'మొదటి ట్రైబ్యునల్ తీర్పులోని అంశాలను ఎప్పుడు అమలు చేస్తారు..?'

author img

By

Published : Nov 19, 2022, 8:05 PM IST

Telangana Letter to KRMB

Telangana Letter to KRMB: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. పలుమార్లు తాము లేవనెత్తిన అంశాలను పరిష్కరించలేదని పేర్కొన్నారు. ఏడు అంశాలను లేఖలో ప్రస్తావించారు. అన్ని అంశాలను అధ్యయనం చేసి.. అమలు చేయాలని కోరారు.

Telangana Letter to KRMB: కృష్ణా జలవివాదాల మొదటి ట్రైబ్యునల్ తీర్పులోని అంశాలను అమలు చేయాలని కోరుతూ రాసిన 70 లేఖలపై.. నదీ యాజమన్య బోర్డు ఇప్పటి వరకు స్పందించ లేదని తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. వాటిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కానీ.. కేంద్ర జలశక్తి శాఖ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ లేఖ రాసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్​కు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.

ముఖ్యమైన ఏడు అంశాలను లేఖలో పేర్కొని.. 70 లేఖలకు సంబంధించిన వివరాలను కూడా అందులో పొందుపర్చారు. తాగునీటి కోసం తీసుకున్న జలాలను 20 శాతం మాత్రమే లెక్కించాలని ట్రైబ్యునల్ చెబుతోందని.. ఈ విషయాన్ని పలు లేఖల్లో పేర్కొన్నప్పటికీ బోర్డు ఎప్పుడూ అమలు చేయలేదని తెలిపింది. ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం ఏడాదిలో కేటాయించిన జలాల్లో మిగిలిన నీటిని వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్ చేయాల్సి ఉంటుందని చెప్పింది. అయితే పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పందనా లేదని పేర్కొంది.

అడ్ హక్ ప్రాతిపదికన మాత్రమే కేటాయింపులు: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య 2015, 2017 సంవత్సరాల్లో అడ్ హక్ ప్రాతిపదికన మాత్రమే కేటాయింపులు చేశారని.. తెలంగాణకు 70 శాతం నీటిని కేటాయించాల్సి ఉందని తెలిపింది. రెండో ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం అయినా కొననసాగించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని పట్టించుకోలేదని పేర్కొంది. ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాన్ని 16వ బోర్డు సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించినట్లు వెల్లడించింది.

రూల్ కర్వ్స్ ఖరారు కోసం: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల రూల్ కర్వ్స్ ఖరారు కోసం సమాచారం, వివరాలు ఇవ్వాలని కేంద్ర జలసంఘాన్ని, బోర్డును కోరినా ఇవ్వలేదని లేఖలో గుర్తు చేశారు. చెన్నై తాగునీటి సరఫరా కోసం 1976, 77లో ఇచ్చిన ఒప్పందాలకు లోబడి రూల్ కర్వ్స్ ఖరారు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ రూల్ కర్వ్స్ సవరించలేదని అన్నారు.

జలవిద్యుత్ ఉత్పత్తి చాలా అవసరం: తెలంగాణకు జలవిద్యుత్ ఉత్పత్తి చాలా అవసరమని.. శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి రూల్ కర్వ్స్ సవరణ చేయాలని కోరినా పట్టించుకోలేదని తెలిపింది. స్పిల్ వే ద్వారా విడుదల చేసే నీటిని లెక్కించరాదన్న ఏపీ ప్రతిపాదన తమకు అంగీకారం కాదని పలు మార్లు చెప్పినప్పటికీ ఆర్ఎంసీ పట్టించుకోలేదని తెలంగాణ పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కాల్వలపై రియల్ టైం డాటా అక్విజేషన్ సిస్టం ఏర్పాటు చేయాలని మరోమారు కోరింది.

ఏపీ పదేపదే ఆటంకాలు సృష్టిస్తోంది: ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ పనులు సాగకుండా ఏపీ పదేపదే ఆటంకాలు సృష్టిస్తోందని.. ఈ విషయమై పలుమార్లు లేఖలు రాసినట్లు పేర్కొంది. పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఆర్డీఎస్ కుడికాల్వపై అనుమతుల్లేకుండా ఏపీ చేపట్టిన పనులు నిలువరించాలని అంతవరకు డీపీఆర్​ను పక్కకు పెట్టాలని కోరినట్లు గుర్తు చేసింది. పలు అంశాలు ఇంకా పరిష్కారం కాలేదన్న తెలంగాణ.. వాటన్నింటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అమలు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైనా ఆదేశాలు అవసరమైతే వారి దృష్టికి తీసుకెళ్లాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఇవీ చదవండి: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై.. కేఆర్ఎంబీకి ఏపీ లేఖ

ఈ నెల 24న కృష్ణా బోర్డు ఆర్ఎంసీ సమావేశం.. తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం

'వారానికోసారి పీసీసీ భేటీ పెట్టాలి.. లేకుంటే పార్టీకి తీవ్ర నష్టం'

ప్రియుడితో పెళ్లి కోసం మతం మార్చుకున్న ప్రియురాలు.. వేదమంత్రాలతో ఘనంగా పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.