Airlines Passengers Rights : విమానాల్లో ప్రయాణిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

author img

By

Published : May 22, 2023, 9:49 AM IST

air passengers

Airlines Passengers Rights : ప్రయాణికులకు భద్రతతో పాటు రక్షణ కల్పించాల్సిన విమానయాన సర్వీస్​లు.. సిబ్బంది తప్పిదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎయిర్​లైన్స్​లు అందించే సేవలు వినియోగదారులకు కొన్ని సందర్భాల్లో నిరాశ పరుస్తున్నాయి. దీంతో నెలకు సుమారు 10నుంచి 15 ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే వినియోగదారులకు సదరు సంస్థలు మూల్యం చెల్లించిన సందర్భాలు లేకపోలేదు. ఈ క్రమంలో అసలు ప్యాసింజర్‌ ఛార్టర్​లో ఏముంది..? వినియోగదారుల హక్కు చట్టం ఏం చెబుతోంది..? ప్రయాణికుల హక్కులు గురించి తెలుసుకుందామా..?

Airlines Passengers Rights : రోజురోజుకు పెరుగుతున్న విమానయానంతో పాటు ప్రయాణ సేవల్లో లోపాలపై ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. ప్రయాణం రద్దు, ఆలస్యం, ఓవర్‌ బుకింగ్‌తో బోర్డింగ్‌ నిరాకరించడం, బ్యాగులు మాయం, సామగ్రి ధ్వంసం, రీఫండ్‌ ఇవ్వకపోవడం, తదితర అంశాలపై హైదరాబాద్​ పరిధిలోని నాలుగు వినియోగదారుల కమిషన్లలో కేసులు నమోదవుతున్నాయి. ఇలా నెలకు సుమారు 10 కేసుల వరకు తీర్పులు వస్తున్నాయి. బాధితులకు తగిన పరిహారం చెల్లిస్తున్నారు.

ఎయిర్​లైన్స్​ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రయాణికుల సామాన్లు పోతే ఎయిర్​లైన్స్​ సిబ్బంది నుంచి సుమారు రూ.25వేల వరకు పరిహారం పొందే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే సుమారు 1.50లక్షలు వరకు పరిహారం అందుకోవచ్చు. శంషాబాద్​ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 500 వరకు విమానాలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తాయి. అమెరికాతో పాటు దుబాయ్​, కువైట్, ఖతార్​, గల్ఫ్​ దేశాలకు మన రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎయిర్​లైన్స్​ సేవలపై, సంస్థల నిర్లక్ష్యం, ప్యాసెంజర్​ హక్కులపై వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్యాసింజర్‌ ఛార్టర్​లో ఏముంది : వివిధ కారణాలతో విమానాలు ఆలస్యం అవుతుంటాయి. ఆ సమయంలో ప్రయాణం 2 గంటలు ఆలస్యమైతే సదరు విమాన సర్వీస్​ ప్రయాణికులకు ఉచిత భోజనం అందిచాలి. ఆరు గంటల వరకు ఆలస్యమైతే మరో విమానం ఏర్పాటు చేయాలి. లేదంటే టికెట్​ డబ్బులు తిరిగి చెల్లించాలి. ఈ ఆలస్యంతో కనెక్టింగ్‌ విమానం కూడా అందుకోలేకపోతే రూ.10 వేల వరకు ప్రయాణికుడికి పరిహారం ఇవ్వాలి.

రాత్రి సమయంలో విమానం ఆలస్యమైతే ఉచితంగా హోటల్​లో బస ఏర్పాటు చేయాలి. విమాన సమయానికి ప్రయాణికుడు చేరకున్నా.. ఓవర్‌ బుకింగ్‌, ఇతర కారణాలతో బోర్డింగ్‌ నిరాకరిస్తున్న సందర్భాల్లో ఎయిర్‌లైన్స్‌ సంస్థలు గంటలోగా వేరే విమానం ద్వారా ప్రయాణికులను గమ్యం చేర్చాలి. లేదంటే టికెట్‌ డబ్బు తిరిగి చెల్లించాలి. వన్‌ వే బేసిక్‌ ఫేర్‌పై 400 శాతం చెల్లించాలి. వీటితోపాటు ఎయిర్‌లైన్‌ ఇంధన ఛార్జ్‌ లేదా రూ.20 వేలు చెల్లించాలి.

Passenger Charter : ఎయిర్‌లైన్స్‌ సంస్థలు టికెట్‌ రద్దు చేస్తే.. డబ్బు రీఫండ్‌ వివరాలను టికెట్‌పై ముద్రించడంతో పాటు వెబ్‌సైట్‌లో ఉంచాలి. ప్రయాణికుడు టికెట్‌ బుక్‌ చేసిన 24 గంటల్లో రద్దు చేసినా, మార్పులు చేర్పులు చేసినా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. ప్రయాణ తేదీకి 7 రోజుల ముందు వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.