దరఖాస్తు సమయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా - అయితే మీకు పింఛన్ రాదు!

దరఖాస్తు సమయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా - అయితే మీకు పింఛన్ రాదు!
Aasara Pension Avoid These Mistakes While Applying : 'ఆసరా' పేరుతో.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు.. ఇలా పలు వర్గాల వారికి తెలంగాణ సర్కార్ పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా పింఛన్ పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. ఈ పింఛన్ దరఖాస్తు సమయంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల.. అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడంతో వారు అనర్హులుగా మిగిలిపోతున్నారు. మరి, ఇంతకీ దరఖాస్తు ఎలా చేయాలి? అప్లికేషన్ సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Aasara Pension Avoid These Mistakes While Applying : తెలంగాణ ప్రభుత్వం పలు వర్గాల వారికి ఆసరా పింఛన్ అందిస్తోంది. అయితే.. ఈ పింఛన్ కోసం కొత్తగా అప్లై చేసుకునే వారు.. తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. దాంతో వారి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఫలితంగా.. ఈ స్కీమ్‌కి అవసరమైన అర్హతలు ఉన్నప్పటికీ.. పింఛను పొందలేక పోతున్నారు. మరి, ఆసరా పింఛన్(Aasara Pension Scheme) పొందడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి..? దరఖాస్తుకు ఏయే పత్రాలు అవసరం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అప్లై చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు..? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆసరా పింఛను అర్హతలివే (Eligibility for Aasara Pension in Telangana) :
- వృద్ధాప్య పింఛన్ దరఖాస్తుదారు 57 సంవత్సరాలు నిండి ఉండాలి.
- వితంతువు పింఛన్ పొందడానికి దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.
- చేనేత, గీత, బీడీ మొదలైన కార్మికుల వయస్సు 50 ఏళ్లు పైబడి ఉండాలి.
- దివ్యాంగులు ఏ వయసు వారైనా ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.
- పింఛన్ పొందడానికి కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులు.
అసరమైన పత్రాలు (Required Documents For Aasara Pension) :
- ఆధార్ కార్డు
- ఇంటి చిరునామా పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- వయస్సు ధ్రువీకరణ పత్రం
- వితంతువైతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
- చేనేత, బీడీ కార్మికులైతే.. సహకార సంఘం రిజిస్ట్రేషన్ జీరాక్స్ కాపీ
- బ్యాంక్ ఖాతా పాస్‌బుక్
- పోస్టాఫీస్ సేవింగ్ ఖాతా
- పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
- మొబైల్ నంబర్
ఎలా దరఖాస్తు చేయాలి (How To Apply for Telangana Aasara Pension) :
ఆసరా పింఛన్ కోసం ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. గతేడాది సెప్టెంబర్ వరకూ https://www.aasara.telangana.gov.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించట్లేదు. (భవిష్యత్తులో ఆన్లైన్ అవకాశం ఇస్తారేమో). ప్రస్తుతం ఆఫ్ లైన్లో అప్లై చేయాలనుకున్న లబ్ధిదారులు.. మీసేవ కేంద్రం నుంచి అప్లికేషన్ ఫాం తీసుకోవాలి. ఆ తర్వాత అందులో అడిగిన వివరాలన్నీ ఎంటర్ చేసి.. అలాగే అవసరమైన డాక్యుమెంట్ల అటాచ్ చేసి సంబంధిత కార్యాలయంలో సమర్పించాలి. అప్పుడు అధికారులు వేరిఫై చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
ఆసరా ఫించన్ దరఖాస్తు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలివే..
- దరఖాస్తు దారు అప్లికేషన్ ఫాం నింపేటప్పుడు దానికి అటాచ్ చేస్తున్న గుర్తింపు కార్డులో ఉన్నట్టుగా అందులో పేరు నమోదు చేయాలి. తప్పుగా రాస్తే.. ఇబ్బందులు తప్పవు.
- ఇంటిపేరు తప్పుల్లేకుండా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే అదే ఇంటిపేరుతో ఒకే పేరు గల వ్యక్తులు అప్లై చేసినప్పుడు మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది.
- వృద్ధుల పింఛన్ కోసం అప్లై చేస్తున్నప్పుడు వయస్సు ప్రామాణికం. కాబట్టి దరఖాస్తు ఫాంకు అటాచ్ చేసిన గుర్తింపు కార్డులో ఉన్న విధంగా వయస్సు నమోదు చేశారో లేదో చెక్ చేసుకోవాలి.
- చేనేత, బీడీ కార్మికులైతే.. ఆయా సహకార సంఘాలు జారీ చేసిన రిజిస్ట్రేషన్ కాఫీలో ఉన్నట్టుగా వివరాలు నమోదు చేశారో లేదో చెక్ చేసుకోవాలి.
- కొంతమంది ఏదో ఒక అడ్రస్ పెట్టి అప్లై చేస్తుంటారు. దానివల్ల వెరిఫికేషన్ టైమ్‌లో ఇబ్బందులు తలెత్తవచ్చు.
- అదేవిధంగా బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
- అలాగే అప్లికేషన్ టైమ్‌లో సరైన మొబైల్ నంబర్(Mobile Number) ఇవ్వాలి. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ ప్రక్రియ వివరాలు ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో మీ ఫోన్‌కు వస్తాయి.
- వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత.. మరొక్కసారి పరిశీలించి.. అంతా కరెక్టుగా ఉన్నాయనుకున్న తర్వాతే సమర్పించాలి.
