నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తాం : కేటీఆర్

నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తాం : కేటీఆర్
నాంపల్లి అగ్నిప్రమాద ఘటన పట్ల గవర్నర్, ముఖ్యమంత్రి సహా వివిధ పార్టీల నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం కారణాలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను గవర్నర్ ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఘటనాస్థలిని పరిశీలించిన వివిధ పార్టీల నాయకులు.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Telangana Government on Nampally Fire Accident : నాంపల్లి బజార్‌ఘాట్ ఘటన జరిగిన అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించిన ఆమె.. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను అదేశించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
All Party Leaders Visiting Nampally Fire Accident Place : ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి.. అధికారులతో ఆరా తీశారు. ఘటనాస్థలిని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ప్రమాద తీరు, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్న ఆయన.. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు.
"రాత్రి దీపావళి చేసుకుని ప్రజలంతా రాత్రి లేట్‌గా పడుకున్నారు. పొద్దున్నే దురదృష్టవశాత్తు ఇక్కడ షార్ట్ సర్య్కూట్ వల్లన లేకా ఏదైనా ఫైర్ క్రాకర్ వల్లనో ఏ రకంగా ప్రమాదం జరిగిందన్న విషయం తెలియదు. అపార్టుమెంటులో గ్రౌండ్‌ఫ్లోర్‌లో రసాయనాల నిల్వ ఉంది దానివల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపిస్తాం. ఎప్పుడు ఎలా జరిగింది ఏ రకంగా రసాయనాలు స్టోరేజీ చేయాల్సి వచ్చింది." - కేటీఆర్, పురపాలకశాఖ మంత్రి
Congress Leaders on Nampally Fire Accident : ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపించాయి. ప్రమాదం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందన్నారు. నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఘటనాస్థలిని కాంగ్రెస్ నేతలు వి.హన్మంతురావు, ఫిరోజ్ ఖాన్, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషా పరిశీలించారు.
BJP Chief Kishan Reddy On Nampally Incident : ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకర రసాయనాల గోదాం నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోలేదంటూ వీహెచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బజార్‌ఘాట్‌లో ప్రమాద స్థలాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. ప్రమాదతీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉస్మానియా మార్చురీ వద్దకు వెళ్లిన నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్.. మృతుల కుటుంబీకులను ఓదార్చారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు.
