అర్వింద్‌ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి: ప్రశాంత్‌రెడ్డి

author img

By

Published : Nov 19, 2022, 3:43 PM IST

Updated : Nov 19, 2022, 5:37 PM IST

Minister Prashanth Reddy fires on MP Arvind

Prashanth Reddy Fires On MP Arvind: ఎంపీ అర్వింద్ అనే వ్యక్తి ఓ నిలువెత్తు అబద్ధమని మంత్రి ప్రశాంత్​రెడ్డి అభివర్ణించారు. ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తామని హామీ ఇచ్చిన అర్వింద్​.. మాట తప్పారని దుయ్యబట్టారు. అందుకే ఆయనను గ్రామాల్లోకి ప్రజలు రానివ్వడం లేదని అన్నారు. అర్వింద్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ప్రశాంత్​రెడ్డి హితవు పలికారు.

Prashanth Reddy Fires On MP Arvind: ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నట్లు మంత్రి ప్రశాంత్​రెడ్డి అన్నారు. ఆది నుంచి అర్వింద్ భాష, వ్యవహారశైలి అధ్వాన్నంగా ఉందని ఆరోపించారు. భాష మార్చుకోవాలని ఆయనకు చెప్పినా మారడం లేదన్నారు. ఇప్పటికైనా తన భాష మార్చుకోవాలని అర్వింద్‌ను హెచ్చరించారు. కవితను ఉద్దేశించి ఎంపీ చేసిన వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. రాజకీయ చరిత్రలో ఎవరన్నా ఇంత కుసంస్కారంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎ​స్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ ఇంట్లో ఆడబిడ్డను అర్వింద్ ఇలాగే అంటారా అని ప్రశాంత్​రెడ్డి ప్రశ్నించారు. ఆయన గురించి మాట్లాడాలంటేనే తమకు అసహ్యమని.. అందుకే తాము మాట్లాడమని చెప్పారు. అర్వింద్ అనే వ్యక్తి ఓ నిలువెత్తు అబద్ధంగా మంత్రి అభివర్ణించారు. ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తామని హామీ ఇచ్చిన అర్వింద్​.. మాట తప్పారని మండిపడ్డారు. అందుకే ఆయనను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వడం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఎంపీ అర్వింద్ ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి: కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని ఖర్గేతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారని చెబుతున్న అర్వింద్.. స్వయంగా చూశారా అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక కుటుంబం.. మూడు పార్టీల్లో ముగ్గురు ఉన్న చరిత్ర మీదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను సైతం అర్వింద్‌ గౌరవించడం లేదన్న మంత్రి.. ఆయనపై ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. ఈ క్రమంలోనే ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేశారని గవర్నర్ ట్వీట్ చేశారని.. ఆ రోజు కవితపై మాట్లాడితే గవర్నర్ ఎందుకు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు. ఇకనైనా అర్వింద్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ప్రశాంత్​రెడ్డి హితవు పలికారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా అర్వింద్ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ప్రజలు హర్షిస్తారని ఎమ్మెల్యే గణేశ్​ గుప్తా, ఎమ్మెల్సీ గంగాధరగౌడ్ అన్నారు. ఇప్పటికే 8 రాష్ట్రాలను మింగేసిన బీజేపీ.. ఈడీ దాడులు, కేసుల పేరిట నేతలను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఇక ఎంపీగా పోటీచేస్తే ఓటమి ఖాయమన్న భయంతో అర్వింద్.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆర్మూర్​లో మకాం వేశారని వారు విమర్శించారు.

"అర్వింద్ భాష, వ్యవహారశైలి అధ్వాన్నంగా ఉంది. రాజకీయ చరిత్రలో ఎవరన్నా ఇంత కుసంస్కారంగా మాట్లాడతారా.తమ ఇంట్లో ఆడబిడ్డను అరవింద్ అలాగే అంటారా. ఇది పద్ధతి కాదు. కవిత సరైన సమాధానం ఇచ్చారు. సాధారణంగా అర్వింద్ గురించి మాట్లాడాలంటే మాకు అసహ్యం. ఆయన గురించి పట్టించుకోవడం మానేశాం. ఒక్క మంచి పని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చేశారా. ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి మాట తప్పారు. అందుకే అర్వింద్​ను గ్రామాల్లోకి ప్రజలు రానివ్వడం లేదు. అందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారు." -ప్రశాంత్​రెడ్డి మంత్రి

అర్వింద్‌ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి: ప్రశాంత్‌రెడ్డి

ఇవీ చదవండి: అర్వింద్​ వర్సెస్ కవిత​... రాష్ట్రంలో హీటెక్కిన రాజకీయం!

పోలీసుల కనుసన్నలోనే అర్వింద్​ ఇంటిపై దాడి.. సీఎం స్పందించాలి: బండి సంజయ్​

'ఎన్నికల కోసమే శంకుస్థాపన అన్నారు.. ఈ ఎయిర్​పోర్ట్​తో వారికి గట్టి దెబ్బ'

Last Updated :Nov 19, 2022, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.