటను ప్రత్యక్షంగా వీక్షించి ఆస్వాదించడానికి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన అభిమానులు తీవ్రంగా నిరాశచెందతున్నారు. టికెట్ల కోసం మూడు,నాలుగు రోజులుగా నిరీక్షిస్తున్నామని వాపోయారు.

రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆన్‌లైన్ వ్యవస్థ సమర్ధవంతంగా వినియోగించుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనే వాదన వినిపిస్తోంది. టెండరు ప్రక్రియ ద్వారా పేటీఎంకు టికెట్లు విక్రయం అప్పగించినప్పటికీ...అది పూర్తిగా విఫలమైంది. వీఐపీల పాస్‌ల జారీలోనూ గందరగోళం ఏర్పడింది. కొవిడ్ వల్ల క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించేందుకు అభిమానులకు పెద్దగా అవకాశం రాలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో నిర్వహించలేదు. చాలాకాలం తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ జరగుతుండటంతో... అభిమానులు టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. జింఖానా మైదానం వద్ద కొన్ని రోజులుగా పడిగాపులు కాస్తున్నారు.

హెచ్‌సీఏ పెద్దల తీరుపై పోలీసుఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది వస్తారనే అంచనా ఉన్నప్పటికీ కనీస చర్యలు చేపట్టలేదని ఆక్షేపిస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా...హైదరాబాద్‌ ప్రతిష్ఠ ఇనుమడించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. తాజాగా అజరుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఎస్‌ఐ ప్రమోద్ ఫిర్యాదుతో 420, 21,22/76 పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. టికెట్ల నిర్వహణతో పాటు వాటిని బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపణలపై ఫిర్యాదు నమోదు అయింది. తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏ నిర్లక్ష్యం వహించడమే కారణమని చికిత్స పొందుతున్నవారు చెబుతున్నారు. వారి ఫిర్యాదుతో బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 22, 2022, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.