వాన వదలడం లేదు.. పంట నిలవడం లేదు
Updated on: Jul 12, 2022, 8:53 AM IST

వాన వదలడం లేదు.. పంట నిలవడం లేదు
Updated on: Jul 12, 2022, 8:53 AM IST
Crop damage in Telangana due to rain : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. ప్రధాన వాణిజ్య పంట పత్తి సహా.. మొక్కజొన్న, కంది, సోయా ఇతర పంటల క్షేత్రాల్లో భారీగా నీరు నిలిచి వేళ్లు కుళ్లిపోతున్నాయి. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధిక వర్షాలతో తెగుళ్లు సోకుతున్నాయి. వివిధ దశల్లో ఉన్న పంటలు కాపాడుకోవడానికి రైతులు శ్రమిస్తున్నారు.
Crop damage in Telangana due to rain : జూన్లో నిరాశాజనకంగా కురిసిన వర్షాలు.. ఈ నెలలో ఎడతెరిపి లేకుండా పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్లో 129.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై.. 16 శాతం లోటు ఏర్పడింది. అదే జులైలో ఇప్పటికే 244 మిల్లీమీటర్లకు పైగా నమోదు కావడంతో.. 123 శాతం పైగా అదనపు వర్షం కురిసినట్లయింది. రాష్ట్రంలో 27 జిల్లాల్లో అదనంగా, 6 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి.
ఈ ఏడాది వానాకాలం కోటి 23 లక్షల 34 వేల 406 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. 42 లక్షల ఎకరాల్లో వరిసాగుకు నిర్ణయించగా.. ఇప్పటి వరకు కేవలం లక్షా 31 వేల 136 ఎకరాల్లోనే నాట్లుపడ్డాయి. జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, ఇతర చిరుధాన్యాల పంటలు 18.91 శాతం సాగయ్యాయి. కంది 33.15, పెసర 20.10, మినుము 30.34, ఇతర పప్పుధాన్యాలు 1.85 శాతం చొప్పున విత్తారు.
తెగుళ్లతో రైతుల ఆందోళన.. : 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం సూచించగా.. ఇప్పటి వరకు 31 లక్షల 86 వేల 635 ఎకరాల్లో సాగవుతోంది. మొత్తం అన్ని రకాల పంటల సాగు తీసుకుంటే 43 లక్షల 31 వేల 240 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. తాజాగా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో ప్రధాన వాణిజ్య పంట పత్తి, మొక్కజొన్న, కంది, సోయా చిక్కుడు, ఇతర పైర్లకు.. చీడ పీడలు, తెగుళ్లు ఆశిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆ జాగ్రత్తలు తీసుకోవాలి.. : ప్రస్తుతం వర్షాల దృష్ట్యా ఆయా పంటల్లో చీడపీడలు, తెగుళ్ల నివారణకు కర్షకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. పత్తిలో మొలక, మొక్కల దశలో ఉన్నందున.. క్షేత్రంలో నిలిచిపోయిన మురుగు నీరు త్వరగా తీసేయాలని సూచించారు.
