రేసింగ్‌ కార్లతో దద్దరిల్లిన సాగర్‌ తీరం.. పోటీలను వీక్షించిన మంత్రి కేటీఆర్‌

author img

By

Published : Nov 19, 2022, 4:10 PM IST

Updated : Nov 19, 2022, 10:15 PM IST

Formula E racing in Hyderabad

హైదరాబాద్ వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ నగరంలో అట్టహసంగా ప్రారంభమైంది. మొదటి రోజు మొత్తం సాధన కోసమే నిర్వహించిట్లు తెలిపారు. నేడు క్వాలిఫైయింగ్ 1, 2 లను నిర్వహించి.. రేస్ 1 స్పిన్ట్​ను నిర్వహించాల్సి ఉంది. కానీ ట్రాక్ పరిక్షించేదుకు, రేసర్లకు అవగాహన కోసం మొదటి రోజు కేవలం ట్రయల్స్ మాత్రమే నిర్వహించారు. రేపు ప్రధాన ఈవెంట్లను నిర్వహించనట్లు ఆర్‌ఆర్‌పీఎల్ డైరెక్టర్ తెలిపారు.

రేసింగ్‌ కార్లతో దద్దరిల్లిన సాగర్‌ తీరం.. పోటీలను వీక్షించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ హుస్సేన్​సాగర్ తీరంలో రయ్ రయ్ అంటూ రేసింగ్ కార్ల శబ్దాలు సందడి చేశాయి. మధ్యహ్నం రెండు గంటల నుంచే పోటీలో ఉన్న ఆరు జట్ల రేసర్లు ట్రాక్​పై చక్కర్లు కొట్టారు. రేస్​ను చూసేందుకు ప్రేక్షకులు ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకుని రాగా.. ట్రాక్ చూట్టూ సాధారణ ప్రజలు అధిక సంఖ్యలో రేసింగ్​ను వీక్షించారు. నేడు క్వాలిఫైయింగ్ 1, 2 లను ప్రధాన రేస్​లను నిర్వహించాల్సి ఉండగా.. ట్రాక్ పై అవగాహన దృష్ట్యా ట్రయల్స్ మాత్రమే నిర్వహించారు.

రేపు వీటితో పాటు రేస్2, రేస్ 3 జరగనున్నాయి. ఈ రేసింగ్‌లో 12 కార్లు, 6 బృందాలు, నలుగురు డ్రైవర్లు, మహిళా రేసర్లు పాల్గొన్నారు. 50శాతం దేశంలోని రేసర్లు, మరో 50శాతం విదేశీ రేసర్లు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో పాల్గొన్నారు. పెట్రోల్‌ కార్లు 240కి.మీ స్పీడ్‌తో వెళ్లాయని, ఎలక్ట్రిక్‌ కార్లయితే గరిష్ఠ వేగం 320 కి.మీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ రేసులో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గోవా, దిల్లీ, కొచ్చి బృందాలు పాల్గొన్నాయి. ఈ రేసింగ్‌లో మొత్తం 18 మూలమలుపులు ఉన్నాయి. ప్రతి మూలమలుపు వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందించడానికి, ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు.

పది గంటలకే ఈవెంట్ మొదలవుతుంది: ఇండియన్ రేసింగ్ లీగ్ మొత్తం రేపే నిర్వహిస్తామని.. క్వాలిఫయింగ్ రేస్ కూడా రేపే ఉంటుందని ఆర్‌ఆర్‌పీఎల్ డైరెక్టర్ అఖిలేశ్​ తెలిపారు. ప్రేక్షకులు రేపు ఉదయం 8 గంటల వరకు చేరుకోవాలని సూచించారు. పది గంటలకే ఈవెంట్ మొదలవుతుందని వెల్లడించారు. భారీ కేడ్లు సరిగా ఏర్పాటు చేయకపోవడంతో రేసు ప్రాక్టీస్ కిందే నిర్వహించామన్నారు. టికెట్స్ బుక్ చేసుకున్న వారి ఎంట్రీ ఇష్యూ అయిందని.. ఈరోజు జరిగిన చిన్న తప్పులు రేపు జరగకుండా చూస్తామని పేర్కొన్నారు.

