లోకేశ్​ యువగళానికి అనుమతుల రాజకీయం.. పోలీసుల కొర్రీలపై టీడీపీ ఫైర్

author img

By

Published : Jan 22, 2023, 5:20 PM IST

లోకేశ్​ యువగళానికి అనుమతుల రాజకీయం.. పోలీసుల కొర్రీలపై టీడీపీ ఫైర్

Yuvagalam maha padayatra Police Restrictions: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం పేరిట మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 27న ఏపీలోని కుప్పంలో ప్రారంభం కానున్న పాదయాత్ర 4వేల కిలోమీటర్లు కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా లోకేశ్​ 400 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి భరోసా కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర నిర్వహణకు పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టగా.. అనుమతుల సాకుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది.

Nara Lokesh Yuvagalam maha padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం మహాపాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నాయకులు పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువకావడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తు చేస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలిన ప్రభుత్వం.. ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అడ్డుకోజూస్తోందని ధ్వజమెత్తారు. అనుమతులు ఇవ్వొద్దనే ఉద్దేశంతో జవాబులు లేని ప్రశ్నలతో డీజీపీ లేఖ రాయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మహా పాదయాత్రలో ఎంత మంది పాల్గొంటారో ముందే చెప్పడం సాధ్యమేనా అని ప్రశ్నించారు.

పోలీసులది రాజకీయం..: పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రకరకాల సమాచారం పేరుతో అనుమతి నిరాకరణ వ్యూహాన్ని పోలీసులు అవలంభిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. గతంలో ఎప్పుడూ అడగని ప్రశ్నలు లోకేశ్ పాదయాత్రకు ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. డీజీపీ రాసిన లేఖపై పలు ప్రశ్నలు సంధించిన వర్ల రామయ్య.. పోలీసులే ప్రతిపక్షాల కార్యక్రమాలను అడ్డుకునే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

మండిపడ్డ నాయకులు..: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పాదయాత్రకు డీజీపీ లేఖపై టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. డీజీపీ ప్రశ్నల తీరును ఆయన తప్పుబట్టారు. ఆయన డీజీపీ కాదు.. కసిరెడ్డే! అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు లోకేశ్​ పాదయాత్రకు డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండిషన్లు పెట్టడం తాడేపల్లి కుట్రేనని తెదేపా పొలిట్​బ్యూరో మెంబర్ బొండా ఉమా ధ్వజమెత్తారు. పాదయాత్రకు ఎంతమంది వస్తారో, ఎన్ని కార్లు వస్తాయో.. వివరాలు ఇమ్మంటే సాధ్యమా..? అని నిలదీశారు. లోకేశ్​ పాదయాత్రకు జగన్ అవినీతి పాలనతో ఇబ్బంది పడి, కడుపు మండిన ప్రజలు ఎంత మంది వస్తారో అంచనా వేయడం సాధ్యమా..? అని ప్రశ్నించారు.

అయ్యన్నపాత్రుడి ట్వీట్
అయ్యన్నపాత్రుడి ట్వీట్

గతం మర్చిపోతే ఎలా..: గతంలో వైసీపీ జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఏ అనుమతి అవసరం లేదని చెప్పిన మాట డీజీపీకి గుర్తులేదా అని దుయ్యబట్టారు. జగన్, షర్మిల పాదయాత్రకు ఏ విధంగా పోలీసులు అనుమతి ఇచ్చారో లోకేశ్​ పాదయాత్రకు అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లే హక్కు రాజ్యాంగమే ఇచ్చిందనే విషయాన్ని డీజీపీ గుర్తు పెట్టుకోవాలన్నారు. లోకేశ్​ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

యువ గళానికి సంఘీభావం..: లోకేశ్‌ యువగళానికి సంఘీభావంగా వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ నేత జీవీ ఆంజనేయులు పాదయాత్ర చేపట్టారు. వినుకొండ సాయిబాబా గుడి నుంచి ప్రారంభించిన పాదయాత్ర.. మదమంచిపాలెం ఆంజనేయస్వామి గుడి వరకు కొనసాగనుంది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని పాదయాత్రను ప్రారంభించగా.. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జగన్, డీజీపీ కుట్ర..: నారా లోకేశ్​ పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాక్షస ప్రభుత్వంలో.. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని తెలిపారు.

నారా లోకేశ్​ పాదయాత్ర అంటే ప్రభుత్వానికి వణుకు మొదలైంది. పాదయాత్ర ఆపాలని జగన్, డీజీపీ కుట్ర చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజల సమస్యలపై లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. పోలీస్ వారికి ఒక్కటే చెబుతున్నాం.. ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న లోకేశ్ యాత్రకు చట్టపరంగా వ్యవహరించాలి. లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది- కొల్లు రవీంద్ర, టీడీపీ నేత

లోకేశ్​ యువగళానికి అనుమతుల రాజకీయం.. పోలీసుల కొర్రీలపై టీడీపీ ఫైర్

ఇవీ చదవండి:

ధైర్యం, చాకచాక్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను: స్మితా సబర్వాల్‌

ఇంటి వద్దే దహన సంస్కారాలు.. విద్యుత్​, గ్యాస్​తో నడిచేలా సంచార శ్మశానం ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.