Prasanth Reddy on AP govt: రూ.5 వేల కోట్లకు ఆశపడి ఏపీలో మీటర్లు: ప్రశాంత్‌రెడ్డి

author img

By

Published : May 13, 2022, 5:07 AM IST

Prasanth Reddy on AP govt

Prasanth Reddy on AP govt: కేంద్రం ఇచ్చే రూ.5 వేల కోట్ల రుణ పరిమితికి ఆశపడి ఏపీలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లోనే మోటర్లు పెట్టేస్తామని ఏపీ మంత్రి చెప్పారని అన్నారు. మీటర్లు పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని తెలిపారు.

Prasanth Reddy on AP govt: కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల రుణ పరిమితి ఆశ చూపడంతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో వచ్చే 6 నెలల్లో విద్యుత్ మీటర్లు పెట్టడం పూర్తి చేస్తామని అక్కడి మంత్రి అంటున్నారని తెలిపారు. కేంద్రం ఆశ చూపించినప్పటికీ మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు.

‘‘ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఇవ్వలేదు. భాజపా ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్‌లు చేతనైతే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా తెప్పించాలి. ప్రధాని మోదీ దేశాన్ని అదానీ, అంబానీలకు అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలను గుజరాత్‌కు తరలించుకు పోతుంటే రాష్ట్ర భాజపా ఎంపీలు ఏమీ చేయలేకపోయారు. ఇవాళ ఏం వారం.. రేపు ఏం వారం.. అంటూ తిరుగుతున్న బండి సంజయ్‌కు అభివృద్ధి మాత్రం అక్కర్లేదు. కేసీఆర్ పైకి తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై వస్తున్నాయి. సరైన సమయంలో సరైన విధంగా ప్రజలే వారికి గుణపాఠం చెప్తారు. తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలపై విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు.. యూపీఎస్సీ నిర్వహించే ఉద్యోగాల్లోనూ ఉర్దూ ఉంటుంది. అంత మాత్రాన దేశమంతా ముస్లిం కలెక్టర్లు ఉన్నారా? భాజపా ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్‌ పరీక్షలపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’’ - ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి

కేంద్రం రూ.5 వేల కోట్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ రైతులే తనకు ముఖ్యమని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. పాలమూరుకు నీళ్లు రాకుండా కృష్ణా జలాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని మంత్రి విరుచుకుపడ్డారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, వేల్పూర్, ఏర్గట్ల మండలాలకు చెందిన పలువురు భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు ప్రశాంత్ రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన ప్రశాంత్‌ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇవీ చూడండి: ఐస్​క్రీం తిని ఫ్లేవర్ చెప్తే చాలు.. మీరే లక్షాధికారి..!

కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.