రేసింగ్​ను పరిశీలించిన కేటీఆర్: ఇలాంటి ఈవెంట్ హైదరాబాద్​లో నిర్వహంచడం చాలా పెద్ద విషయమని.. డ్రైవర్ సేఫ్టీకి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చారని రేసర్ అనిందిత్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాక్ కాబట్టి అర్ధం చేసుకోవడానికి టైమ్ పడుతుందని చెప్పారు. ఈ ట్రాక్​పై గరిష్ఠంగా గంటకు 240 కిలోమీటర్ల వేగం వరకు ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం ఐమ్యాక్స్ వద్ద రేసింగ్​ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఒక ట్రయల్ రేస్​ను జెండా ఊపి ప్రారంభించారు. రేసర్లతో ఆయన ముచ్చటించారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్​ను మరింత పెంచుతుంది: నిర్వాహకులతో మాట్లాడిన కేటీఆర్ ఏర్పాట్లపై ఆరా తీశారు. కేటీఆర్ కుమారడు హిమన్షు, కుమర్తె కూడా రేసింగ్ వీక్షించేందుకు వచ్చారు. సినీ నటుడు నిఖిల్ సిద్దార్ధ్ కూడా ఐమ్యాక్స్ వద్ద రేసింగ్​ను వీక్షించారు. ఇలాంటి ఈవెంట్ హైదరాబాద్ లో జరగటం చాలా మంచి పరిణామమని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్​ను మరింత పెంచుతుందని నిఖిల్ సిద్దార్ధ్ తెలపారు.

తరలి వచ్చిన అభిమానులు: మరో వైపు నగరంలో ఇలాంటి ఒక ఈవెంట్ జరగడంతో ప్రేక్షకులతో పాటు నగరవాసులు నెక్లెస్​రోడ్​కు తరలివచ్చారు. తెలుగుతల్లి పై వంతెన పైకి ఎక్కి రేసింగ్​ను వీక్షించారు. రేసింగ్ కార్ల శబ్దాలు హైదరాబాద్​లో వింటుంటే చాలా ఉత్సాహంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. టికెట్లు బుక్ చేసుకుని రేసింగ్ వీక్షించే వారు.. వారికి కేటాయించిన గేటు వద్దకు చేరుకునేందుకు కొంత గందరగోళం నెలకొంది. వారి కోసం ఏర్పాటు చేసిన షటిల్ సర్వీసులు సరిగా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్వాహకులు మాత్రం రేపు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని తెలిపారు.

నెక్లెస్‌రోడ్‌లో సోమవారం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు: ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ సందర్భంగా నెక్లెస్‌ రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్‌లో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్‌ నుంచి ఐమ్యాక్స్‌, ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్ మీదుగా ఈ ట్రాక్ తిరిగి ఐమ్యాక్స్ దగ్గర ఉన్న గ్యారేజీకి చేరుకుంటుంది. ఖైరతాబాద్ కూడలి నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. ఈ రూట్‌ నుంచి వచ్చే వాహనాలను పీజేఆర్ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు మళ్లించారు.

అలాగే బుద్ధ భవన్.. నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్, ట్యాంక్‌ బండ్ వైపు మళ్లించారు. రసూల్‌ పురా, మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు. బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ – రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. సోమవారం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

ఇవీ చదవండి: రాష్ట్రంలో పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య .. ఎనిమిదేళ్లలో ఎంతమంది వచ్చారంటే?

'జైలులో మంత్రికి మసాజ్'పై భాజపా ఫైర్.. ఫిజియోథెరపీలో భాగమేనన్న ఆప్

Last Updated :Nov 19, 2022, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.