No Mask Challan in TS : 11 రోజుల్లోనే 62 వేల మందికి జరిమానా.. ఎందుకింత నిర్లక్ష్యం..

author img

By

Published : Jan 13, 2022, 8:15 AM IST

No Mask Challan in TS

No Mask Challan in TS :కొవిడ్‌ కట్టడిలో భాగంగా బహిరంగ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ నిబంధనలు పాటించకుండా.. చాలా మంది మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్నారు. అలా తిరుగుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 11 రోజుల్లోనే 62 వేల మందికి జరిమానా విధించారంటే.. ఎంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది.

No Mask Challan in TS: కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు కనిపించడంలేదు. మాస్కులు ధరించని వారిపై నమోదవుతున్న కేసులే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పోలీసు శాఖ ఈ నెల మొదటి 11 రోజుల్లో రాష్ట్రంలో మాస్కులు ధరించని వారిపై 62,711 కేసులు నమోదు చేసింది. ఈ లెక్కన ప్రతి రోజూ సగటున 5,700 మందిపై కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ కట్టడిలో భాగంగా బహిరంగ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో పోలీసు శాఖ ఈ నిబంధనను కఠినంగా అమలుచేస్తోంది.

మాస్కులు ధరించనివారిపై గతేడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14 లక్షల కేసులు నమోదు చేసిన పోలీసు శాఖ.. ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున సుమారు రూ.140 కోట్ల జరిమానా విధించింది. రెండో దశ ఉద్ధృతి తగ్గిన తర్వాత మాస్కులధారణను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం పాజిటివ్‌లు ఎక్కువగా పెరుగుతుండటంతో నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు. ఇందులోభాగంగా ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 62,711 మందికి రూ.6 కోట్లకుపైగా జరిమానా విధించారు. అత్యధికంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 16,569 కేసులు నమోదవగా.. సైబరాబాద్‌ కమిషనరేట్లో 8,405, రాచకొండలో 7,825 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 222, భూపాలపల్లిలో 311, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 336 కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోలీసులు జనం గుమిగూడిన బహిరంగ ప్రదేశాలను, మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని సీసీ కెమెరాలు, కృత్రిమమేధ ద్వారా గుర్తిస్తూ జరిమానాలు విధించనున్నారు. దీనికోసం పోలీసు శాఖ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.

ఇదీ చూడండి: '5 నిమిషాల్లో సంక్రమణ సామర్థ్యాన్ని కోల్పోతున్న కరోనా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.