వందేభారత్​లో గట్టు పంచాయితీ.. టీటీఈల మధ్య జోన్ల జగడం

author img

By

Published : Jan 19, 2023, 9:20 AM IST

Updated : Jan 19, 2023, 11:24 AM IST

Vandebharat train

Vande Bharat TTE Issue : సికింద్రాబాద్​-విశాఖపట్నం మధ్య ఇటీవల అందుబాటులోకి వచ్చిన వందేభారత్​ రైలులో టీటీఈ సిబ్బంది నియామకం రెండు జోన్ల మధ్య సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే వందేభారత్​ నుంచి టికెట్‌ తనిఖీ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలంటూ తూర్పు కోస్తా జోన్‌ బుధవారం లేఖ రాసింది. రెండు వైపులా తమ సిబ్బందే విధులు నిర్వహిస్తారని జోన్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

Vande Bharat TTE Issue : వందేభారత్‌ రైలులో టికెట్లు తనిఖీ చేసే టీటీఈ సిబ్బంది నియామకం రెండు జోన్ల మధ్య జగడంగా మారుతోంది. ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ (నం.20833) వచ్చే ఈ రైలులో తూర్పు కోస్తా జోన్‌ నుంచి నలుగురు టీటీఈలు టికెట్‌ తనిఖీ విధుల్లో ఉంటున్నారు. మధ్యాహ్నం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం (20834) వెళ్లే రైలులో ద.మ.రైల్వే టీటీఈలు విధుల్లోకి వస్తున్నారు. టీటీఈలకు కేటాయించిన సీట్లలో వారు కూర్చుంటున్నారు. ఆ సమయంలో తూర్పు కోస్తా టీటీఈలు.. రైల్లో ఎక్కడైనా సీట్లు దొరికితే కూర్చుంటున్నారు. లేదంటే తలుపుల దగ్గర కూర్చుంటున్నారు. రాత్రికి విశాఖపట్నం చేరుకున్నాక ద.మ.రైల్వే టీటీఈలు అక్కడే నిద్రించి తెల్లవారుజామున అదే రైల్లో ఇలానే ఇబ్బందులు పడుతూ సికింద్రాబాద్‌ వస్తున్నారు.

....

Vande Bharat Express in Telangana : ఇలా ఒక రైలులో రెట్టింపు సంఖ్యలో సిబ్బంది ఉండటంతో మానవ వనరులు సైతం వృథా అవుతున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ నుంచి ద.మ.రైల్వే టికెట్‌ తనిఖీ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని తూర్పు కోస్తా జోన్‌ బుధవారం లేఖ రాసింది. ఈ రైలు నిర్వహణను తూర్పుకోస్తా జోన్‌ పరిధిలోకి వచ్చే విశాఖపట్నంలో చేపడుతున్న విషయాన్ని ప్రస్తావించింది. రెండు వైపులా తమ సిబ్బందే విధులు నిర్వహిస్తారని జోన్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

రైలుని నడిపే లోకో పైలట్‌, అసిస్టెంట్‌ లోకోపైలట్‌ విషయంలో ఈ సమస్య లేదు. సికింద్రాబాద్‌లో ఈ డివిజన్‌ లోకో సిబ్బంది డ్యూటీ ఎక్కి విజయవాడలో దిగుతున్నారు. అక్కడి నుంచి విశాఖపట్నం వరకు రాజమండ్రి డిపో లోకో సిబ్బంది రైలు నడుపుతున్నారు. వీరంతా ద.మ.రైల్వే సిబ్బందే.

వందేభారత్‌కు మంచి స్పందన: ద.మ.రైల్వే..: విశాఖపట్నం-సికింద్రాబాద్‌ నగరాల మధ్య ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వచ్చిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సీట్ల వినియోగం 100 శాతం కంటే అధికంగా ఉందని బుధవారం వెల్లడించింది. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య 16, 17, 18 తేదీల్లో 99%, 144%, 149% ఆక్యుపెన్సీ వచ్చిందని, ఇవే తేదీల్లో సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య 122%, 147%, 117% ఆక్యుపెన్సీ నమోదైందని తెలిపింది.

ఈ రైలులో 14 ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లలో 1024 సీట్లు, 2 ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లలో 104 సీట్లు కలిపి.. 1128 సీట్లు ఉన్నాయి.

రూ.10 వేల కోట్లు దాటిన సరకు రవాణా ఆదాయం..: సరకు రవాణా ద్వారా ద.మ.రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని గడించింది. 9 నెలల 16 రోజుల్లో ఈ మైలురాయిని చేరుకున్నట్లు ద.మ.రైల్వే బుధవారం ప్రకటించింది. జోన్‌ ఆరంభం నుంచి చూస్తే 2018-19లో మార్చి 9 నాటికి 343 రోజుల్లో రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని గడించగా ఇప్పుడు ఆ రికార్డును అధిగమించినట్లు ద.మ.రైల్వే తెలిపింది. 100 మిలియన్‌ టన్నుల సరకు రవాణా రికార్డును కూడా కొద్ది రోజుల క్రితమే జోన్‌ అధిగమించింది. సరకు రవాణా ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ‘బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌’లను ద.మ.రైల్వే ఏర్పాటు చేసింది. రోడ్డు ద్వారా జరిగే సరకు రవాణాను రైల్వే వైపుగా మళ్లించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రూ.10 వేల కోట్ల ఆదాయం రావడంతో జోన్‌ జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అధికారుల్ని అభినందించారు.

రవాణా చేసిన దాంట్లో సగం బొగ్గే..: జోన్‌ పరిధిలో గనులు, పరిశ్రమల నుంచి గూడ్సు రైళ్ల ద్వారా సరకు రవాణా చేస్తోంది. థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, సిమెంటు ప్లాంట్లకు రవాణా ఎక్కువ జరుగుతోంది. ముఖ్యంగా దేశంలో కొవిడ్‌ మొదలైనప్పటి నుంచి ఆహారధాన్యాలు, ఎరువుల రవాణా గూడ్సు రైళ్ల ద్వారా గతంలో కంటే పెరిగింది. సరకు రవాణాలో 50 శాతం బొగ్గు కాగా 26 శాతం సిమెంటు, 11 శాతం ఆహారధాన్యాలు, ఎరువులు, 13 శాతం ఇతరత్రా ఉన్నాయి.

ఇవీ చూడండి..

తొలిసారి విశాఖ చేరుకున్న ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’.. విశేషాలివే..

సెల్ఫీ కోసం వందేభారత్ ఎక్కాడు.. ఆ తర్వాత ఇరుక్కుపోయాడిలా

Last Updated :Jan 19, 2023, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.