11 ఏళ్ల వయసులోనే అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న హైదరాబాద్ బాలిక - శాస్త్రవేత్తగా ఇస్రో, నాసాలో సేవలందించడమే లక్ష్యం

11 ఏళ్ల వయసులోనే అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న హైదరాబాద్ బాలిక - శాస్త్రవేత్తగా ఇస్రో, నాసాలో సేవలందించడమే లక్ష్యం
Hyderabad Girl Siddhiksha Planetary Fragments : ఏడో తరగతి ప్రాయంలో ఎవరైనా పాఠశాల, ట్యూషన్‌కు వెళ్లడం.. హోమ్ వర్క్‌లు చేయడం.. సమయం దొరికినప్పుడు ఆటలాడటం సహజం. ఈ బాలిక అందుకు భిన్నం. 11 ఏళ్ల వయసులోనే ఖగోళ శాస్త్ర పరిశోధనలు చేస్తూ గ్రహశకలాల జాడ పసిగడుతోంది. అంతేనా 5 ఏళ్ల నాటి నుంచే భారతీయ శాస్త్రీయ కళల్లోనూ రాణిస్తూ పతకాలు సొంతం చేసుకుంటోంది. దీనికితోడు భవిష్యత్‌లో శాస్త్రవేత్తగా ఇస్రో, నాసాలో సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మరి ఆ బాలిక ఎవరు..? 11 ఏళ్ల వయసులోనే ఖగోళశాస్త్ర పరిశోధన తనకెలా సాధ్యమైంది?
Hyderabad Girl Siddhiksha Planetary Fragments : ఈ అమ్మాయి వయసు 11 ఏళ్లు. కానీ, తన పరిశోధనంతా అంతరిక్షంపైనే. చిన్న వయసులోనే గ్రహశకలాల ఉనికి పసిగడుతున్న ఆ చిన్నారి.. పిట్ట కొంచెం కూత ఘనం అనేలా సాధన చేస్తోంది. సోదరి స్ఫూర్తితో ఖగోళశాస్త్ర పరిశోధనలు చేస్తూ.. ఎన్నో విజయాలు అందుకుం టోంది. గతంలో సోదరితో కలిసి గ్రహశకలం కనుగొని నాసా ధృవపత్రం అందుకోగా..తాజాగా మరో గ్రహశకల ఉనికిని పసిగట్టి ఔరా అనిపిస్తోంది.
చిన్న వయస్సులో ఖగోళ శాస్త్రంపై పరిశోధనలు చేస్తున్న బాలిక పేరు పాళ్లెం సిద్ధిక్ష. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన బాలిక తల్లి డాక్టర్ చైతన్య విజయ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపల్‌గా.. తండ్రి విజయ్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తున్నారు. వీరిద్దరు కుమార్తెలు ఖగోళశాస్త్రంపై పరిశోధనలు చేస్తూ గ్రహశకలాల జాడ చెబుతూ నాసా, ఇస్రోల ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.
చిన్నకుమార్తె సిద్ధిక్ష.. అక్క శ్రీయ2018లో నాసా ఆధ్వర్యంలో జరిగిన "సైంటిస్ట్ ఫర్ డే" పోటీల్లో ప్రశంసాపత్రం అందుకున్నారు. నాటికి ఆరేళ్ల వయసున్న సిద్ధిక్ష అక్క నుంచి స్ఫూర్తి పొంది ఖగోళశాస్త్రంపై మక్కువ పెంచుకుంది. తల్లి గైడెన్స్‌లో ఖగోళ, అంతరిక్ష అంశాలపై దిల్లీల్లోని స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సమీర్ సచ్‌దేవా వద్ద శిక్షణ పొందింది. 2020లో నాసా "ఇంటర్నేషనల్ అబ్జర్వ్ ది మూన్ నైట్" పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరించింది. Spot
Siddhiksha From Hyderabad : 2021లో సిద్ధిక్ష అక్కతో కలిసి IASC ఆధ్వర్యంలో జరిగిన ఆస్టెరాయిడ్ సెర్చ్ కాంపెయిన్‌లో 2021 GC103 గ్రహశకలాన్ని కనుగొని నాసా ధ్రువపత్రం సాధించింది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ ల్లో జరిగిన ఆస్టెరాయిడ్ సెర్చ్‌క్యాంపెన్‌లోనూ పాన్ స్టార్స్ టెలిస్కోప్ ఫోటోల్ని విశ్లేషించి అంగారక , బృహస్పతి గ్రహాల మధ్య మెయిన్ బెల్డ్ ఆస్టెరాయిడ్‌లో ఓ గ్రహశకలాన్ని కనుగొంది సిద్ధిక్ష. దానికి 2022ఎస్‌డీ66 గా పేరు పెట్టారు. ఈ అక్టోబర్ 30న పారిస్‌లోని జరిగిన అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ యూనియన్, నాసా వరల్డ్ మైనర్ బాడీ కాటలాగ్‌లోనూ సిద్ధిక్ష భాగమైంది.
సిద్ధిక్ష, శ్రీయలకు నాసాలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్న స్వాతిమోహన్ బంధువు. 2010లో ఆమె మార్స్ మిషన్‌కు నేతృత్వం వహించారు. అంగారకగ్రహంపై రోవర్ విజయవంతంగా ల్యాండింగ్ సమయంలో తన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. స్వాతిమోహన్ గురించి తరచూ ఇంట్లో మాట్లాడుతుండంతో అక్కాచెళ్లెళ్లిద్దరూ తెలియకుండా ఆ దిశగా స్ఫూర్తి పొందారు. నాటి నుంచి ఖగోళశాస్త్రం గురించి ఆరంభించినట్లు చెబుతున్నారు.
ఖగోళశాస్త్ర పరిశోధనల్లో గ్రహశకల ఉనికి పసిగడుతున్న సిద్ధిక్ష కృషి గుర్తించి టెక్సాస్ హార్డీన్-సిమన్స్ విశ్వవిద్యాలయంతోపాటు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికాల్ సెర్చ్ కొలాబరేషన్-ఏఐఎస్‌సీ ధృవపత్రం అందజేసింది. విశ్వంలోని అనేక ఖగోళ వస్తువులు, పదార్థాల ఉత్పత్తి, శకలాలు, ఉనికి, లక్షణాలు, నాశనం శాస్త్రబద్ధంగా వివరిస్తుంది సిద్ధిక్ష.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఖగోళశాస్త్రంలో రాణిస్తున్న సిద్ధిక్ష.. దీంతోపాటు భారతీయ నృత్య రూపం కూచిపూడి, సంగీతం నేర్చుకుంది. దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో 40కిపైగా నృత్య ప్రదర్శనలిచ్చి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. భవిష్యత్‌లోనూ అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదిగి నాసా, ఇస్రో సంస్థల్లో సేవలందించడమే లక్ష్యం అంటోంది సిద్ధిక్ష.
సాధించాలనే ఆసక్తి ఉంటే వయసులో సంబంధం లేకుండా ఎందులోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది 11ఏళ్ల సిద్ధిక్ష. చిన్నవయసులోనే పెద్ద లక్ష్యం ఏర్పరచుకొని ముందడుగేస్తూ.. తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
