GST Ammendments: ప్రభుత్వానికి ఆదాయం పెంచనున్న జీఎస్టీ సవరణలు

author img

By

Published : Jan 29, 2022, 3:23 AM IST

GST Ammendments: ప్రభుత్వానికి ఆదాయం పెంచనున్న జీఎస్టీ సవరణలు

GST Ammendments: జీఎస్టీ అమలులో కొత్తగా తెచ్చిన సవరణలు వ్యాపారుల అడ్డదారులకు కళ్లెం వేయనున్నాయి. నెల నుంచి అమలులోకి వచ్చిన ఈ సవరణలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుసేవల పన్ను ఆదాయం భారీగా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వానికి ఆదాయం పెంచనున్న జీఎస్టీ సవరణలు

GST Ammendments: దేశవ్యాప్తంగా 2017 జులై నుంచి ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో జీఎస్టీని తీసుకొచ్చింది. వ్యాపారుల క్రయవిక్రయాలు, సేవలు తదితరాలకు సంబంధించి జీఎస్టీఎన్​ పోర్టల్‌ను రూపొందించారు. ఈ విధానంలోని లోపాలు కొందరు వ్యాపారులకు కాసుల వర్షం కురిపించేవిగా మారాయి. రిటర్న్‌లు దాఖలు చేసేందుకు కల్పించిన వెసులుబాట్లను ఆధారం చేసుకుని అడ్డదారులు వెతుక్కున్నారు. తికమకగా రిటర్న్‌ దాఖలు చేయడం, బోగస్‌ సంస్థలు సృష్టించి పన్ను ఎగవేతకు తెరలేపారు. అధికారులకు వ్యాపారులపై అజమాయిషీ లేకపోవడంతో కాగితాలపైనే వ్యాపార లావాదేవీలను చూపి పెద్దఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ వచ్చారు. జీఎస్టీ అధికారులు పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. వ్యాపారుల అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర స్థాయిలో అధ్యయనం చేసి కేంద్రం సవరణలు తీసుకొచ్చింది.

వ్యాపారుల అడ్డదారులకు కళ్లెం

కొత్తగా తీసుకొచ్చిన సవరణల్లో వ్యాపార లావాదేవీల రిటర్న్‌ల దాఖలులో మార్పులు తెచ్చింది. గతనెల అమ్మకాల వివరాలను ఇన్‌వాయిస్‌లతో సహా ప్రస్తుత నెల 10 తేదీ లోపు జీఎస్టీఆర్​-1 పేరుతో రిటర్న్‌ దాఖలు చేయాలని నిబంధన విధించారు. అదేవిధంగా 5 కోట్లకు మించి టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు 20 తేదీన, అంతకు తక్కువ ఉన్నవారు 22న జీఎస్టీఆర్​-3బీ రిటర్న్‌లు దాఖలు చేయడంతోపాటు పన్ను చెల్లింపులను తప్పనిసరి చేశారు. ఎవరైనా 3బీ రిటర్న్‌లు వేయకుంటే మరుసటి నెలలో జీఎస్టీఆర్​-1 దాఖలు చేసే వీలు లేకుండా చేశారు. ఎవరైనా జీఎస్టీఆర్​-1లో వ్యాపారం భారీగా జరిగినట్లు చూపి 3బి రిటర్న్‌లో తక్కువ చూపుతూ పన్ను ఎగవేతకు పాల్పడితే సంబంధిత వ్యాపార సంస్థలపై సోదాలు చేసి పన్ను వసూలు చేసే అధికారం జీఎస్టీ అధికారులకు కల్పించారు. దీంతో రిటర్న్‌లు కచ్చితంగా వేయాల్సి రావడంతోపాటు పన్ను చెల్లింపులు కూడా పెరగనున్నాయి. నకిలీ సంస్థలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేయకుండా ఐటీసీ తీసుకునేందుకూ అవకాశం లేకుండా పోయింది.

పెరగనున్న ఆదాయం

కొత్త సవరణలతో కేంద్ర, రాష్ట్రాలకు వచ్చే జీఎస్టీ ఆదాయం 15 నుంచి 20శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా జీఎస్టీ ద్వారా 25వేల కోట్లకు పైగా ఆదాయం వస్తున్న తెలంగాణలో. దాదాపు నాలుగువేలకోట్లు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.