నిమ్స్‌కు అనుబంధంగా మరో 2వేల పడకల ఆస్పత్రి: మంత్రి హరీశ్‌

author img

By

Published : Jun 23, 2022, 7:58 PM IST

harish

హైదరాబాద్ నిమ్స్‌ ఆస్పత్రిలో 5 కోట్లతో పీడియాట్రిక్, కార్డియాలజీ యూనిట్‌తో పాటు 200 పడకల ఐసీయూ, వెంటిలేటర్లను, ఇతర సౌకర్యాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. నిమ్స్‌కు అనుబంధంగా మరో 2వేల పడకల ఆస్పత్రిని అనుబంధంగా నిర్మించనున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌లో ప్రభుత్వ రంగంలో 6వేల పడకలతో సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రుల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. నిమ్స్‌ ఆస్పత్రిలో 5 కోట్లతో పీడియాట్రిక్, కార్డియాలజీ యూనిట్‌తో పాటు 200 పడకల ఐసీయూ, వెంటిలేటర్లను, ఇతర సౌకర్యాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మరో మంత్రి గంగుల కమలాకర్, ఆసుపత్రి డైరెక్టర్ మనోహర్, రోటరీ క్లబ్‌ ఆఫ్ జూబ్లీహిల్స్ సీఎండీ వెంకట్ జాస్తి పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, సువెన్ లైఫ్ సైన్సెస్ సంయుక్తంగా ఆస్పత్రిలో 5 కోట్ల రూపాయలతో అత్యాధునిక పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ యూనిట్‌ను ఏర్పాటు చేశాయి.

హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ స‌దుపాయానికి అనువైన క్లాస్‌-1 ఎయిర్ కండీష‌న్డ్ ఐసోలేష‌న్ క్లీన్ రూం, హార్ట్ లంగ్ మిష‌న్‌, నైట్రిక్ ఆక్సైడ్ స‌ర‌ఫ‌రా యంత్రం, బ్రాంకోస్కోప్‌, ఫొటోథెర‌పీ యూనిట్ వంటివి ఇందులో ఉన్నాయి. పుట్టుక‌తో గుండె జ‌బ్బులు ఉన్న పిల్లల‌కు, ఇత‌ర పేద రోగుల‌కు ఈ యూనిట్ ద్వారా ఎంతో ప్రయోజ‌నం చేకూరుతుందని వైద్యులు అభిప్రాయపడ్డారు.

రూ.5 కోట్లతో పీడియాట్రిక్, కార్డియాలజీ యూనిట్‌ను ప్రారంభించాం. నవ జాత శిశువులకు సులభంగా గుండె శస్త్రచికిత్సలు జరుగుతాయి. సీఎం ఆలోచన మేరకు నిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి చేపట్టాం. ఆస్పత్రిలో అదనంగా 200 ఐసీయూ బెడ్స్‌ ప్రారంభించాం. రాబోయే రోజుల్లో ఐసీయూ కొరత ఉండదు. ఆరునెలల్లో రూ.186 కోట్ల నిధులు మంజూరు చేసాం. - హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

ఏటా నిమ్స్ అభివృద్ధి కోసం 200 కోట్లు గ్రాంట్స్ ఇస్తున్నట్లు మంత్రి హరీశ్ పేర్కొన్నారు. గత ఆర్నెళ్లలో వైద్య పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.186కోట్లు అందజేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. నిమ్స్‌ ఆస్పత్రిని మరింత విస్తరించేందుకు సీఎం నిర్ణయించారన్న మంత్రి... అందులో భాగంగానే ఎర్రమంజిల్‌లో మరో 2వేల పడకల సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రిని అనుబంధంగా నిర్మించనున్నట్లు చెప్పారు.

నిమ్స్‌కు అనుబంధంగా మరో 2వేల పడకల ఆస్పత్రి: మంత్రి హరీశ్‌రావు


ఇదీ చూడండి: ఎన్ఐఏ అదుపులో లాయర్లు​ శిల్ప, దేవేంద్ర.. రాధ మిస్సింగ్‌ కేసుపై విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.