రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాల జోరు - గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాల జోరు - గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు
Telangana Assembly Elections Campaign : అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాల జోరు కొనసాగుతోంది. ఎన్నికలకు కొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రధాన నేతలు బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తుంటే.. నియోజకవర్గ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలతో క్షేత్రస్థాయిలో క్షణం తీరిక లేకుండా గెలుపే లక్ష్యంగా సాగుతున్నారు.
Telangana Assembly Elections Campaign : ఎన్నికలకు ఇంకా 15 రోజులే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి కనబడుతోంది. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి జగదీష్ రెడ్డి నడుంబిగించారు. ఆయన సతీమణి సునీత సైతం సూర్యాపేట వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ చేసిన అభివృద్ది పనులను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
BRS Assembly Elections Campaign : గుర్రం పోడు మండలంలోని జిన్నాయి చింత, తానేదార్ పల్లి, గాసిరాం తండాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. సింగరేణిలో భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హైదరాబాద్ సనత్ నగర్, అమీర్పేట డివిజన్లలో మంత్రి తలసాని శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ ఎన్నికల ప్రచారం చేస్తూ.. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో విరుచుకు పడ్డారు.
Congress Assembly Elections Campaign : పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-5 పై కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాగూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ప్రారంభించారు. నగర వీధుల్లో భారీ ప్రదర్శనలు చేస్తూ.. తాను చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. గోశామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ.. హస్తం గుర్తుపై ఓటేయాలని పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో తన గెలుపు తధ్యమని పద్మారావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్లో పాదయాత్ర చేస్తూ ఓటర్లను కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పద్మారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ సికింద్రాబాద్లో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
