చిన్న పార్టీలు, స్వతంత్రులకు రోడ్డు రోలర్, చపాతీ కర్ర గుర్తుల కేటాయింపు - బీఆర్ఎస్ నేతల్లో గుబులు

చిన్న పార్టీలు, స్వతంత్రులకు రోడ్డు రోలర్, చపాతీ కర్ర గుర్తుల కేటాయింపు - బీఆర్ఎస్ నేతల్లో గుబులు
Political Parties Symbols Issue in Telangana : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలు చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కారు గుర్తును పోలి ఉన్న చపాతి కర్ర, రోడ్డు రోలర్ గుర్తులను కేటాయించారు. అయితే ఈ గుర్తులతో ఇబ్బందిగా ఉందని.. ఓట్లు తారుమారు ఆవుతాయని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Political Parties Symbols Issue in Telangana : శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు రంగారెడ్డి జిల్లా అధికారులు నియోజకవర్గాల వారీగా గుర్తులు కేటాయించారు. నిరక్షరాస్యులైన ఓటర్లు కూడా ఈవీఎంలను చూడగానే గుర్తులను పోల్చుకునేలా.. ప్రజలు విరివిగా ఉపయోగించే వస్తువులు, పరికరాలు, యంత్రాలను ఎంపిక చేశారు. గ్యాస్‌బండ, గ్యాస్‌స్టవ్, ప్రెషర్ కుక్కర్, టీవీ రిమోట్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, ఆపిల్ పండు, బంతి, స్టెతస్కోప్, కుట్టుమిషన్, కెమెరా, క్యారంబోర్డు, పెట్రోల్ పంప్, ఐస్‌క్రీం, కత్తెర, బెలూన్, టార్చిలైట్, బ్యాట్, మైక్, హాకీ స్టిక్, గాజులు, పల్లకి, ఉంగరం, చెప్పులు, కుండ, టూత్ పేస్ట్, పండ్ల బుట్టలతో పాటు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును స్వతంత్రులకు కేటాయించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో నాయకులు ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు.
Car Symbol Issue constituencies of Telangana : శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో కారును పోలిన రోడ్డు రోలర్, చపాతీ కర్ర గుర్తులు తమ పార్టీ అభ్యర్థులకు కొంత నష్టాన్ని కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు నాలుగైదేళ్ల నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. వీటిని ఇతర పార్టీలకు, స్వతంత్రులకు కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు విన్నవించారు. ఈ వాదనలో సహేతుకత లేదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పడంతో కొన్నినెలల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులను ఇతరులకు కేటాయించకుండా తాము ఆదేశించబోమని సుప్రీంకోర్టు సైతం అక్టోబరులో తీర్పు ఇచ్చింది. మరోవైపు యుగ తులసి పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని తమకు రోడ్డురోలర్ గుర్తు కావాలని కోరింది. ఈ అభ్యర్థనకు ఎన్నికల సంఘం(ELECTION Commission) సానుకూలంగా స్పందించి.. ఆ పార్టీ పోటీ చేసిన నియోజకవర్గంలో మాత్రమే ఇస్తామని మిగిలిన చోట ఇతరులకు కేటాయిస్తామని వెల్లడించింది.
- శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో యుగతులసి పార్టీ అభ్యర్థులకు రోడ్డురోలర్ గుర్తును కేటాయించారు.
- రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న మహ్మద్ అబ్దుల్ అజీజ్‌కు, చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులైన నరసింహ, తుడుము పాండుకు, రోడ్డురోలర్ గుర్తును ఇచ్చారు.
- ఎల్బీనగర్, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో అలయన్స్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ పార్టీ(Alliance of Democratic Reforms Party) అభ్యర్థులకు రోడ్డు రోలర్, చపాతీ కర్ర గుర్తు దక్కింది.
- జనసేన గుర్తు.. గాజు గ్లాసును మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తున్న రాజమహేంద్ర కటారి, సుబ్రమణ్య రాహుల్‌కు కేటాయించారు. కల్వకుర్తిలో ఎస్‌యూసీఐ పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు కేటాయించారు.
