Sports Committees: రాష్ట్రంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయం

author img

By

Published : May 20, 2022, 2:32 AM IST

Sports Committees: రాష్ట్రంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయం

Sports Committees: రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది యువత, చిన్నారులకు ఉపయుక్తంగా ఉండేలా క్రీడాప్రాంగణాలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయనుంది. ఇందుకోసం గ్రామాలు, వార్డుల వారీగా దాదాపు రెండు లక్షల మందితో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఆ కమిటీ సభ్యులకు ప్రత్యేక టీషర్టులు సమకూర్చనున్నారు. క్రీడాప్రాంగణాలు అభివృద్ధి సహా ప్రతిగ్రామానికి క్రీడా పరికరాలను సర్కారు సమకూర్చనుంది.

Sports Committees: వివిధ రంగాల్లో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగంలోనూ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని యువత, చిన్నారులను క్రీడలవైపు ఆకర్షితులను చేసేలా కార్యాచరణ మొదలుపెట్టింది. గ్రామీణ క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పించేలా చర్యలు చేపట్టనుంది. ప్రకృతివనాలు, వైకుంఠధామాలు సమీకృత మార్కెట్ల తరహాలో తనదైన ముద్ర ఉండేలా క్రీడాప్రాంగణాలు అభివృద్ధి చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 19వేలగ్రామీణ ప్రాంతాల్లో 5వేల పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో క్రీడాప్రాంగణాలు సిద్ధం చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ నిధులతో మైదానాలు క్రీడలకు అనువుగా అభివృద్ధి చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు క్రీడాప్రాంగణాల కోసం 8వేల వరకు స్థలాలు గుర్తించినట్లు సమాచారం. సరిపడా స్థలాలు లేనిచోట పాఠశాలల ప్రాంగణాలను తీర్చిదిద్దుతారు.

ప్రత్యేక కమిటీల నియామకం: క్రీడల కోసం ఒక్కోగ్రామం, వార్డుకు ప్రత్యేక కమిటీలు నియమిస్తారు. సర్పంచ్‌తో పాటు 7 నుంచి 10 మంది సభ్యులుగా కమిటీ ఉంటుంది. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, లాంగ్‌జంప్ వంటి క్రీడల్లో చిన్నారులు, యువత పాల్గొనేలా ఆ కమిటీలు పనిచేయాల్సి ఉంటుంది. కమిటీలకు ప్రత్యేక గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీషర్టులను సిద్ధంచేసే పనిలో ప్రభుత్వం ఉంది. పల్లె పట్టణప్రగతి సమీక్ష సందర్భంగా టీషర్టుల నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్... కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. అందుకనుగుణంగా టీషర్టులు సిద్ధం చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని క్రీడాప్రాంగణాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఆ మేరకు జూన్ 2న వెయ్యి క్రీడాప్రాంగణాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ఆ క్రీడాప్రాంగణాల ద్వారా 20 లక్షల మంది యువత, చిన్నారులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. వాటికి అవసరమైన క్రీడాసామాగ్రిని ప్రభుత్వమే అందించనుంది.


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.