తీవ్ర తుపానుగా అసని... రెండురోజుల పాటు మోస్తరు వర్షాలు

author img

By

Published : May 9, 2022, 9:47 AM IST

rains

అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భీకర గాలుల ధాటికి పంటల తీవ్రంగా దెబ్బతిన్నాయి. పిడుగులు పడి పలువురు మృతిచెందారు. చాలా చోట్ల రహదారులు జలమయం అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కళ్లాలలోనే ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతుల తంటాలు పడ్డారు. రావులపాలెంలో ఈదురుగాలులు అలజడి సృష్టించాయి. బలమైన గాలుల ధాటికి రెండు ఆర్టీసీ బస్సు అద్దాలు ఊడిపోయాయి. సూపర్ లగ్జరీ బస్సు విజయవాడ నుంచి కాకినాడ వెళ్తుండగా అకస్మాత్తుగా డ్రైవర్ ముందు అద్దం ఊడి కింద పడిపోయింది. రావులపాలెం డిపోకు చెందిన మరో బస్సు అద్దం ఊడి పడింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ధాన్యం రాశులు కళ్లాలలోనే ఉండగా... రైతులు తడవకుండా జాగ్రత్తపడ్డారు.

విజయవాడ నగరంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దుమ్ముతో కూడిన ఈదురుగాలులు రావటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విజయవాడ అవనిగడ్డ కృష్ణా కరకట్ట పై ఉన్న వృక్షాలు నెలకొరగడంతో బస్సులు ఆగిపోయాయి. పోలీసుల సాయంతో వాటిని తొలగించారు. మోపిదేవిలో గాలుల ధాటికి విద్యుత్ తీగల విరిగి పడ్డాయి. కొబ్బరి చెట్టు నెలకొరిగింది. అరటి, మామిడి తోటలకు పెద్దనష్టం జరిగింది. బొప్పాయి పంట పూర్తిగా నేలమట్టం అయ్యింది.

గుంటూరు జిల్లా తెనాలిలో గాలి దుమారం చెలరేగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వ వైద్యశాలలో రోగులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసర విభాగంలో ఏకంగా సెల్‌ఫోన్‌ లైట్ల సాయంతో కట్లు కట్టి..ప్రాథమిక చికిత్స అందించారు. చల్లపల్లి లో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఈదురుగాలుల ప్రభావానికి వేర్వేరు చోట్ల ఇద్దరు యువకులు మృతి చెందారు. నిజాంపట్నం మండలం బొలగాని వారి పాలెంలో తాడి చెట్టు విరిగి పడి గోపీనాథ్ అనే యువకుడు మృతి చెందాడు. పెటేరు గ్రామంలో రాతి గోడ కూలి... మరో యువకుడు మృతి చెందాడు. వర్షానికి వీరులపాడు మండలం జుజ్జూరు నుంచి రంగాపురం వెళ్లే రహదారి దారుణంగా మారింది. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని కందిపాడు గ్రామంలో పిడుగు పడి వ్యక్తి మృతి చెందాడు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో గాలి, వాన ధాటికి అరటి, పసుపు, మొక్కజొన్న, జామ పంట పూర్తిగా దెబ్బతిన్నాయి. అరటి చెట్లు విరిగి నేలకొరిగాయి. నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కడపలో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం వి.అగ్రహారం గ్రామంలో బలమైన ఈదురు గాలుల ధాటికి 200 వందల వక్కచెట్లు నేలకొరిగాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు. అనంతపురం జిల్లా పామిడి మండలం ఎదురూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి వ్యక్తి మృతిచెందాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం సమీపంలో పటాన్ ఖాదర్ ఖాన్ కి చెందిన 5 ఎకరాల మామిడితోట అగ్నికి ఆహుతైంది. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ తీగలు తెగిపడి తోట దగ్ధమైంది.భారీ వర్షాలకు అనకాపల్లి జీల్లా నర్సీపట్నంలో రహదారులు జలమయాయ్యాయి. కాలనీలు నీటి ముంపునకు గురయ్యాయి. రోలుగుంట, రావికమతం మండలాల్లో భారీ వర్షం కురిసింది.

ఇవీ చదవండి : బస్సులో సీక్రెట్​ క్యాబిన్​.. డౌట్​ వచ్చి చూస్తే 1900 కిలోల వెండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.