అలా చేస్తే రాష్ట్రానికి రూ.1000 కోట్ల ఆదాయం.. కొత్తమార్గం కనిపెట్టిన వాణిజ్య పన్నుల శాఖ

author img

By

Published : Nov 20, 2022, 12:15 PM IST

Telangana Commercial Tax Department

Telangana Commercial Tax Department: రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే మార్గాన్ని.. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కనిపెట్టింది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి రిటర్న్​లు వేయని వ్యాపార వాణిజ్య సంస్థలకు చెందిన రూ.1000 కోట్లకు పైగా మొత్తం రాబడి తెచ్చిపెట్టే సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తోంది. వ్యాపారస్తుల్లో అవగాహన కల్పించి రిటర్న్‌లు వేయించే కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సెలవులు రద్దు చేయడంతో పాటు ఆదివారం కూడా పని చెయ్యాల్సిందేనని స్పష్టం చేసింది.

Telangana Commercial Tax Department: కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో 2017 జులైలో వస్తుసేవల పన్ను జీఎస్​టీని అమల్లోకి తెచ్చింది. ఐదు రకాల శ్లాబుల్లో తెచ్చిన ఈ పన్నులో వసూలైన ప్రతి రూపాయిలో సగం కేంద్రానికి, సగం వినియోగం జరిగే రాష్ట్రాలకు వస్తుంది. మన రాష్ట్రానికి చెందిన వ్యాపార వాణిజ్య సంస్థలు ఇతర రాష్ట్రాలలో కొనుగోలు చేసే సరుకులు, సేవలకు చెంది చెల్లించిన జీఎస్​టీని ఆయా సంస్థలు తిరిగి తీసుకునే వెసులుబాటు ఉంది.

లేదంటే ఆ మొత్తాన్ని తన ఖాతాల్లో నిల్వ ఉంచుకుని ఇతర వ్యాపార లావాదేవీలకు వాడుకోవచ్చు. కానీ కొన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు తన నెలవారీ రిటర్న్‌లలో కొనుగోళ్ల వివరాలు చూపించడం లేదు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా రాకుండా కేంద్రం వద్దనే ఉండిపోతోంది. కేంద్ర ఆర్ధిక శాఖ రెవెన్యూ నివేదికలను అధ్యయనం చేసిన రాష్ట్ర ఎకనామిక్ ఇంటిలిజెన్స్ యూనిట్.. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్​టీ వాటా తగ్గిందని గుర్తించింది.

మరింత లోతైన విశ్లేషణ చేయగా.. వేలాది మంది ఇతర రాష్ట్రాల్లో సరుకులు కొనుగోళ్లు, సేవలు వినియోగం చేస్తున్నప్పటికీ.. వాటికి చెందిన నెలవారీ, వార్షిక రిటర్న్‌లలో చూపడం లేదని తేలింది. దీంతో వ్యాపారులు చెల్లించిన జీఎస్​టీ తిరిగి తీసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. మరోవైపు రాష్ట్ర ఖజానాకు జమ కావాల్సిన మొత్తం కూడా కాలేదు. ఇలాంటి వ్యాపార వాణిజ్య సంస్థలు ఎన్ని ఉన్నాయని ఆరా తీసిన ఆర్ధిక నిఘా విభాగం.. 36 వేలకుపైగా సంస్థలు ఉన్నట్లు గుర్తించింది.

వ్యాపారులు దేశంలో ఎక్కడ కొనుగోలు చేసినా తమ రిటర్న్‌లలో చూపించినట్లయితే ఐజీఎస్​టీ కింద జమ అయ్యే మొత్తం జీఎస్​టీ మెకానిజం ద్వారా ఆయా రాష్ట్రాలకు ప్రతి నెల సర్దుబాటు అవుతుంది. నిబంధనలుప్రకారం అది సక్రమంగా జరగనందున.. ఆయా రాష్ట్రాలకు ఐజీఎస్​టీ సర్దుబాటు కాకుండా ఆగిపోయింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి చెందిన వార్షిక రిటర్న్‌లు వేయడానికి తక్కువ సమయం ఉండడంతో... ఆయా వ్యాపార సంస్థల ప్రతినిధుల్లో అవగాహనా కల్పించి రిటర్న్‌లు వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అలాంటి వాళ్లు 36వేలకు పైగా ఉండడంతో వారందరిని సంప్రదించి అవగాహన కల్పించేందుకు వాణిజ్య పన్నుల శాఖకు చెందిన రాష్ట్రంలోని 2500 మందిని భాగస్వామ్యం చేసింది. జాయింట్ కమిషనర్‌ నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరికి పని విభజన చేశారు. వారందరినీ ఫోన్ ద్వారా సంప్రదించి అవగాహన కల్పించి వాళ్ల కొనుగోళ్లకు సంబంధించి తక్షణమే రిటర్న్‌లు వేయించనున్నారు.

దీనిని అత్యవసరం కిందపరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఉద్యోగులు ఆదివారం కూడా పని చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం పూర్తి చేయడం ద్వారా వెయ్యి కోట్లకు పైగా రాష్ట్రానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.