Oppositions on GO 317: 'జీవో 317తో స్థానికులే స్థానికేతరులుగా మారే ప్రమాదముంది'

author img

By

Published : Dec 29, 2021, 9:15 PM IST

GO

Oppositions on GO 317: నూతన జోనల్ విధానానికి అనుగుణంగా చేపట్టిన పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం తెచ్చిన జీవో 317తో అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. స్థానికులే స్థానికేతరులుగా మారే ప్రమాదమున్న ఉత్తర్వుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఐదో షెడ్యూల్‌ను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం తెచ్చిన జీవోతో ఆదివాసీ, గిరిజన ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో బీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్‌ గౌడ్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ను కలిశారు.

'జీవో 317తో స్థానికులే స్థానికేతరులుగా మారే ప్రమాదముంది'

Oppositions on GO 317: తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకోవటం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి... జీవో నెంబర్‌ 317ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల విభజన, బదిలీల్లో స్థానికతను పరిగణించాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలని పేర్కొన్నారు. చర్చల తర్వాత మార్గదర్శకాల మేరకు బదిలీలు చేపట్టాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు జరిగిన జీవో నెంబర్‌ 3 ప్రకారమే ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు చేపట్టాలని ప్రస్తావించారు.

మేం ఉద్యమిస్తాం...

ఉద్యోగుల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్... వ్యవహరిస్తున్న తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు అల్లాడిపోతుంటే... ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. తక్షణమే 317 జీవోపై పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన... భాజపా ఉద్యమిస్తుందని ప్రకటించారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

317 జీవో పేరుతో సీఎం కేసీఆర్... వ్యవహరిస్తున్న తీరువల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలన్ని ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగులంతా స్థానికేతరులుగా మారి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 5వ షెడ్యూల్‌ను పరిగణలోని తీసుకోలేదని ఆరోపిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కలిశారు.

అన్యాయం జరుగుతోంది...

317జీవోతో బీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. బీసీ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమస్యలపై గవర్నర్‌ తమిళిసైను కలిసి వివరించినట్లు చెప్పారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.