సికింద్రాబాద్ ఘటన.. దక్కన్ మాల్ భవనంలో అడుగడుగునా అపాయమే
Updated on: Jan 21, 2023, 9:27 AM IST

సికింద్రాబాద్ ఘటన.. దక్కన్ మాల్ భవనంలో అడుగడుగునా అపాయమే
Updated on: Jan 21, 2023, 9:27 AM IST
Secunderabad fire accident update: భారీ అగ్నిప్రమాదానికి కారణమైన భవనం కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే భవనాన్ని పరిశీలించిన నిపుణులు మునుపటిలా ఉపయోగపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కాగా ఘటనపై అగ్నిమాపకశాఖ అందజేసిన నివేదికలో విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి
Secunderabad fire accident update : రాష్ట్ర రాజధానిలో అలజడిరేపిన సికింద్రాబాద్ నల్లగుట్టలోని దక్కన్ స్పోర్ట్స్ నైట్‌వేర్ మాల్ భవనం మంటల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నది. ఎన్ఐటీ వరంగల్ సంచాలకులు రమణారావు జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, క్లూస్ టీం, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి భవనాన్ని పరిశీలించారు. వెళ్లటానికి వీలులేని చోటుకు డ్రోన్‌ను పంపి నలుమూలలా తనిఖీలు జరిపి, నాణ్యతను పరీక్షించారు. అన్ని అంతస్తుల స్లాబులు, గోడలు దెబ్బతిన్నట్లు గుర్తించిన నిపుణులు ఏ సమయంలోనైనా పడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. భవనం మునుపటిలా ఉపయోగపడే అవకాశం లేదని వెల్లడించారు.
Fire building ready to demolish: నిపుణుల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనాస్థలానికి పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులను ఖాళీ చేయిస్తున్నారు. భవనం దానంతటదే పడిపోక ముందే కూల్చివేయటం మేలని నిర్ణయించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాలకు రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు.
Fire department report on Secunderabad accident : మరోవైపు ప్రమాద ఘటనపై అగ్నిమాపకశాఖ అందజేసిన ప్రాథమిక నివేదిక వ్యాపార సముదాయంలో యాజమాన్యం నిర్లక్ష్యధోరణికి అద్దం పడుతోంది. మాల్‌లో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. భవనానికి రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదంతస్తులు ఉన్నప్పటికీ సరైన నిర్వహణ సామర్థ్యం లేకపోవటంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు వెల్లడించారు.
మంటలు వ్యాపించినట్లు 11గంటలకు సమాచారం అందగా కేవలం 3నిమిషాల్లోనే ఘటనాస్థలికి వాటర్ కమ్ ఫోమ్ టెండర్ చేరుకుందని మరో 23 వాహనాలను వినియోగించినా 8 గంటల తర్వాత గానీ మంటలు అదుపులోకి రాలేదని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. భవనంలోని అంతస్తులకు 2మెట్ల మార్గాలు ఉండాల్సి ఉండగా ఒకటి మాత్రమే ఉందని సెట్ బ్యాక్ లేనందున అగ్నిమాపక యంత్రాలు తిరిగేందుకు ప్రతిబంధకంగా మారినట్లు తెలిపారు.
భవనం లోపలి వైపు సరైన వెలుతురు లేకపోవటంతో సహాయక సిబ్బంది భవనంలోకి ప్రవేశించటం కష్టంగా మారినట్లు వివరించారు. అత్యవసర వెలుతురు, పొగ నిర్వహణ సదుపాయం లేకపోవటంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా బేస్‌మెంట్‌ను సైతం వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు తమ నివేదికలో వెల్లడించారు.
ఇవీ చదవండి:
