Telangana government school: చాలాచోట్ల పేరుకే ఇంగ్లీషు మీడియం.. ప్రత్యేక ఉపాధ్యాయులు కరవు!

author img

By

Published : Jan 18, 2022, 9:44 AM IST

Updated : Jan 18, 2022, 1:27 PM IST

Telangana government school, english medium school

Telangana government school: రాష్ట్రంలోని ఎనిమిది వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో బోధన కొనసాగుతోంది. అయితే చాలాచోట్ల పేరుకే ఆంగ్లమాధ్యమం అని.. ప్రత్యేక ఉపాధ్యాయులే లేరని విమర్శలు వస్తున్నాయి. కొత్త చట్టం వస్తే రూల్స్ మారుతాయా? టీఆర్​టీలోనూ కొన్ని మార్పులు ఉంటాయా..? విశ్లేషకులు ఏమంటున్నారు?

Telangana government school: రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది వేల ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమ బోధన కొనసాగుతోంది. అయినా చాలా పాఠశాలల్లో పేరుకే ఇంగ్లీషు మీడియం అన్నట్లుగా పరిస్థితి ఉందనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2022-23) నుంచి సర్కార్ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 26 వేల సాధారణ ప్రభుత్వ బడులున్నాయి. వందల ఉన్నత పాఠశాలల్లో సక్సెస్‌ స్కూళ్ల పేరిట ఉమ్మడి రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం సెక్షన్లు ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత 2016లో ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమ బోధనకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా ఇప్పటి వరకు 8 వేల వరకు బడుల్లో ఆంగ్ల మాధ్యమం బోధన సాగుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అందులో 4 వేల ప్రాథమిక పాఠశాలలు కాగా మిగిలినవి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు.

చట్టం వస్తే?

ఇప్పటివరకు విద్యాకమిటీలు అడిగిన చోట...ఆంగ్ల మాధ్యమం బోధిస్తామని ఉపాధ్యాయులు అంగీకరించిన స్కూళ్లలో ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఆ తర్వాత ఉపాధ్యాయులు బదిలీ అయినప్పుడు మళ్లీ వారిని ఆంగ్ల మాధ్యమం ఉన్న పాఠశాలలకు పంపలేదు. దాంతో పేరుకే ఆంగ్ల మాధ్యమం ఉన్నట్లు చాలా చోట్ల పరిస్థితి మారింది. చట్టం అమలు చేస్తే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు(టీఆర్‌టీ) ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాసి...నెగ్గిన వారే బోధించాలని నిబంధన పెట్టే అవకాశం ఉంది. టీఆర్‌టీలో ఆంగ్ల కమ్యూనికేషన్‌ నైపుణ్యాన్ని కూడా పరీక్షించేలా వ్యాసరూప ప్రశ్నలు కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఉన్న వారిని తెలుగు? ఆంగ్ల మాధ్యమం? ఏదో ఒకటి ఎంచుకునేలా చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఆంగ్ల మాధ్యమం? తెలుగు మాధ్యమం? బడులని ప్రత్యేకంగా లేవు. కొత్త చట్టం తర్వాత ఆ విషయాన్ని స్పష్టంచేయాల్సి ఉంటుంది.

సమర్ధంగా అమలు చేస్తేనే..

ఆంగ్ల మాధ్యమాన్ని సమర్ధంగా అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(టీపీఏ) పేర్కొంది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగు మాధ్యమాన్ని యథావిధిగా కొనసాగించాలని విద్యా వాలంటీర్ల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు శివానందమూర్తి ఒక ప్రకటనలో కోరారు. ఆంగ్ల మాధ్యమం కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించాలని ఆయన సూచించారు.

అడిగితే తెలుగు ఉండాల్సిందే

కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగిస్తామంటే న్యాయపరంగా చిక్కులు తప్పవని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఉదాహరణకు ఏపీలో తప్పనిసరి ఆంగ్ల మాధ్యమం అమలును హైకోర్టు కొట్టివేసింది. తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదవాలన్నది తల్లిదండ్రుల ఐచ్ఛికమని, వారు కోరుకుంటే అక్కడ మాతృభాషలో చదువుకు అవకాశం ఇవ్వాల్సిందేనని తీర్పునిచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది. మరో వైపు ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని, వీలైతే 8వ తరగతి వరకు ఉంటే మంచిదని జాతీయ నూతన విద్యా విధానం పేర్కొంది. ఇంకా గత ఆగస్టులో 50 మంది లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ సెక్షన్లు రద్దు చేస్తామని ప్రభుత్వం జీవో 25 జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో కొత్త చట్టంలో ఏమి నిబంధనలుంటాయో వేచిచూడాలి.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 3 డీఏలకు ఆమోదం

Last Updated :Jan 18, 2022, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.