మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు.. నగదు, కీలక పత్రాలు స్వాధీనం

author img

By

Published : Nov 22, 2022, 7:38 AM IST

Updated : Nov 22, 2022, 4:52 PM IST

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

07:34 November 22

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

IT searches in the houses and offices of many celebrities in Hyderabad
మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్లారెడ్డి

ఓ వైపు ఎమ్మెల్యే ఎర కేసు.. దిల్లీ మద్యం కుంభకోణం విచారణ వేళ రాష్ట్రంలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గ్రానైట్​ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారంలో ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌ నివాసం, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ తనిఖీలు నిర్వహించగా.. తాజాగా మరో మంత్రిపై ఆదాయ పన్నుశాఖ దృష్టి సారించింది. బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు.. తెల్లవారుజాము నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు.

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు పక్కనే ఉన్న మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు.. మల్లారెడ్డి వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి నివాసంతో పాటు అదే ప్రాంతంలోని మంత్రి సోదరుడు గోపాల్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలోని మల్లారెడ్డి పెద్దకుమారుడు మహేందర్‌రెడ్డి నివాసంలో, కొంపల్లిలోని చిన్న కుమారుడు భద్రారెడ్డి నివాసంలో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు కండ్లకోయలోని సీఎంఆర్​ ఇంజినీరింగ్‌ కళాశాలలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రి, నారాయణ ఆస్పత్రి, మల్లారెడ్డి వైద్య కళాశాల, మల్లారెడ్డి డెంటల్‌ కాలేజ్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కుటుంబసభ్యులు, బంధువులతో పాటు మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థల డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఐటీ తనిఖీల్లో నగదు, కీలక పాత్రాలు స్వాధీనమయ్యాయి. ఐటీ సోదాల్లో దాదాపు 50 బృందాలు పాల్గొన్నారు.

తెల్లవారుజాము నుంచి గంటల తరబడిగా తనిఖీలు జరుపుతున్న ఆదాయ పన్నుశాఖ అధికారులు.. ఆయా చోట్ల దస్త్రాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. మంత్రి, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన ఆస్తులు, ఆదాయ వనరులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు, ఐటీ రిటర్న్స్‌ చెల్లింపుల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఐటీ సోదాల సందర్భంగా మంత్రి, ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల వద్ద సీఆర్​పీఎఫ్​ బలగాలతో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

క్రాంతి బ్యాంక్​ ఛైర్మన్​ ఇంట్లోనూ..: మరోవైపు హైదరాబాద్‌ బాలానగర్‌లోని క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కళాశాలతో సంబంధాలున్నాయన్న సమాచారంతో బ్యాంకు ఛైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల లావాదేవీలు గుర్తించారు.

ఇవీ చూడండి..

దిల్లీ మద్యం కేసు.. శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబులకు 14 రోజుల కస్టడీ

13 రోజులు.. 4వేల కిలోమీటర్లు.. చైనా బోర్డర్​కు సైకిల్ ​మీద వెళ్లిన మహిళ

Last Updated :Nov 22, 2022, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.