Heavy Rains In Telangana : మళ్లీ విరుచుకుపడిన అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం
Published: May 21, 2023, 6:45 AM


Heavy Rains In Telangana : మళ్లీ విరుచుకుపడిన అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం
Published: May 21, 2023, 6:45 AM
Heavy Rains In Telangana : రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతను వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతోనే నష్టాలను మూటగట్టుకున్న రైతులు కాస్త కోలుకుంటున్న తరుణంలో మళ్లీ అకాల వర్షం విరుచుకుపడింది. పలు జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా.. పలువురుకి గాయాలయ్యాయి. వరంగల్ జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలుల తీవ్రతకు పలుచోట్ల 150కి పైగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకూలాయి.
Heavy Rains In Telangana : అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి, వెల్గటూరు, బుగ్గారం మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసి నేరెళ్ల, సిరికొండ, మద్దునూర్‌లో ధాన్యం తడిసింది. కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. జగదేవ్పేటలో పిడుగు పడి రాజయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. సిరికొండలో పిడుగు పాటుకు రెండు మేకలు మృతి చెందగా.. కాపరి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ప్రధానంగా నగరంలో ఒక్కసారిగా వీచిన గాలి దుమారానికి పలు కాలనీల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రహదారులపై చెట్లు పడిపోవడంతో మహానగర పాలక సంస్థ విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగి చెట్లను తొలగించింది. ఒక్కసారిగా వీచిన గాలి దుమారానికి గ్రేటర్ పరిధిలో 100కు పైగా ఇళ్ల పైకప్పులు దెబ్బ తిన్నాయి. చింతల్, కాశిబుగ్గ, అబ్బని కుంట, ఖిలా వరంగల్ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇంటి పైకప్పులు గాలి దుమారానికి ఎగిరిపోయాయి.
పిడుగు పడి రైతు మృతి: మేయర్ గుండు సుధారాణి.. దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఆరబోసిన వరి ధాన్యం తడవకుండా పరదాలు కప్పి ఎస్సై సురేశ్ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. బొజ్జానాయక్ తండాలో పొలం వద్ద కోసిన ధాన్యాన్ని.. బస్తాల్లో నింపే క్రమంలో పిడుగు పాటుకు బానోతు సుమన్ అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. అస్వస్థతకు గురైన మరో ముగ్గురిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
రాములు నాయక్ తండా వద్ద పొలం పనులకు వెళ్లిన.. లింగయ్య పిడుగుపాటుతో అస్వస్థతకు గురయ్యాడు. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్లో సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మడానికి సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది. పరకాల వ్యవసాయ మార్కెట్లో వరద ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. తడిసిన పంటను ప్రభుత్వమే కొనాలంటూ.. రైతులు వేడుకుంటున్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట, ములుగు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.
Crop loss To Heavy Rains In Telangana : వెంకటాపూర్ మండల కేంద్రం నుంచి రామప్పకు వెళ్లే రహదారి వెంబడి ఇరువైపులా ఉన్న చెట్లు అక్కడక్కడ విరిగిపోయాయి. గోవిందరావుపేట మండలంలో గాలుల బీభత్వానికి.. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ములుగు మండలంలో వడగళ్ల వాన కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడింది. జిల్లాలోని పలు గ్రామాల్లోనూ వడగళ్ల వర్షం కురిసింది.
ఇవీ చదవండి:
