అనుమతుల్లేకుండా ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం.. కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖలు

author img

By

Published : Jan 14, 2022, 5:33 AM IST

KRMB

ENC Letter to KRMB: కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మూడు లేఖలు రాసింది. అనుమతి లేకుండా ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని అందులో పేర్కొంది.

ENC Letter to KRMB: ‘ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్యాప్‌ ఆయకట్టుకు నీరందించేందుకు రాష్ట్రం నిర్మిస్తున్న 13 కొత్త ఎత్తిపోతల పథకాలు కేంద్రం జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో లేవు. ఏపీ రాసిన లేఖ ప్రకారం వాటిని బోర్డు పర్యవేక్షణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏపీ రూ.47,776.50 కోట్లతో కృష్ణా జలాలను తరలించేందుకు అనుమతులు లేకుండా భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. వెంటనే వాటిని ఆపండి. ఏపీలో గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి మళ్లింపు నేపథ్యంలో ఆ మేరకు శ్రీశైలం నుంచి 45 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణకు అనుమతులు ఇవ్వాలి. శ్రీశైలం నుంచి తరలించే నీటి లెక్కలు తేల్చేందుకు సెన్సర్లు ఏర్పాటు చేయాలి’’ అని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ కృష్ణా బోర్డును కోరారు. ఈ మేరకు ఛైర్మన్‌కు వేర్వేరుగా మూడు లేఖలు రాశారు.

వాటిలో అంశాలు..

* నాగార్జునసాగర్‌ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్యాప్‌ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు 13 ఎత్తిపోతలను తెలంగాణ నిర్మిస్తోంది. ఇవి భారీ, మధ్య తరహా ఎత్తిపోతలు కావు. అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీ చట్టం, 1956కు లోబడి చాలా తక్కువ పరిమాణంతో ఎత్తిపోతల కోసం నిర్మిస్తున్నవి. నది ప్రవాహంపై ఎటువంటి ప్రభావం చూపవు. అంతేకాకుండా చిన్నతరహా పథకాలను కేంద్రం గతేడాది జులై 15న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో చేర్చలేదు. ఈ క్రమంలో ఏపీ కోరుతున్నట్లు ఆ ప్రాజెక్టులపై బోర్డు పర్యవేక్షణ అవసరం లేదు. ఏపీ మాత్రం మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులైన శ్రీశైలం కుడి కాల్వ, హంద్రీనీవా, గాలేరు నగరి తదితర భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం, విస్తరణకు రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ విషయాన్ని 28.01.2021న బోర్డు దృష్టికి కూడా తీసుకొచ్చాం. బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు వచ్చేవరకు వాటిని నిలిపివేసేలా ఏపీని కట్టడి చేయాలి.

* పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల గోదావరి జలాల మళ్లింపు నేపథ్యంలో 45 టీఎంసీల జలాలను శ్రీశైలం ఎడమ బ్రాంచి కాల్వ కింద వినియోగించుకునేందుకు కృష్ణా బోర్డు అనుమతి ఇవ్వాలి. 1978 అంతర్రాష్ట్ర ఒప్పందం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న నిర్ణయాల మేరకు అమలు చేయాలి. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సెల్బీసీ ఆయకట్టును మూడు లక్షల ఎకరాల నుంచి నాలుగు లక్షల ఎకరాలకు పెంచారు. ఆమేరకు నీటి కేటాయింపులు చేయలేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక అప్పటివరకు ఉన్న నీటి కేటాయింపులను 30 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచింది.

* శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఏపీ ఏటా లెక్కింపు లేకుండా నీటిని తీసుకుంటోంది. 2021-22లో 112 టీఎంసీలు మళ్లించింది. వాస్తవానికి చెన్నైకి తాగునీటి సరఫరాకు శ్రీశైలం జలాశయం నుంచి 175 కిలోమీటర్ల వెనుక చెన్నముక్కలపల్లి వద్ద నీటిని తీసుకునే (ఆఫ్‌టేక్‌) కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ ఇది పెన్నా నది పరీవాహకంలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం 1981లో శ్రీశైలం కుడికాల్వ ప్రాజెక్టు ద్వారా 19 టీఎంసీలు తీసుకునేందుకు ప్రణాళికా సంఘం అనుమతులు ఇచ్చింది. కేంద్ర జల సంఘం అనుమతులతో చెన్నైకి నీటి సరఫరాతోపాటు కుడి కాల్వకు నీటిని తీసుకునేందుకుగాను మొత్తం 34 టీఎంసీలను కేటాయించారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి 34 టీఎంసీలకు మించి నీటి మళ్లింపునకు అనుమతి ఇవ్వొద్దు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌, చెన్నముక్కలపల్లి ఆఫ్‌టేక్‌, కండలేరు, పూండి సరిహద్దుల వద్ద నీటి ప్రవాహ పరిమాణాన్ని లెక్కించేందుకు ఏర్పాటు చేయాలి. చెన్నైకి తాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగేందుకు గత నెలలో నిర్వహించిన ‘చెన్నై తాగునీటి సరఫరా కమిటీ’ సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలను కోరారు. ‘సెన్సర్లతో కూడిన రియల్‌ టైం డాటా అక్విజిషన్‌ విధానం’ ఏర్పాటు చేయాలి.

* తుంగభద్ర నది నుంచి తెలంగాణ భూభాగానికి నీటిని మళ్లించే రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌) ఆధునికీకరణ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.