టీ కాంగ్రెస్​లో.. పెండింగ్‌ డీసీసీ అధ్యక్షుల నియామకంపై తొలగని సందిగ్ధత

author img

By

Published : Jan 25, 2023, 8:54 AM IST

Telangana Congress

Telangana Congress: రాష్ట్రంలో చేపట్టనున్న హాథ్‌సే హాథ్‌ జోడో అభియాన్‌ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే నెల 6నుంచి యాత్ర ప్రారంభం కానున్నా... రేపు బ్లాకుల్లో లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు... రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న ఏడు డీసీసీ అధ్యక్షుల విషయంలో ఏకాభిప్రాయం రాకపోవటంతో.. పాదయాత్ర వేళ పార్టీ నాయకత్వం ఆ దిశగా ముందడుగు వేయటంలేదు.

టీ కాంగ్రెస్​లో.. పెండింగ్‌ డీసీసీ అధ్యక్షుల నియామకంపై తొలగని సందిగ్ధత

Telangana Congress: రాహుల్ గాంధీ భారత్‌ జోడోయాత్ర ఈ నెల 30న కశ్మీర్‌లో ముగియనుంది. భారీ బహిరంగ సభతో ముగింపు కార్యక్రమం ఉండడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా హాజరవ్వాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలో ఈ నెల 26నుంచి ప్రారంభం కావాల్సిన "హాథ్‌సే హాథ్‌ జోడో అభియాన్‌" కార్యక్రమం వచ్చే నెల 6వ తేదీకి వాయిదా పడింది. కానీ, ముందుగా నిర్ణయించిన తేదీ మేరకు రేపు రాష్ట్రంలోని అన్ని బ్లాకుల్లో "హాథ్‌సే హాథ్‌ జోడో అభియాన్‌" యాత్ర ప్రారంభం కానుంది.

అలాగే ఈ నెల 30న రాహుల్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్లాకుల్లో జాతీయ జెండా ఎగుర వేసే కార్యక్రమం నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. హాథ్‌సే హాథ్‌ జోడో అభియాన్‌ ద్వారా బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ఇంటింటికి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్‌ కార్యాచరణతో సిద్ధమవుతోంది. అధిష్ఠానం పిలుపు మేరకు 'హాథ్‌సే హాథ్‌ జోడో అభియాన్‌' ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఛార్జిషీట్లు: దీనికి సంబంధించి 12మంది సభ్యులతో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నేతృత్వంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఛార్జిషీట్లు వేసేందుకు కసరత్తు జరుగుతోంది. మరోవైపు పార్లమెంటు స్థానాల వారీగా వర్కింగ్‌ ప్రెసిడెంట్లను కేటాయించడంతో పాటు ఉపాధ్యక్షులను, సీనియర్‌ ఉపాధ్యక్షులను.. లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంఛార్జిలుగా నియమించింది.

2 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శి: వీరు కాకుండా ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన కార్యదర్శులను ఇంఛార్జిలుగా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. 2 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శిని నియమించాలని పీసీసీ భావిస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల డిమాండ్ల మేరకు రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శుల సంఖ్య ఇప్పుడున్న 84 నుంచి 100అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇవ్వరాదన్న నిబంధన: అదేవిధంగా కార్యదర్శుల నియామకంపై దృష్టి సారించినప్పటికీ.. జోడో యాత్ర మొదలయ్యేనాటికి పూర్తయ్యే అవకాశాలు లేవు. మరోవైపు రాష్ట్రంలోని 26 జిల్లా అధ్యక్షులను నియమించిన ఏఐసీసీ.. 7 జిల్లాలకు సంబంధించి నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో పెండింగ్‌లో ఉంచింది. సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌, మెదక్‌ జిల్లాల డీసీసీల విషయంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇవ్వరాదన్న నిబంధనతో ఆపారు.

అదే అమలు చేయాలనుకుంటే ఈ మూడు చోట్ల ఇప్పటి వరకు అనుకుంటున్న సికింద్రాబాద్‌లో అనిల్‌కుమార్‌, ఎల్బీనగర్‌లో మల్‌రెడ్డి రాంరెడ్డి, మెదక్‌కు నిర్మలగౌడ్‌లు నియామకంపై సందిగ్ధత తొలిగే అవకాశం లేదు. మరో వైపు జనగాం డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని నియమించాలని రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భావిస్తుంటే.. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాత్రం జంగా రాఘవరెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పొన్నాల మాత్రం సంతోశ్‌రెడ్డిని నియమించాలని కోరుతున్నారు. భూపాలపల్లిలో ప్రకాష్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. పెద్దపల్లి డీసీసీగా నియామకమైన రాజ్‌ఠాకూర్‌ స్థానంలో మరొకరిని నియమించాలని శ్రీధర్‌బాబు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేటలో ఇప్పుడున్న చెవుటి వెంకన్ననే డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పట్టుబడుతుండగా.. మార్పు చేయాలని ఉత్తమ్‌ కోరుతున్నట్లు తెలుస్తోంది.

తమకు సంబంధించిన వారికే డీసీసీలు ఇవ్వాలి: ఇలా ఎక్కడిక్కడ నాయకులు పట్టువీడకుండా తమకు సంబంధించిన వారికే డీసీసీలు.. ఇవ్వాలని పట్టుబడుతుండటంతో పెండింగ్‌లో ఉన్న జిల్లాల పదవులు ఇప్పట్లో తేలే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర ప్రారంభమవుతున్న సమయంలో.. ఈ నియామకాలను తాత్కాలికంగా వాయిదా వేసి, ఉన్నవారితోనే కొనసాగించాలని కొందరు సీనియర్‌లు కోరుతున్నారు.

ఎవరూ వెనక్కి తగ్గడంలేదు: నేతల మధ్య విబేధాలు సమసిపోయి.. కలిసి పని చేసే వాతావరణం తాజాగా నెలకొన్నప్పటికీ తమ మద్దతుదారులకు పదవులు దక్కించుకోవడంలో ఎవరూ వెనక్కి తగ్గడంలేదు. దీంతో పెండింగ్‌ డీసీసీల విషయంలో ఇంఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే సమక్షంలోనే ఓ నిర్ణయం తీసుకుని, వివాదం లేకుండా ప్రక్రియ పూర్తిచేయాలని పీసీసీ భావిస్తోంది. ఈ నియామకాలు హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర ప్రారంభానికి ముందా.. తర్వాతా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇవీ చదవండి: పార్టీ నేతల మధ్య అభిప్రాయ బేధాలే తప్పా ఆక్రోశాలు లేవు: మాణిక్‌రావ్‌ ఠాక్రే

అవలీలగా యోగాసనాలు.. అక్కాచెల్లెళ్ల అద్భుతమైన ప్రతిభ.. 70 ఏళ్ల తాతే గురువు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.