'బీజేపీ కుట్రలకు భయపడేది లేదు.. ఇంకా పార్ట్ ​2, 3 కూడా ఉంటాయి'

author img

By

Published : Nov 24, 2022, 12:04 PM IST

Updated : Nov 24, 2022, 2:26 PM IST

Mallareddy response on IT raids

Mallareddy Response on IT Raids: మూడురోజులుగా జరిగిన ఐటీ విస్తృత దాడులపై కార్మికశాఖ మంత్రి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుట్రలో భాగంగానే కేంద్రం తెరాస మంత్రులపై ఐటీ,ఈడీ దాడులు చేస్తోందని మండిపడ్డారు. భాజపా కుట్రలకు భయపడేది లేదన్న మంత్రి చివరి వరకు కేసీఆర్​ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా.. కేవలం 28 లక్షలు మాత్రమే ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి వివరించారు.

Mallareddy Response on IT Raids: తనపై ఐటీ దాడులు చేయిస్తున్న బీజేపీ కుట్రలకు భయపడేది లేదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇటువంటి దాడులు ముందే జరుగుతాయని సీఎం కేసీఆర్​ తమకు హెచ్చరించారని మంత్రి తెలిపారు. గత మూడు రోజులుగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన విద్యాసంస్థలు, బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి ఇంట్లో సోదాలు ముగిసినా.. మిగిలిన బంధువుల ఇళ్లల్లో ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా మంత్రి మల్లారెడ్డి ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి వివరణ ఇచ్చారు.

"మా కుటుంబసభ్యులను రెండ్రోజుల పాటు భయపెట్టారు. బలవంతంగా నా కుమారుడితో సంతకాలు చేయించారు. అక్రమాలు, దౌర్జన్యం మాకు అలవాటు లేదు. మా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు.ఇంతటి దౌర్జన్యాలు నేనెప్పుడూ చూడలేదు. ఇంత మంది పోలీసులు రావడం తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి. ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఇంత కుట్ర అవసరమా? ఐటీ అధికారులే నమ్మించి మోసం చేశారు. భాజపాలో ఉంటే దాడులు ఉండవు. వేరే పార్టీలో ఉంటే రోజూ దాడులే." - మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి

అందరికీ తక్కువ ధరకే విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ విద్యాసంస్థలను స్థాపించామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఇంజినీరింగ్​ వ్యవస్థ తెచ్చామని.. ఇందుకు చాలా గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఇంజినీరింగ్​ వ్యవస్థ అంటే మల్లారెడ్డి గుర్తొచ్చేలా తీర్చిదిద్దామని హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తున్నామన్నారు. వారికి చక్కని భవిష్యత్తును చూపిస్తున్నామని వివరించారు.

"నా దగ్గర వేల మంది విద్యార్థులు ఉంటారు. కానీ.. వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి. అన్ని కోట్లు ఉంటే ఈ ఇంట్లో ఎందుకు ఉంటాము. పార్ట్​-1 అయ్యింది.. ఇంకా పార్ట్ ​2,3 కూడా ఉంటాయి. టీఆర్​ఎస్​ చేస్తున్న అభివృద్ధిని చూడలేకపోతున్నారు. కేంద్రంలో బీఆర్‌ఎస్‌ వస్తుందేమోనన్న భయంతోనే దాడులు జరుగుతున్నాయి." - మంత్రి మల్లారెడ్డి

అందరి ఇళ్లల్లో సోదాలు చేస్తే కేవలం రూ.28 లక్షలు మాత్రమే దొరికాయని మంత్రి వివరించారు. లావాదేవీలు అన్నీ ఆన్​లైన్​లో జరిగితే డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. మేనేజ్​మెంట్​ కోటా లేనప్పుడు రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయన్నారు. 50 శాతం వైద్య సీట్లు కౌన్సిలింగ్​లో ఇస్తున్నామని పేర్కొన్నారు. మేం సేవ చేస్తున్నాం.. బిజినెస్​ కాదని మల్లారెడ్డి స్పష్టం చేశారు.

మంత్రి మల్లారెడ్డి

ఇవీ చదవండి:

Last Updated :Nov 24, 2022, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.