Karnataka Results Effect On TS BJP : ఫుల్​ జోష్​లో టీ కాంగ్రెస్​.. నిరాశలో టీ బీజేపీ

author img

By

Published : May 14, 2023, 7:11 PM IST

Karnataka Results Effect

Karnataka Results Effect On Telangana BJP : కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయనే చర్చ జోరుగా నడుస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీకు రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపగా.. కమలనాథుల్లో మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చాయి.

Karnataka Results Effect On Telangana BJP : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ విజయదుందుబి మోగించడంతో ఆ ప్రభావం తెలంగాణ రాజకీయాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు ఈ ఫలితాలు దోహాదం చేస్తుంటే.. బీజేపీ ఆశలకు గండిపడిందని చెప్పుకోవచ్చు. బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని పదేపదే చెబుతూ వస్తున్న... కమలనాథులకు కర్ణాటక ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.

కర్ణాటకలో బీజేపీ గెలిస్తే.. తెలంగాణలో కాంగ్రెస్​ ఖాళీ: కర్ణాటకలో బీజేపీ గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతుందని బీజేపీ భావించింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ కనుమరుగవుతే ఆ పార్టీలోని ముఖ్యనేతలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంది. ఆపరేషన్‌ ఆకర్ష్​ను వేగవంతం చేసి ఇతర పార్టీల్లోని అసంతృప్తుల నేతలతో పాటు బీఆర్​ఎస్​ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకోవాలని తహతహలాడింది.

ఫలితాలు తారుమారు కావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆశలు కాస్త గల్లంతయ్యాయి. కొద్ది రోజుల పాటు బీజేపీలోకి చేరికలు ఆగిపోయే పరిస్థితి ఉంటుందని.. ఈ ప్రభావం ఎక్కువ రోజులు ఏమీ ఉండదని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. రెండు, మూడు నెలల పాటు పార్టీ కార్యక్రమాల్లో స్తబ్దత నెలకొంటుందని.. కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఎన్నికల నాటికి తిరిగి పుంజుకునేందుకు అవకాశం ఉందని కాషాయ దళం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

బీజేపీని వీడి కాంగ్రెస్​లోకి చేరికలు?: దక్షిణాదిన అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కోల్పోయి బొక్క బోర్లాపడింది. దక్షిణాదిన బీజేపీ దుకాణం బంద్‌ అయ్యిందని తెలంగాణలోనూ బీజేపీకు అధికారంలోకి రావడం కలేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీలోకి చేరికల సంగతి అటుంచితే.. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అసంతృప్త నేతలంతా బీజేపీను వీడి కాంగ్రెస్‌కు గూటికి చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రేవంత్​ రెడ్డితో రహస్య మంతనాలు: కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీలోని ఒక మాజీ ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం. ఇటీవల రేవంత్‌ రెడ్డిపై ఈటల రాజేందర్‌ చేసిన విమర్శలని సైతం ఆ ఎంపీ పరోక్షంగా ఖండించి.. రేవంత్​కి మద్దతుగా నిలిచారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సైతం బీజేపీని వీడనున్నట్లు ప్రచారం నడుస్తోంది. నేతల పార్టీ మార్పు ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం అప్రమత్తమైంది. ఎన్నికల వేళ నేతలు పార్టీని వీడితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.