నిండుకుండను తలపిస్తున్న.. హైదరాబాద్ జంట జలాశయాలు

author img

By

Published : Aug 31, 2021, 10:33 AM IST

Updated : Aug 31, 2021, 12:33 PM IST

flood-water

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కారణంగా... హైదరాబాద్​లోని జంట రిజర్వాయర్లయిన హిమాయత్​సాగర్​, ఉస్మాన్​ సాగర్​లోకి భారీగా వరద నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు హిమాయత్ సాగర్​ జలాశయం గేట్లు ఎత్తారు.

హైదరాబాద్​ జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో హిమాయత్ సాగర్​ జలాశయం నిండుకుండలా మారంది. హిమాయత్​ సాగర్​లోకి 1,200 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. హిమాయత్ సాగర్​ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా... ప్రస్తుతం పూర్తి స్థాయి నీటిమట్టానికి ప్రవాహం చేరింది.

హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల

నీటిమట్టం పూర్తిగా నిండడంతో జలమండలి అధికారులు... జలాశయం 2 గేట్లు ఎత్తారు. ఒక్కో గేటు అడుగు మేర ఎత్తి మూసీలోకి నీటిని వదలుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పోలీస్, రెవెన్యూ, జీహెచ్​ఎంసీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉస్మాన్‌సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1788.15 అడుగులు నీరుంది. ప్రస్తుతం ఉస్మాన్​సాగర్​లోకి 2,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

రాష్ట్రంలో నేడూ భారీ వర్ష సూచన ఉందన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గతనెలలో కూడా భారీవర్షాలకు హైదరాబాద్ జంట జలశయాలకు భారీగా వరద వచ్చింది. దీంతో ఉస్మాన్​సాగర్​ 2 గేట్ల ద్వారా 100 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడిచిపెట్టారు. మొత్తం మీద జంట జలాశయాలు జలకళతో చూపరులను అలరిస్తున్నాయి. జలాశయాల అందాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు తరలివస్తున్నారు.

ఇదీ చూడండి: RTC Bus Wrecked: చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు

Last Updated :Aug 31, 2021, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.