కేసీఆర్ టీఆర్​ఎస్​కు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారు: రేవంత్​రెడ్డి

author img

By

Published : Nov 21, 2022, 4:56 PM IST

Revanth Reddy

Meeting of TPCC affiliates: రాష్ట్రంలో ప్రతిపక్షంగా లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆరోపించారు. అప్రమత్తంగా ఉండకపోతే పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అనుబంధ సంఘాల నేతలతో సమావేశమైన ఆయన.. నాయకులకు దిశా నిర్ధేశం చేశారు. పార్టీలో ఒకరు ఎక్కువ తక్కువ కాదని అందరం సమానమేనని నేతలకు సూచించారు.

Meeting of TPCC affiliates: ప్రభుత్వంపై పోరాటంలో కాంగ్రెస్ అనుబంధ సంఘాల పాత్ర కీలకమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అనుబంధ సంఘాల నేతలతో సమావేశమైన ఆయన.. నాయకులకు దిశా నిర్ధేశం చేశారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్‌ ప్రణాళికపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. పార్టీలో ఒకరు ఎక్కువ తక్కువ కాదని అందరం సమానమేనని నేతలకు సూచించారు.

ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ను లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండకపోతే పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఆయన అన్నారు. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉందని.. అందరం బాధ్యతగా కార్యక్రమాలు చేపట్టి సమస్యలపై పోరాడాలన్నారు. బీజేపీ, టీఆర్​ఎస్​లు పంతాలు, పట్టింపులతో తెలంగాణ ప్రశాంతం కాదని చూపే ప్రయత్నం చేస్తున్నాయని.. మోదీ, కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట కోసం హైదరాబాద్​లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమాయకులపై దాడులు చేస్తూ అక్రమ కేసులతో భయపెట్టి హైదరాబాద్ ప్రశాంతం కాదని చూపే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. గుజరాత్​కు పెట్టుబడులు తరలించాలని కుట్ర చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రహస్యంగా ఉండాల్సిన సమాచారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటప్రకారం 25 వేల కోట్లు బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతులు, భూముల సమస్యలపై ఈనెల 24న తహశీల్దార్ కార్యాలయాల వద్ద, 30న నియోజకవర్గ కేంద్రాల్లో, వచ్చే నెల 5వ తేదీన కలెక్టరేట్ల వద్ద బాధితులతో కలిసి ఆందోళనలు చేస్తామని ప్రకటించారు. శీతాకాల శాసనసభ సమావేశాలు తక్షణమే ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో సచివాలయం లేదని, కలవడానికి ముఖ్యమంత్రి అందుబాటులో లేరన్న ఆయన.. కేసీఆర్ టీఆర్​ఎస్​కు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటికైనా మనసు మార్చుకొని వినతి పత్రాలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు.

అంతకు ముందు భూసంబంధిత సమస్యలపై బీఆర్కే భవన్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ను కలిసిన కాంగ్రెస్ నేతల బృందం.. భూసంబంధిత సమస్యలను వివరించి ఆరు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎస్​కు అందించారు. ధరణిని రద్దు చేసి పాత పద్ధతి తీసుకురావాలని, నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. పోడుభూములకు పట్టాలివ్వాలని, అసైన్డ్ భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.