తెలంగాణలో దర్యాప్తు సంస్థల హల్​చల్.. ఎవరి లక్ష్యం వారిదే..!

author img

By

Published : Nov 23, 2022, 8:58 AM IST

BJP and TRS are targeting each othe

Investigating agencies are hitting Telangana : రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల దాడులు రాజకీయ కాక రేపుతున్నాయి. రాష్ట్రం, కేంద్రానికి చెందిన దర్యాప్తు సంస్థల సోదాలు ఎవరిపై ఎప్పుడు జరుగుతాయోననే ఉత్కంఠ నెలకొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ శాఖలు రాష్ట్ర మంత్రులపై గురిపెట్టగా.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ ముఖ్య నాయకులపై సిట్‌ దృష్టి సారించింది. ఇలా ఎవరి లక్ష్యం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. తర్వాత ఎవరి వంతు వస్తుంది? ఏ విషయం తెరపైకి వస్తుందనే విషయం ఆసక్తి రేపుతోంది.

రాష్ట్రంలో సోదాల సమరం

Investigating agencies are hitting Telangana : రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఇంకోవైపు దిల్లీ మద్యం కేసు, మధ్యలో ఈడీ, ఐటీ శాఖల దాడులు, విచారణలతో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న వాతావరణం నెలకొంది. ఒక మంత్రిపై గ్రానైట్‌ వ్యవహారంలో ఈడీ విచారణ జరపగా, అది ముగియకముందే మరో మంత్రి లక్ష్యంగా పెద్దఎత్తున ఆదాయపన్నుశాఖ దాడులతో ప్రాధాన్యం సంతరించుకుంది. మరో మంత్రి కుటుంబ సభ్యులను, వ్యక్తిగత సహాయకుడిని కూడా ఈడీ విచారించింది. మరికొందరిపైనా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని కొంతమంది నేతలు బహిరంగంగానే అంటున్నారు. సీబీఐ అడుగుపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం కావడంతో అది నేరుగా కేసులు నమోదు చేయలేకపోతోందని, లేకుంటే ఆ సంస్థ కూడా రాష్ట్రంలో చురుగ్గా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఏకపక్షంగా దాడులు చేయగలిగిన కేంద్ర దర్యాప్తు సంస్థలు.. తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు కేంద్ర ప్రభుత్వం: దిల్లీ మద్యం విధానం తయారీలో భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలతో ఈడీ మొదట రాష్ట్రంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో టీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత పేరును భాజపా నాయకులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. నెల రోజులకు పైగా ఈ ప్రచారం జరుగుతున్నా ఈడీ అక్కడివరకు రాలేదు. అయితే ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎమ్మెల్యేల ఎర కేసును తీవ్రంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించడమే కాదు.. బీజేపీలో కీలకనేతగా ఉన్న బీఎల్​ సంతోష్‌ను విచారణకు పిలుస్తూ నోటీసు ఇచ్చింది. దీంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విచారణను నిలిపివేయించేందుకు బీజేపీ నాయకులు కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. మరికొందరు ముఖ్యనాయకులకూ నోటీసులు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి కేంద్రంలోని మంత్రులు, ఆర్ఎస్సేస్​ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వారు కలిసి ఉన్న ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.

టీఆర్​ఎస్​ నేతలే టార్గెట్​గా: ఇదిలా ఉండగానే.. కరీంనగర్‌ జిల్లాలో గ్రానైట్‌ వ్యాపారులు రాయల్టీ ఎగ్గొట్టినట్లు 2013లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నివేదిక ఇచ్చింది. గ్రానైట్‌ ఎగుమతికి సంబంధించి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్‌ లక్ష్యంగా ఈడీ దాడులు చేసింది. క్యాసినో వ్యహారంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ సోదరులిద్దరినీ, ఆయన వ్యక్తిగత సహాయకుడిని కూడా విచారించారు. ఇక ఇప్పుడు అధిక సంఖ్యలో విద్యాసంస్థలున్న మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో పెద్దఎత్తున ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరికొందరు మంత్రులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు నాయకులకు విద్యాసంస్థలు, ఇతర వ్యాపారాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్​ఎస్​ లక్ష్యంగా మరికొన్ని సోదాలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.

దర్యాప్తు సంస్థలే కాదు, వాణిజ్య పన్నుల అధికారులు కూడా తనిఖీలు ప్రారంభించారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితం వచ్చిన వెంటనే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రాలో రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోదాలు చేయగా, టీఆర్​ఎస్​ నాయకులకు చెందిన సంస్థలపై కేంద్ర జీఎస్టీ అధికారులు చేశారు. మరికొన్ని ప్రముఖ వ్యాపార సంస్థల్లో జీఎస్టీ, ఆదాయపన్ను శాఖ సోదాలు జరిగాయి. ఒక పార్టీకి సన్నిహితంగా ఉండటమో, ఆర్థిక సాయం చేశారన్న అనుమానమో ఉంటే ఇంకోవైపు నుంచి సోదాలు జరుగుతున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల హల్‌చల్‌ కొనసాగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.