Pm Muchhinthal Tour: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు ప్రధాని మోదీ

author img

By

Published : Jan 13, 2022, 5:14 AM IST

Muchhinthal

Pm Muchhinthal Tour: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ముచ్చింతల్‌లో చినజీయర్‌ స్వామి ఆశ్రమం శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ వేడుకలు ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిపేందుకు సిద్ధమవుతున్నారు.

Pm Muchhinthal Tour: హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌లో చినజీయర్‌ స్వామి ఆశ్రమం శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో జరిగే వేడుకలలో సమతామూర్తి పేరిట నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

పీఎం పర్యటన ఖరారు...

ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్‌ పర్యటన ఖరారైంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జీయర్‌స్వామి ఆశ్రమానికి సమాచారం అందింది. ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మోదీ ఆశ్రమానికి చేరుకుంటారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం ఇస్తారు. హోమంలో పాల్గొంటారు. దాదాపు 4 నుంచి 5 గంటలపాటు మోదీ పర్యటన కొనసాగనుంది. కార్యక్రమంలో ఆయనతోపాటు సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు.

ఉత్సవాలు నిర్వహించే రోజులలో భారీఎత్తున హోమాలు జరగనున్నాయి. సమతామూర్తి విగ్రహానికి సమీపంలోనే దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. 35 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 5వేల మంది రుత్వికులు, వేదపండితులు విచ్చేసి క్రతువులో పాల్గొంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు కొనసాగుతాయి.

ముచ్చింతల్‌లో నిర్మించిన యాగశాలలు

విదిక్కులలో సమూహంగా నిర్మాణం...

పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితులు ముడుంబై మధుసూదనాచార్యస్వామి పర్యవేక్షణలో 144 యాగశాలలతోపాటు ప్రధాన యాగశాల నిర్మించారు. నాలుగు విదిక్కులలో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం యాగశాలల్లో 114 చోట్ల యాగాలు జరుగుతాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టిశాలలు. వీటన్నింటిలో 1,035 హోమకుండాలు నిర్మిస్తున్నారు. ఉత్సవాలు జరిగే రోజులలో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం జపించనున్నారు.

తొమ్మిది రకాల హోమకుండాలు...

మొత్తం 114 యాగశాలలలో తొమ్మిది చొప్పున హోమకుండాలు ఉంటాయి. వాటిని చతురస్రం, యోనికుండం, ధనస్సు కుండం, షడస్రం, వృత్తం, పంచాస్త్రం, త్రికోణం, అష్టాస్త్రం, పద్మకుండంగా వ్యవహరిస్తారు. ఒక్కోటి ఒక్కో శుభ సంకేతానికి సూచికగా నిలుస్తుంది. వీటి నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ప్రతి హోమకుండం వద్ద ముగ్గురు రుత్వికులు లేదా పండితులు కూర్చుని యాగం చేస్తారు.

ఒక్కో యాగశాలకు పర్యవేక్షకుడిగా ఉపద్రష్ట వ్యవహరిస్తారని ఆశ్రమ పండితుడు ఉడవర్తి శరత్‌స్వామి ‘ఈనాడు- ఈటీవీ భారత్​’కు వివరించారు. మధ్యలో ఉన్న వేదిక వద్ద వేద, ప్రబంధ, ఇతిహాస తదితర పారాయణలు జరుగుతాయన్నారు. హోమశాల బయట సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యాగం చేసే వారిని మినహా మిగిలిన వారిని యాగశాల లోపలికి అనుమతించరు.

2 లక్షల కిలోల నెయ్యి...

ప్రతి హోమకుండంలో ఒకపూటకు నాలుగు కిలోల నెయ్యి వినియోగిస్తారు. అలా రోజుకు ఒక్కో యాగశాలలో 9 హోమకుండాలకు 72 కిలోల నెయ్యి అవసరం. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో దేశీయ ఆవు పాల నుంచి సేకరించిన 2 లక్షల కిలోల స్వచ్ఛమైన నెయ్యిని వినియోగించనున్నారు. రావి, మామిడి, మోదుగ, జువ్వి, మేడి చెట్ల కట్టెలనే వాడతారు. అలాగే ఆవుపేడతో కూడా కర్రల మాదిరి తయారు చేస్తున్నారు. ఈ ద్రవ్యాలను యాగంలో వినియోగిస్తారు.

ఇదీ చూడండి:

Cm Kcr Visit Muchhinthal: దివ్యసాకేతంలో కేసీఆర్‌... వేడుకల ఏర్పాట్ల పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.