బండ్లగూడ, పోచారంలో ఫ్లాట్లకు టోకెన్‌ అడ్వాన్స్‌ గడువు పొడిగింపు

author img

By

Published : Jan 18, 2023, 8:59 PM IST

Rajiv Swagruha Flats

హైదరాబాద్‌ నగరంలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లించేందుకు గడువును పొడిగింది. ఫిబ్రవరి 12 వరకు పొడిగిస్తున్నట్టు హెచ్‌ఎండీఏ ప్రకటించింది.

హైదరాబాద్‌ నగరంలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను ఇటీవల హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటి) వేలం ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. అయితే, వివిధ కారణాల వల్ల ఇందులో కొన్ని ఫ్లాట్లు అమ్ముడు పోలేదు. దీంతో మిగిలిన ఫ్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ మరోసారి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు తెలిపింది.

టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లింపులకు సిద్ధంగా ఉన్నవారికి లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయింపు చేయనున్నట్లు తెలిపింది. ఫ్లాట్లకు టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లించేందుకు జనవరి 18 వరకు గడువు విధించింది. అయితే, వరుస సెలవుల దృష్ట్యా టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లించేందుకు గడువును ఫిబ్రవరి 12 వరకు పొడిగిస్తున్నట్టు హెచ్‌ఎండీఏ తెలిపింది. www.hmda.in, www.swagruha.telangana.gov.in వెబ్‌సైట్లలో ఫ్లాట్లు, ఇతర వివరాలు చూడొచ్చని పేర్కొంది.

హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించిన స్లాబుల ప్రకారం వేలంలో 1 బెడ్ రూమ్, హాల్, కిచెన్ కలిగిన ఫ్లాట్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఒక లక్ష.. అలాగే రెండు బెడ్ రూమ్స్, హాల్ విత్ కిచెన్ కలిగిన ఫ్లాట్లను సొంతం చేసుకోవాలనుకునే వారు 2 లక్షలు రూపాయలు టొకెన్ అడ్వాన్స్ కింద చెల్లించాల్సి ఉంటంది. 3 బెడ్ రూమ్స్ ఫ్లాట్లకు పోటీపడే వారు 3 లక్షల రూపాయల టొకెన్ అడ్వాన్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. టోకెన్ అడ్వాన్స్ చెల్లించి వేలం బిడ్డింగ్‌లో పాల్గొన్న వారికి ఎప్పటిలాగే లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను కేటాయించనున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు స్పష్టంచేశారు

ఇక హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్వహించిన ల్యాండ్ పార్సల్ ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియకు ఆదరణ లభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లా పరిధిలోని 9 ల్యాండ్ పార్సెల్‌ను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించారు. ఈ విక్రయాల ద్వారా 195.24 కోట్ల ఆదాయం వచ్చినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.

స్థిరాస్తి వ్యాపారస్తులు ల్యాండ్ పార్సెల్ కొనుగోలుకు ఆసక్తి కనబరచడంతో అత్యధికంగా గజం లక్షా 11 వేల రూపాయలు ధర పలికింది. రెండో దశ ల్యాండ్ పార్సిల్స్ అమ్మకాలకు మరో మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.