Vaikunta Ekadashi: ఉత్తర ద్వార దర్శనం.. భోగభాగ్యాల వేడుక

author img

By

Published : Jan 9, 2022, 2:41 PM IST

Vaikunta Ekadashi: ఉత్తర ద్వార దర్శనం.. భోగభాగ్యాల వేడుక

Vaikunta Ekadashi: ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశినాడు ఉత్తరద్వార దర్శనం చేసుకోవడం... ఆ తరువాత వచ్చే భోగి, సంక్రాంతి పండుగ రోజుల్ని అత్యంత వైభవంగా జరుపుకోవడం తెలిసిందే. కానీ ఈ పర్వదినాల వెనుక పురాణాలు ఏం చెబుతున్నాయంటే...

Vaikunta Ekadashi: వైకుంఠ ఏకాదశి... ఈ రోజున ఉపవాసం ఉండి, ఆలయాలకు వెళ్లి ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందనేది తెలిసిందే కానీ ఈ పర్వదినం వెనుక ఎంతో విశిష్టత దాగి ఉంది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ/ ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించే నారాయణుడు కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట. అలా మేల్కొనే స్వామిని ముక్కోటి దేవతలూ పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు దర్శించుకునేందుకు వైకుంఠానికి చేరుకుంటారట. ఆ తరువాత మహావిష్ణువు గరుడ వాహనంపైన మూడుకోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టే ఈ ధనుర్మాస ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. స్వామి ఉత్తరద్వారం ద్వారానే బయటకు వస్తాడు గనుక ఈ రోజున దేవాలయాల్లో ప్రత్యేకంగా ఉత్తరద్వారాన్ని తెరుస్తారు.

వైకుంఠ ఏకాదశికి ఘనంగా ఏర్పాట్లు

విష్ణు పురాణం ప్రకారం... ముర అనే రాక్షసుడు దేవతల్ని ఇబ్బంది పెట్టడంతో వాళ్లంతా తమని రక్షించమంటూ విష్ణుమూర్తిని వేడుకున్నారట. దాంతో స్వామి అతడిని అంతమొందిం చేందుకు సిద్ధమయ్యాడట. అది తెలిసిన అసురుడు సముద్రగర్భంలో దాక్కోవడంతో విష్ణుమూర్తి కూడా ఓ గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటించాడట. దాంతో ముర బయటకు వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మహాలక్ష్మి శక్తిరూపంలో వచ్చి అతడిని వధించిందట. స్వామి సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమన్నాడట. మురను సంహరించిన రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టమంటూ ఆ శక్తి వేడుకోవడంతో, స్వామి తథాస్తు అనడంతోపాటు వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుందని వరమిచ్చాడట. అప్పటినుంచీ వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడం మొదలుపెట్టారని అంటారు. మురాసురుడిని సంహరించే సమయంలో అతడు బియ్యంలో దాక్కోవడం వల్లే ఉపవాసం ఉండాలనే నియమం వచ్చిందనీ చెబుతారు. ఈ రోజున ఉపవాసం, ధ్యానం చేయడం వల్ల మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణుపురాణం చెబుతోంది.

ప్రకృతికి కృతజ్ఞతగా...

వైకుంఠ ఏకాదశి తరువాత వచ్చే పండుగే సంక్రాంతి. ఉత్తరాయణానికి ముందురోజు చలి విపరీతంగా పెరుగుతుందని అంటారు. దాన్ని తట్టుకునేందుకే భోగినాడు భోగిమంటలు వేస్తారు. ఈ రోజునే గోదాదేవి రంగనాథస్వామిలో లీనమై ఆధ్యాత్మిక భోగాన్ని పొందిందనీ.. ఇందుకు సంకేతంగానే భోగి పండుగ వచ్చిందనీ పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి నెట్టి ప్రతి ఏటా భోగి రోజున భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని చెప్పాడనే కథా ప్రాచుర్యంలో ఉంది. రైతుల శ్రేయస్సు కోసం పరమేశ్వరుడు తన వాహనమైన నందిని భూలోకానికి పంపించింది కూడా భోగిరోజునేనని చెబుతారు. భోగినాడు ఆవుపేడతో చేసిన పిడకలను కాల్చడం ఆనవాయితీ. ఈ రోజున చిన్నారులకు తలపైన రేగుపండ్లను పోసే సంప్రదాయం చాలా ప్రాంతాల్లో ఉంది. చెరుకుముక్కలూ రేగుపండ్లూ పూలరేకలూ చిల్లరా సెనగలూ కలిపి భోగిపండ్లు పోయడం వల్ల చిన్నారులమీద ఉన్న పీడ పోవడంతోపాటు నారాయణుడి ఆశీస్సులూ లభిస్తాయని చెబుతారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఇంటి ముందు అందమైన రంగవల్లికలు వేయడంతోపాటు పితృతర్పణాలు వదలడం, దానాలు చేయడం, దైవారాధన... వంటివన్నీ ఈ రోజున చేయాలని చెబుతున్నాయి శాస్త్రాలు.

ఇక... కనుమను పశువుల పండుగ అంటారు. ఆ రోజున రైతులు తమ పశువులను ముచ్చటగా అలంకరిస్తారు. అదేవిధంగా గోపూజను చేసేందుకూ ప్రాధాన్యం ఇస్తారు. దీనివల్ల పశు సంపద వృద్ధి చెందుతుందనీ పంటలు బాగా పండుతాయనీ నమ్ముతారు. ఈ పర్వదినాల్లో ధాన్యం, వస్త్రం, నువ్వులు, చెరకు వంటివి దానం ఇవ్వడం వల్ల సకల సంపదలూ కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే- కుటుంబసభ్యులు, దేవతలు, పశువులు... ఇలా సమస్త ప్రకృతి పట్లా, జీవరాశుల పట్లా కృతజ్ఞతనూ ప్రేమనూ చూపించే పండుగే సంక్రాంతి.

విగ్రహం బరువు పెరుగుతుంది!

కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు, ఎంత శోధించినా కారణాలు అంతుచిక్కవు. అలాంటివి మనదేశంలో చాలానే కనిపిస్తాయి. తమిళనాడు కుంభకోణంలోని తిరునరైయూరు క్షేత్రంలో ఉన్న నాచ్చియార్‌ కోవెలనే తీసుకుందాం... ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారూ కొలువైనప్పటికీ ఇది శ్రీవారి వాహనమైన గరుత్మంతుడి ఆలయంగానే ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడికొచ్చే భక్తులకు వరాలు ఆయనే అనుగ్రహిస్తాడట. అంతేగాక, ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుడి విగ్రహం ఊరేగింపు సమయంలో బరువు మారిపోతుంటుంది. స్వామివారు అంతః ప్రాకారంలో గరుడ వాహనం ఎక్కినప్పుడు అది తేలికగా ఉండి నలుగురు మనుషులు మోస్తే సరిపోతుంది. అయితే 5 ప్రాకారాలను దాటి సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి దాని బరువు ఇంతింతై వటుడింతై అన్న రీతిలో పెరుగుతుందట. అంటే- 2వ ప్రాకారాన్ని దాటుతున్నప్పుడు 8 మంది, 3వ ప్రాకారం దాటేటప్పుడు 16మంది, 4వ ప్రాకారాన్ని దాటేటప్పుడు 32 మంది, 5వ ప్రాకారాన్ని దాటేటప్పుడు 64 మంది మోయాల్సి వస్తుంది. 5 ప్రాకారాలూ దాటి వీధుల్లోకి వచ్చే సమయానికి గరుడవాహనం బరువు బాగా పెరిగిపోయి 128 మంది మోయాల్సి వస్తుంది. దాంతో ప్రధాన వీధుల్లోకి వచ్చేసరికి 16 మంది మోస్తున్న హంసవాహనం ముందు వెళుతూ ఉండగా దాని వెనకాల 128 మంది మోస్తున్న స్వామివారి గరుడవాహనం నిదానంగా కదులుతూ ఉంటుంది. మరో విచిత్రం ఏంటంటే- ఈ ఊరేగింపు సమయంలో గరుత్మంతుని ఉత్సవ విగ్రహానికి చెమటలు కనిపిస్తాయి. గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువు ఉండి, క్రమంగా పెరిగేసరికి చెమట పడుతుందనేది భక్తుల విశ్వాసం. ఈ బరువు ఇలా ఎలా పెరుగుతుందన్న విషయమై ఎన్నో సంవత్సరాలుగా పరిశోధిస్తున్నా అసలు విషయం మాత్రం ఈనాటికీ అంతుబట్టలేదట.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.