పందెంలో ఏ కోడి ఎప్పుడు గెలుస్తుంది.. కోడిశాస్త్రం ఏం చెబుతోంది!

author img

By

Published : Jan 13, 2021, 8:24 PM IST

betcocks

పౌరుషానికి ప్రతిరూపాలు పందెంకోళ్లు.. కత్తికట్టి బరిలోకి దించితే.. యజమాని పరువు కోసం.. ప్రాణాలు పణంగా పెట్టి.. కొట్లాడుతుంది. ఇక సంక్రాంతి అంటే.. కోళ్ల కొట్లాట కాదు... కోట్లాటే.! ఢీ అంటే ఢీ అనే కోడి పుంజులకు గిరాకీ ఎక్కువ. అందులోనూ చాలా రకాలుంటాయి. మరివాటిని ఎలా గుర్తించాలి.? ఎలా పెంచాలి? ఏం తినిపించాలి.? ఏ ముహూర్తాన ఏ కోడి గెలుస్తుంది? పందెం రాయుళ్లు విశ్వసించే కోడిశాస్త్రం ఏం చెప్తోంది?

సంక్రాంతి కోడిపందేల్లో కోట్లు చేతులు మారుతుంటాయి. బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన ఆనందం. ఓడిపోతే తట్టుకోలేని అవమానాలు సర్వసాధారణం. కోడిపుంజు మెడమీద ఈకలు రెక్కించి ఒక్క ఉదుటున గాలిలోకి లేచి.. ప్రత్యర్థిని పడగొట్టే దృశ్యం పందెంరాయుళ్లకు కావాల్సినంత కిక్కిస్తుంది.

కోళ్ల పందాలకు నియమ నిబంధనలుంటాయి. పందెంలో తలపడే.. రెండు కోళ్ల బరువు.. ఇంచుమించు సమంగా ఉండాలి. ఒంగోలు గిత్తల్లాగే కోళ్లకూ పోషణ, శిక్షణ ఉంటుంది. బాదం, పిస్తా, ఆక్రూట్, కిస్‌మిస్‌లతో పుంజులను మేపుతారు. కుంకుమ పువ్వు, సోంపు, మిరియాలు, సొంఠి, చేదు జీలకర్ర, మేడిపళ్లతో కలిపిన మిశ్రమాన్ని పట్టిస్తారు. ఇవేకాకుండా మేక ఎముకలపొడి, ఉడకబెట్టిన కోడిగుడ్లనూ అందిస్తారు. బరిలో అలసిపోకుండా ఉండేందుకు.. ఈత సాధన చేయిస్తారు. అన్నింటికీ మించి పందెం కోళ్లకు బ్రహ్మచర్యం తప్పనిసరి. లక్షలు గెలిచే ఈ పందెం కోళ్ల ధర కూడా వేలల్లోనే ఉంటుంది.

పందెంరాయుళ్లకు జాతకాలు, నమ్మకాలూ ఎక్కువే. పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి కోడి రంగు, జాతి ప్రకారం బరిలోకి దింపుతారు. భోగి రోజు గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు గెలుపొందుతాయని.., మకర సంక్రాంతికి యాసర కాకి డేగలు, కాకి నెమలిలు, పసిమగల్ల కాకులు విజయం సాధిస్తాయని విశ్వసిస్తారు. ఇక కనుమరోజు.. డేగలు, ఎర్రకాకి డేగలు గెలుస్తాయని పందెంరాయుళ్ల నమ్మకం.

పందెంలో గెలిచిన కోడికే కాదు.. ఓడిన పుంజులకు గిరాకీ ఎక్కువే. ఎంతో బలిష్టంగా ఉండే ఈ కోడి మాంసం కోసం వేలం పాటలు జరిపిన సందర్భాలూ ఉన్నాయి.

ఇదీ చదవండి: జనగామ లాఠీఛార్జీ ఘటనపై విచారణకు వరంగల్​ సీపీ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.