హ్యాట్రిక్ ఖాయం... వచ్చే ఎన్నికల్లోనూ తెరాసదే విజయం: కేటీఆర్
Updated on: May 9, 2022, 6:50 AM IST

హ్యాట్రిక్ ఖాయం... వచ్చే ఎన్నికల్లోనూ తెరాసదే విజయం: కేటీఆర్
Updated on: May 9, 2022, 6:50 AM IST
ASKKTR IN TWITTER: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పెరిగినన ఎల్పీజీ, పెట్రోల్ ధరల పాపం కేంద్రానిదే అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే యువత అత్యంత సహనంతో కఠినంగా వర్క్ చేయాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత దేశంలో తనకు అత్యంతమైన నాయకుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని పేర్కొన్నారు.
ASKKTR IN TWITTER: పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం టాక్స్‌లు తగ్గించాలని ప్రధానమంత్రి మాట్లాడటం... ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. 2014లో 410 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు వెయ్యి రూపాయలకు చేరిందని చెప్పారు. ఇది కేవలం మోదీ పరిపాలన వల్లే సాధ్యం అయిందని... అచ్చే దిన్‌కు స్వాగతం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు సిలిండర్ ధరల విషయంలో భారత దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఆస్క్ కేటీఆర్ హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు.
2024 ఎన్నికల్లో తెరాసకు అనేక ప్రతిపక్షాలు, కాంగ్రెస్, భాజపా నుంచి పోటీ ఉంటుందని కేటీఆర్ అన్నారు. అయితే ప్రజల ఆశీర్వాదంతో తమ సుపరిపాలన కొనసాగేలా విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు కాంగ్రెస్ కన్నా గట్టిగా భాజపా, ప్రధాని మోదీ విధానాలను కేసీఆర్ నాయకత్వంలో తెరాస నిలదీస్తోందని చెప్పారు. అయితే ఈ విషయంలో జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించే అవకాశం ఉన్నదా అన్న ప్రశ్నకు సమాధానంగా స్పందించిన కేటీఆర్... భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు అన్నారు. మీ సేవలు, మీ నాయకత్వం జాతీయస్థాయిలో కావాలని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో సంతోషంగా ఉన్నానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వదని ఇప్పటికే తేలిపోయిందని, వారిపైన ఆశలు వదులుకున్నామని మా సొంతంగా ఉద్యోగాల కల్పనపై ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా తెలంగాణకు ఐఐఎమ్, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐడీ, ఐఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థలను ఒక్క దానిని కూడా కేటాయించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్ముతున్న భాజపా అంటే బెచో జనతాకి ప్రాపర్టీ అని అభివర్ణించారు.
-
Not a single national educational institution such as IIM, IISER, NID or IIIT sanctioned by this Union Govt to Telangana
— KTR (@KTRTRS) May 8, 2022
It’s hopeless to expect anything from them as we’ve been requesting for 8 years in vain https://t.co/P16lFu8BDP
2500 కోట్లు ఇచ్చి కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటు కొనుక్కోమని చెప్పారన్న భాజపా ఎమ్మెల్యే వ్యాఖ్యలు... ఆ పార్టీ రియల్ ఫేస్‌ను చూపిస్తోందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తున్నామని... ఎక్కడైనా కొరత ఉంటే మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్‌కు సంబంధించి భూసేకరణ త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పారు. జహీరాబాద్‌లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు సంబంధించిన ప్రాజెక్టు భూసేకరణ అత్యంత కీలకమైనదని అయితే ఇప్పటికే అనేక మంది పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
-
Real face of BJP https://t.co/ztN2MQPKS6
— KTR (@KTRTRS) May 8, 2022
హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల ఈకో సిస్టం అభివృద్ధి పైన టీఎస్ రెడ్కో కార్యక్రమాలు రూపొందిస్తుందని కేటీఆర్ తెలిపారు. బిల్లింగ్ రెగ్యులేషన్ స్కీమ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని దాన్ని త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరం త్వరలోనే 100 శాతం మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లను కలిగి ఉండబోతుందని, ఆ తర్వాత నగరంలోని హుస్సేన్ సాగర్‌తో పాటు ఇతర చెరువులు కలుషితం అయ్యే అవకాశం తగ్గుతుందన్నారు. నాగోల్ ఫ్లైఓవర్ ఈ ఆగస్ట్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
సమగ్రమైన ప్రజా రవాణా వ్యవస్థ ద్వారానే ప్రధాన సమస్యలను తొలగిస్తుందని, ఫ్లైఓవర్ ఇందుకు సహకరిస్తాయన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం పౌరుల బాధ్యత అని... పోలీసులు కేవలం వాటిని అమలు చేసేలా ప్రయత్నం చేయగలుగుతారని అంతిమంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలు ఉండాల్సిందే అని, వాక్ స్వాతంత్రం పేరిట ఇతరులను ఇబ్బంది పెట్టడం సరైనది కాదని చెప్పారు.
హైదరాబాదులో క్రికెట్ మ్యాచ్లు జరగడంలేదని ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు జరిగితే చూడాలనుకుంటున్నామన్న అభిమాని ప్రశ్నకు సమాధానం కోసం బీసీసీఐకి చెందిన జేషా, సౌరవ్ గంగూలీలని అడగాలని కేటీఆర్ సూచించారు. ఒకప్పుడు కరవుకాటకాలతో తల్లడిల్లిన పాలమూరు జిల్లా ఈరోజు పచ్చగా మారడం సంతోషంగా ఉందన్నారు. గత ఏడేళ్లలో తెలంగాణలో 120 శాతానికిపైగా ఫార్మింగ్ పెరిగిందని, ఇందుకు 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, మిషన్ కాకతీయ, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టులు ప్రధాన కారణమని పేర్కొన్నారు. తన కుమారుడు హిమాన్షు పాఠశాలలో క్రియేటివ్ యాక్షన్ ప్లాన్‌కి ప్రాతినిధ్యం వహించడం పట్ల ఒక తండ్రిగా గర్వపడుతున్నా అని కేటీఆర్ అన్నారు.
-
#ProudFather https://t.co/gdYBnwJraz
— KTR (@KTRTRS) May 8, 2022
ఇవీ చూడండి: GOVERNOR: తెలంగాణలో బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉంది: తమిళిసై
రూ.180 చెప్పులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. నవ్వుకున్న పోలీసులే చివరకు...
